*పక్కా ప్రణాళికతోనే జగన్ పర్యటనలు చేస్తున్నారు
*
- శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు యత్నిస్తున్నారన్న మంత్రి అచ్చెన్నాయుడు
- ఐదారు జిల్లాల నుంచి జనాలను తరలించడం ఎందుకని ప్రశ్న
- పథకం ప్రకారమే రోడ్లపై మామాడి పండ్లు పోశారని విమర్శ
- పోలీసుల పట్ల భాద్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు
అమరావతి (ప్రజా అమరావతి);
వైసీపీ అధినేత జగన్ చేపడుతున్న పర్యటనలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన జగన్‌కు లేదని, కేవలం రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకే పక్కా ప్రణాళికతో యాత్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బుధవారం కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్‌తో కలిసి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. జగన్ పర్యటనలు సినిమా సెట్టింగుల్లా ఉన్నాయని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. "పరామర్శకు వెళ్తే రైతులను కలిసి మాట్లాడాలి కానీ, ఐదారు జిల్లాల నుంచి జనాన్ని తరలించడం ఎందుకు? ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే రోడ్లపై మామిడి పండ్లను పోశారు. ఇది క్రిమినల్ మైండ్‌తో చేసే పని" అని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి చర్యలతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. తోతాపురి మామిడి రైతుల సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈసారి 7 లక్షల మెట్రిక్ టన్నుల బంపర్ క్రాప్ రావడం, పల్ప్ పరిశ్రమల వద్ద గతేడాది నిల్వలు ఉండటంతో ధర పడిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో, పరిశ్రమలతో మాట్లాడి కిలో మామిడిని రూ.8కి కొనేలా ఒప్పించామని, ప్రభుత్వం తరఫున కిలోకు రూ.4 చొప్పున సాయం అందిస్తున్నామని వివరించారు. ప్రకాశం జిల్లా వైసీపీ నేతలు సైతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆనందం వ్యక్తం చేసారని తెలిపారు. 2014-2019 హయాంలో మామిడి రైతులకు 2.50 రూ సబ్సిడీని అందచేసామని, ఈ ఏడాది కూడా ప్రభుత్వం అంతే ఇస్తారని భావించారని కానీ అనూహ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేజీకి 4 రూపాయలు రైతులకు ప్రభుత్వంచే అందచేయాలని నిర్ణయించడం పట్ల రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. ఇప్పటికే అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం రైతులను ఆదుకుంటున్న తర్వాత కూడా జగన్ పర్యటనలు చేయడం వెనుక దురుద్దేశం ఉందని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలన్నదే ఆయన లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శించారు. జగన్ రెడ్డి ఆత్మ-పరమాత్మ అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పల్ప్ ఫ్యాక్టరీలు ఉన్నాయని, ఆయన 12 చొప్పున మామిడి పంట కొనే దమ్ము ధైర్యం ఉందా, లేక జగన్ రెడ్డి ఆయన చేత కొనిపించగలడా అని ప్రశ్నించారు.
*పక్కా ప్లాన్ తో మామిడి ట్రాక్టర్లను తెచ్చారు*
చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి సెక్రటరీ ప్రకాశ్ రెడ్డి అనే వ్యక్తికి 25 ఎకరాల మ్యాంగో తోట ఉందని, ఆ పంటను 12 రూపాయల చొప్పున అమ్ముకున్నాడని, ఆయన పథకం ప్రకారమే తింబోజిపాలెం గ్రామానికి చెందిన శేఖర్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన 5 ట్రాక్టర్ బండ్లను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కారు సర్వీస్ రోడ్ వైపు ఉన్న మామిడి తోట ముందుకు వచ్చిందో ప్రకాశ్ రెడ్డికి చెందిన తోటలో నుండి 5 ట్రాక్టర్స్ ను రోడ్ మీడ పారబోసి విచక్షణారహితంగా పంటను తొక్కుకుంటూ వెళ్లారని తెలిపారు. ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మామిడి పంటను రోడ్ పై పోసి, తొక్కుకుంటూ వెళ్తూ కనీస బాధ్యత లేకుండా చూస్తూ రాక్షస ఆనందం పొందటం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.
*పోలీసుల పట్ల గౌరవం లేకుండా వ్యవహరించారు*
జగన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఆంక్షలు విధించిన పోలీసుల పట్ల వైసీపీ నేతలు, కార్యకర్తలు దురుసుగా వ్యవహరించడం చాలా బాధాకరమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ముకుమ్మడిగా వస్తున్న వైసీపీ అభిమానులను అదుపు చేస్తున్న డిఎస్పీ స్థాయి అధికారి చేయిని రపా..... రపా... నరకండి అంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కార్యకర్తలను ఆదేశించడం దేనికి సంకేతం అని అన్నారు. జగన్ పర్యటనలో అవాంఛనీయ ఘటనలు జరుగుతాయన్న ముందుచూపుతోనే డ్రోన్ కెమెరాలను ఉపయోగించామని, అందులో భాగంగానే ట్రాక్టర్ల ఉదంతం బయట పడిందన్నారు. వైసీపీ కార్యకర్త ర్యాలీలో వెళ్తుంటే కిందపడిపోయి తలకు గాయాలయ్యాయని, పోలీసులు లాఠీ ఛార్జ్ చేసారంటూ అవాస్తవాలు ప్రచారం చేయడం సమంజసం కాదని అన్నారు.
addComments
Post a Comment