*కరువు నివారణకు శాశ్వత పరిష్కారం కనుగొందాం
*
- *: కేంద్ర వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు శివరాజ్ సింగ్ చౌహాన్*
పుట్టపర్తి, జులై 10 (ప్రజా అమరావతి):
- *రాయలసీమ జిల్లాల్లో కరువు నివారణకు శాశ్వత పరిష్కారం కనుగొందామని కేంద్ర వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. గురువారం పుట్టపర్తి పట్టణం, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని కరువు పీడిత జిల్లాల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, రాష్ట్ర హార్టికల్చర్ అండ్ సిరికల్చర్ కమిషనర్ కే.శ్రీనివాసులు, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్, అనంతపురం జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, కర్నూలు జాయింట్ కలెక్టర్ నవ్య, తదితరులు పాల్గొన్నారు.*
- *ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలలో కరువును శాశ్వతంగా పరిష్కరించాలన్నదే తమ ఉద్దేశం అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు కలిసికట్టుగా కూర్చుని ఆలోచన చేయాలని, అలాగే కేంద్రంతో కూడా కరువు నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఆలోచించాలన్నారు. అధికారులు ఆయా జిల్లాల యంత్రాంగంతో కలిసి వివిధ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. తమ ఆధ్వర్యంలో రూరల్ డెవలప్మెంట్, ఎన్ఆర్ఈజిఎస్, వాటర్ షెడ్, తదితర వాటి కింద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, ఇతర శాఖలకు సంబంధించి ఎలాంటి సహకారం కావాలన్నా తాము అందించడం జరుగుతుందన్నారు. ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని, ఎక్కడ ఎలాంటి లోపాలు ఉన్నాయి అనేది అధికారులకు క్షుణ్ణంగా తెలుసని, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎలా అధిగమించవచ్చు అనేది కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా భాగస్వామ్యం చేసి క్షేత్రస్థాయిలో కరువుకు శాశ్వత పరిష్కారం ఏ విధంగా తీసుకురావచ్చు అనేదానిపై దృష్టి పెట్టాలన్నారు. ఇప్పుడు ఏం చేయాలి, రేపు, భవిష్యత్తులో ఏం చేయాలి, వచ్చే పదేళ్లకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేదానిపై కార్యచరణ ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. ఈ విషయం అధికారులు అంతా కలిసికట్టుగా కూర్చుని తగిన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ఏమైనా ఆలోచనలు ఉంటే తెలియజేయాలన్నారు. ఇంటిగ్రేటెడ్ మోడల్ తయారుచేసి కరువు నివారణకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కరువు నివారణ చర్యలపై దృష్టి పెట్టాలని, కేంద్రం కూడా ఇందుకు సహకారం అందిస్తుందన్నారు.*
- *ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాలు, ఉద్యాన శాఖ పరిధిలో పరిస్థితుల గురించి తెలియజేశారు.*
- *రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, రాష్ట్ర హార్టికల్చర్ అండ్ సిరికల్చర్ కమిషనర్ కే.శ్రీనివాసులు మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలలో కరువు పరిస్థితి, వివిధ పంటల సాగు వివరాలు, ఇరిగేషన్ అంశాల గురించి ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. బుందేల్ఖండ్ రీజియన్ మాదిరిగా రాయలసీమ జిల్లాలకు కూడా ఆర్థిక సహాయం ప్రకటించాలని, సీమ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో రాయలసీమ జిల్లాల వ్యవసాయ, ఉద్యాన, అనుబంధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment