దసరా నవరాత్రి ఉత్సవాలపై తొలి సమన్వయ సమావేశం
విజయవాడ (ప్రజా అమరావతి);
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరగనున్న దసరా నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా స్థాయి అధికారులతో మొదటి సమన్వయ సమావేశం మంగళవారం విజయవాడ కలెక్టరేట్‌లో జరిగింది.
ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, ఐ.ఎ.ఎస్., పోలీస్ కమిషనర్ (CP) శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు, ఐ.పి.ఎస్, ఆలయ కార్యనిర్వహణాధికారి (EO) వి.కె. శీనా నాయక్, స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ కలెక్టర్, మరియు ఇతర ముఖ్య శాఖల అధికారులు హాజరయ్యారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దసరా ఉత్సవాల ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించాలని, సామాన్య భక్తుని సంతృప్తే ప్రధానమని అధికారులను ఆదేశించారు.
కమాండ్ కంట్రోల్ రూమ్: గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి లోపాలు లేకుండా పటిష్టమైన కమాండ్ కంట్రోల్ రూమును ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
నిరంతర పర్యవేక్షణ: ప్రత్యేక యాప్, టెక్నాలజీతో పాటు డ్రోన్ల ద్వారా ఉత్సవ ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుంది.
భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, ప్రసాదం కౌంటర్లు, తాగునీటి సౌకర్యాలు మరియు తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటుపై సమగ్ర సమీక్ష జరిగింది.
ట్రాఫిక్ & భద్రత: ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, పారిశుధ్య నిర్వహణ మరియు ఇతర శాఖల మధ్య సమన్వయంపై ప్రత్యేకంగా ఒక యాప్ ద్వారా దృష్టి సారించారు.
ఉత్సవాల సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా, ప్రమాదాలు నివారించడానికి చర్యలు మరియు కొండచరియలు విరిగిపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చ జరిగింది.
మూలా నక్షత్రం రోజున అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసి, అందుకు అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ దర్శన టిక్కెట్లను అందుబాటులో ఉంచడంపై చర్చించారు.
దసరా నవరాత్రి ఉత్సవాలు సురక్షితంగా మరియు విజయవంతంగా నిర్వహించడానికి అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఉత్సవాల సమయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, భక్తులు కూడా సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో అదనపు డిప్యూటీ పోలీస్ కమీషనర్, విజయవాడ వెస్ట్ జోన్ ACP, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు
addComments
Post a Comment