*మీడియాలో వచ్చిన కథనానికి స్పందించిన గివింగ్ బ్యాక్ టూ సొసైటీ*
*గుంటూరులో బాలుడు యశ్వంత్ కుటుంబానికి తోపుడు బండి అందజేత*
*బాలుడి తల్లి రాధికకు కలెక్టర్ చేతుల మీదుగా తోపుడు బండి అందజేసిన గివింగ్ బ్యాక్ టూ సొసైటీ*
*గివింగ్ బ్యాక్ టూ సొసైటీకి కృతజ్ఞతలు తెలిపిన బాలుడి కుటుంబ సభ్యులు*
గుంటూరు (ప్రజా అమరావతి): గుంటూరు నగరంలోని వెంకట్రావుపేటకు చెందిన అలవాల యశ్వంత్ అనే బాలుడి కుటుంబానికి గివింగ్ బ్యాక్ టూ సొసైటీ ఆసరాగా నిలిచింది. జీజీహెచ్ రైల్వే స్టేషన్ వైపు ఉన్న తమ కుటుంబానికి జీవనాధారమైన టిఫిన్ బండిని తొలగించారని, ఆస్పత్రి బయట ఎక్కడైనా టిఫిన్ బండి పెట్టుకునేందుకు అవకాశం కల్పించాలని సోమవారం కలెక్టర్‌కు యశ్వంత్ అనే బాలుడు విజ్ఞప్తి చేశాడు. ఆ విషయం మీడియాలో ప్రచారం కావడంతో గివింగ్ బ్యాక్ టూ సొసైటీ స్పందించింది. మంగళవారం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి చేతుల మీదుగా బాలుడి తల్లి అలవాల రాధికకు గివింగ్ బ్యాక్ టూ సొసైటీ సహకారంతో టిఫిన్ బండి అందజేశారు. తమ కుటుంబానికి జీవనోపాధి కల్పించే విధంగా కొత్త టిఫిన్ బండి అందజేసిన గివింగ్ బ్యాక్ టూ సొసైటీ ప్రతినిధులకు బాలుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ గివింగ్ బ్యాక్ టూ సొసైటీ ప్రతినిధుల సేవా కార్యక్రమాలను అభినందించారు. సేవా భావంతో చేసే కార్యక్రమాలు ఎంతో సంతృప్తినిస్తాయన్నారు. సమాజసేవ ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలన్నారు. జీవితంలో ఉన్నతస్థాయికి ఎదిగిన ఎవరైనా సరే సమాజం కోసం తమ సంపాదనలో కొంత భాగాన్ని కేటాయించాలని, మరీ ముఖ్యంగా ఉన్నత కుటుంబాలకు చెందిన వారు దీన్నో బాధ్యతగా భావించాలని కలెక్టర్ సూచించారు.
addComments
Post a Comment