డేగ కన్నుతో గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాము.

 *డేగ కన్నుతో  గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాము


*

*•ప్రభుత్వం, హోమ్ శాఖ, ఈగల్ టీమ్ సమిష్టి కృషితో మంచి ఫలితాలు సాదించాం*

*•గంజాయి హబ్ గా పేరొందిన ఉత్తరాంద్ర ఏజన్సీని కాఫీ బ్రాండ్ గా తీర్చిదిద్దాము* 

*రాష్ట్ర హోం మరియు డిజాస్టర్ శాఖ మంత్రి  వంగలపూడి అనిత*


అమరావతి, జులై 14 (ప్రజా అమరావతి):  రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో వారి సూచనలు, సలహాల మేరకు డేగ కన్నుతో గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపి గత ఏడాది కాలంలో మంచి ఫలితాలను సాధించడం జరిగిందని రాష్ట్ర హోం మరియు డిజాస్టర్ శాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ప్రభుత్వం, హోం శాఖ మరియు ఈగల్ టీమ్ సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు.    సోమవారం రాష్ట్ర సచివాలయంలో పాత్రికేయులతో ఆమె మాట్లాడుతూ  రాష్ట్రం నుండి గంజాయి, డ్రగ్స్  మహమ్మారిని తరిమికొట్టేందుకు  శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన నాటి నుండే ఒక యజ్ఞాన్ని  ప్రారంభించడం జరిగిందన్నారు. ఇందులో బాగంగా విద్య, వైద్య, ఎక్సైజ్, గిరిజన సంక్షేమం మరియు హోం శాఖల మంత్రులతో ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కమిటీ నేతృత్వంలోఅమరావతి హెడ్ క్వార్టర్ తో పాటు రాజమహేంద్రవరం మరియు విశాఖపట్నం కేంద్రాలుగా  ఈగల్ టాస్కు ఫోర్సును  ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా 26 జిల్లాల్లో ఈగల్ సెల్స్ ను ఏర్పాటు చేసి గంజాయి, డ్రగ్స్ నియంత్రణకై పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అన్ని ప్రముఖ కేంద్రాల్లో చెక్ పోస్టులు, సిసి కెమేరాలు పెట్టి గంజాయి సాగును, రవాణాను నియత్రించడం జరిగిందన్నారు. గత ఏడాది కాలంలో దాదాపు 831 కేసులను బుక్ చేసి 2,114 మందిని అరెస్టు చేయడమే కాకుండా  23,770 కేజీల గంజాయిని, 27 లీటర్ల హాషిష్ ఆయిల్ ను సీజ్ చేయడం జరిగిందన్నారు. 293 వాహనాలను కూడా సీజ్ చేశామన్నారు.  గంజాయి సాగును ప్రోత్సహించే కింగ్ పిన్స్ పై దృష్టి సారించడమే కాకుండా వారి ఆర్థిక లావాదేవీల ఆధారంగా ఏడుగురికి చెందిన రూ.7.75 కోట్ల ఆస్తులను కూడా సీజ్ చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఆపరేషన్ గరుడ లో భాగంగా దాదాపు 100 జాయింట్ టీమ్ లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ షాపులపై దాడులు నిర్వహించి డ్రగ్స్ అండ్ కాస్మొటిక్ యాక్టు-1940 ని ఉల్లంఘిస్తున్నట్లుగా  150 మెడికల్ షాపులను గుర్తించి సీజ్ చేయడం జరిగిందని ఆమె తెలిపారు.  ఒడిస్సా లింక్డు 27 రైళ్లల్లో ఈగల్ టీమ్స్ జాయింట్ రైల్ బేస్డు ఆపరేషన్స్ నిర్వహించి ఆరుగురిని అరెస్టు చేయడమే కాకుండా  37 కేజీల గంజాయిని, 152 గంజా చాక్లేట్స్ ను సీజ్ చేయడం జరిగిందన్నారు. 


గతంలో గంజాయి, డ్రగ్స్ కు హబ్ గా ఆంధ్రప్రదేశ్ మారిపోయిందని ప్రక్క రాష్ట్రాల డిజిపిలే విమర్శించే వారన్నారు.  అయితే ఇప్పుడు రాష్ట్రంలో అటు వంటి పరిస్థితులు లేవని, గంజాయి హబ్ గా పేరొందిన ఉత్తరాంద్ర ఏజన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు నేడు అత్యత్తమమైన కాఫీకి బ్రాండ్ గా మంచి పేరు పొందాయన్నారు. ప్రపంచంలోని పలు దేశాలతో పాటు పార్లమెంట్ లో కూడా అరకు  కాఫీ అవుట్ లెట్స్ ను పెట్టి ఎంతగానో ప్రమోట్ చేయడం వల్ల ఇది సాధ్యమైందన్నారు. అదే సమయంలో ఈగల్ టాస్కు ఫోర్సెస్, ఈగల్ సెల్స్ ద్వారా 325 హాట్ స్పాట్ స్టాట్ గ్రామాల్లో గంజాయి సాగును నియంత్రించడమే కాకుండా, గిరిజనుల జీవనోపాధికై  35 వేల ప్రత్యామ్నయ పంటల సాగుకై గత ఏడాది కాలంలో దాదాపు 40 లక్షల మొక్కలను పంపిణీ చేస్తూ తగిన ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరుగుచున్నదన్నారు.  ఈ ఏడాది 2 కోట్ల మేర మొక్కలను పంపిణీ చేసే లక్ష్యాన్ని నిర్థేశించుకోవడం జరిగిందన్నారు. ఏఎస్ఆర్ జిల్లాలో 94.77 ఎకరాల్లో గంజాయి సాగును రూపుమాపి, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకై 31,185 మొక్కలను పంపిణీ చేయడం జరిగిందన్నారు.  దాదాపు 8,200 అవగాహన శిభిరాలను నిర్వహించి గంజాయి సాగు వల్ల సంభవించే పరిణామాలు, ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న కఠిన చర్యలను అమాయకులైన  గిరిజనులకు వివరించడం జరిగిందని ఆమె తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు, కళాశాలల్లో దాదాపు 40 వేలకు పైగా ఈగల్ క్లబ్ లను ఏర్పాటు చేసి విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ బారిన పడకుండా అవగాహన కల్పించడం జరుగుతుందని ఆమె తెలిపారు. 


ఈగల్ ఐజి రవికృష్ణ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా  ఈగల్ ఇప్పటికి వరకూ సాదించిన ప్రగతిని వివరిస్తూ గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో భవిష్యత్తులో  వ్యూహాత్మంగా  చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు.  గంజాయి, డ్రగ్స్ నియంత్రణా చర్యల్లో భాగంగా డేటా సెంటర్ ఏర్పాటుతో పాటు మాదకద్రవ్యాల నెట్ వర్కును ఆధునిక సాంకేతిక సహాయంతో చేదించేందుకు చర్యలు తీసుకోనున్నామన్నారు. మాదకద్రవ్యాల సరఫరా, వినియోగించే నేరస్తులపై ఆర్థిక దర్యాపు చేయడంతో పాటు PITNDPS చట్టాన్ని పటిష్టంగా అమలు పర్చుతామన్నారు. పరివర్తన చెందిన నేరస్తులకు పునరావాసం కల్పిస్తామని, ఈగల్ క్లబ్స్ ద్వారా  “డ్రగ్స్ ఒద్దు బ్రదర్” అంటూ  డ్రగ్స్ వల్ల ఎదురయ్యే దుష్పలితాలపై అవగాహన కల్పిస్తామన్నారు. 



Comments