*విశాఖలో జిసిసి ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పందం!*
*10వేల ఉద్యోగాలు కల్పించేలా ANSR సంస్థతో ఎంఓయు*
*జిసిసి, ఐటి రంగాల్లో 5లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యం*
*ఏడాదిలోనే గ్లోబల్ ప్లేయర్ లను ఆకర్షించడం మా తొలి విజయం*
*ఎఎన్ఎస్ఆర్ ఎంఓయు కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్*
బెంగళూరు, 08 జూలై, 2025 (ప్రజా అమరావతి): గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCCs) స్థాపన, నిర్వహణలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న ANSR సంస్థ విశాఖపట్నంలో GCCs కోసం ఒక ప్రత్యేకమైన ఇన్నోవేషన్ క్యాంపస్‌ను స్థాపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసింది. రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ మేరకు కుదిరిన ఒప్పందం ప్రకారం ANSR సంస్థ మధురవాడ IT క్లస్టర్‌లో అత్యాధునిక GCC ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టనుంది. ఈ క్యాంపస్ ద్వారా రాబోయే ఐదు సంవత్సరాల్లో 10వేలమందికి పైగా ఉద్యోగాలు కల్పించనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అత్యుత్తమ ప్రతిభ గల పర్యావరణ వ్యవస్థను ఉపయోగించుకోవడంలో ప్రపంచస్థాయి సంస్థలకు ANSR మద్దతునిస్తుంది. ANSR సంస్థ సిఇఓ లలిత్ అహూజా మాట్లాడుతూ... ప్రపంచస్థాయి ప్రతిభ, బలమైన మౌలిక సదుపాయాలు, విజనరీ లీడర్ షిప్ మేలు కలయికగా ఉన్న విశాఖ మహానగరం అద్భుతాలను సృష్టిస్తుంది, విశాఖలో తాము ఏర్పాటుచేసే ఇన్నోవేషన్ క్యాంపస్ ప్రపంచస్థాయి ప్రతిష్టాత్మక సంస్థలకు గమ్యస్థానంగా మారబోతోందని చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... రాబోయే నాలుగేళ్లలో ఎపిలో 20లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది మా లక్ష్యం, ఇందులో ఐటి, జిసిసి రంగాల్లోనే 5లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నాం. ఇందుకోసం విశాఖ మహానగరం నుంచే మా ప్రయాణం ప్రారంభించాం. దీనిని మేం టార్గెట్ గా మాత్రమేగాక ఒక ఉద్యమంలా స్వీకరించాం. బెంగుళూరు, గోవా నగరాల మేలు కలయిక విశాఖ నగరం. వ్యాపారానికి అనుకూలమైన నగరంగానే గాక ప్రతిభను ఆకర్షించే ప్రాంతంగా విశాఖను తయారుచేయాలన్నది మా విధానం. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం.
మా ఆర్థిక వృద్ధి వ్యూహంలో జిసిసిలదే కీలకపాత్ర, కొద్దినెలల్లోనే మేము ఈ రంగంలో గ్లోబల్ ప్లేయర్లను ఆకర్షించడం మా తొలి విజయం. జిసిసిలను స్ట్రాటజిక్ హబ్ లుగా మార్చేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టాం. ఇందులో భాగంగా టిసిఎస్, కాగ్నిజెంట్ లకు ఎకరా 99 పైసలకే భూములను కేటాయించాం. భారత్ లోని టాప్ – 100 ఐటి కంపెనీలను ఎపికి రప్పించాలన్నదే మా లక్ష్యం. కేవలం ప్రోత్సహకాలు అందించడమేగాక ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నాం. జిసిసిల అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు, క్లౌడ్, ఎఐ సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ ఇంజనీరింగ్ ను బలోపేతం చేస్తూ టాలెంట్ పైప్ లైన్ కోసం పలు కంపెనీలతో కలసి పనిచేస్తున్నాం.
విశాఖ నగరంపై ఇప్పటికే ప్రపంచస్థాయి సంస్థలు దృష్టి సారించాయి. గూగుల్ సంస్థ అమెరికా వెలుపల తొలిసారిగా అతిపెద్ద డాటా సెంటర్ ను నిర్మించబోతోంది. భారతదేశంలోనే అతిపెద్ద డాటా సిటీని విశాఖలో అభివృద్ధి చేస్తున్నాం. ఇక్కడ హైపర్ స్కేల్ క్లౌడ్ మౌలిక సదుపాయాలు, ఎఐ ల్యాబ్ లు, ఎనలిటిక్ హబ్ లు, కంప్యూటింగ్ క్లస్టర్లతో కలసి ఉంటాయి. విశాఖ నగరం ప్రపంచంలోనే డిజిటల్ లీడర్ షిప్ కు సిద్ధం ఉందనడానికి ఇదొక సంకేతం. మేము కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకుండా ఫలితాలపై శ్రద్ధ వహిస్తున్నాం. టిసిఎస్, కాగ్నిజెంట్ రాకతో ఐటి, జిసిసి రంగాల్లో 5లక్షల ఉద్యోగాలు సాధించాలన్న మా లక్ష్యంలో 12శాతం ఇప్పటికే నెరవేరింది. ఎమర్జింగ్ సిటీస్ ఫ్రేమ్ వర్క్ లో భాగంగా అమరావతి, తిరుపతి, అనంతపురం, కాకినాడ వంటి నగరాల్లో స్మార్ట్ ఇన్ ఫ్రాస్ట్రర్ అభివృద్ధి చేస్తున్నాం. గ్లోబల్ సిటీ విశాఖకు మెరుగైన ఎయిర్ కనెక్టివిటీ కోసం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మిస్తున్నాం. విశాఖ నగరాన్ని ప్రపంచ జిసిసి నూతన రాజధానిగా మార్చేందుకు మాతో కలసి పనిచేయండి. విశాఖలో నూతనాధ్యాయం కోసం మేం చేస్తున్న కృషిలో భాగస్వాములు కావాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎపి ఐటి శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ పాల్గొన్నారు.
addComments
Post a Comment