విజయవాడ (ప్రజా అమరావతి);
ఆర్టీసీ హౌస్ లో శ్రీ అల్లూరి సీతారామరాజుకి ఘనంగా నివాళులు
అల్లూరి సీతారామరాజు 128 వ జయంతిని ఈ రోజు ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సంస్థ వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్.(R) ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, శ్రీ అల్లూరి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
డిప్యూటీ సి.పి.ఎం.(హెచ్.ఆర్.డి.) శ్రీమతి పాణి చక్ర తేజ అధ్యక్షతన ఆర్టీసీ హౌస్ మినీ కాన్ఫరెన్స్ హాలు నందు జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు, ఉద్యోగులు హాజరై పూలుజల్లి అల్లూరి సీతారామరాజుకు నివాళులు అందించారు.
అనంతరం శ్రీ పాణి చక్ర తేజ అల్లూరి గురించి క్లుప్తంగా వివరించారు. విప్లవానికి ఆద్యం పోసిన గొప్ప వీరుడు అల్లూరి అని కొనియాడారు. అణచివేతకు గురవుతున్న నిరక్షరాస్యులైన గిరిజన ప్రజల పక్షాన అల్లూరి సీతారామరాజు నిలబడి వారినే సైన్యంలా తయారుచేసుకుని ఆంగ్లేయుల పాలనను ఎదిరించి పోరాటం జరిపి, అందరికీ స్పూర్తిగా నిలిచారన్నారు. బ్రిటిష్ పాలనపై తిరుగుబాటు చేసి తనదైన పోరాట మార్గంలో నిజాయితీ కనబరుస్తూ సీతారామరాజు ముందుకు సాగారన్నారు. మన్యం ప్రజల కోసం తన జీవితాన్ని అంకితమిచ్చి, విప్లవ స్ఫూర్తి రగిలించిన ఘనుడని కీర్తించారు.
తదనంతరం వైస్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పిఎస్.(R) మాట్లాడుతూ బ్రిటిష్ పరాయి పాలన నుండి దేశాన్ని విముక్తి చేసేందుకు విప్లవ పోరాట మార్గంలో నడిచిన వారిలో సీతారామరాజు చిరస్మరణీయునిగా మిగిలిపోయారని తెలిపారు.
దేశ ప్రజల స్వేచ్చ కోసం ఆయన తన జీవితాన్ని ఫణంగా పెట్టి పోరాట యోధునిగా చరిత్రలో నిలిచిపోయారని ప్రశంసించారు. ఆదివాసీలను కూడగట్టి పరాయి పాలకులపై ఒక ధీరోదాత్తమైన పోరాట నిర్మాణం చేసి మన్యం తిరుగుబాటు ద్వారా ప్రజలలో స్వాతంత్ర్య కాంక్ష రగిలించారన్నారు. అనేక విద్యలలో ప్రావీణ్యం సాధించి బ్రిటీష్ పోలీసులపై తిరుగుబాటు చేయడమే కాకుండా తనదైన నాయకత్వంతో బానిసత్వంపై పోరుబాట సాగించిన గొప్ప వ్యక్తని కీర్తించారు. తాను జీవించిన 27 ఏళ్ల వయసులోనే చరిత్రలో నిలిచిపోయేలా అపారమైన కీర్తిని సాధించిన ఘనుడని, ఆయన త్యాగనిరతిని కొనియాడారు.
నిస్వార్ధంగా ప్రజల కోసం జీవితాలను త్యాగం చేసిన మహనీయుల స్ఫూర్తితో సమాజ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని, మన అనే భావంతో పనిచేసినప్పుడు మన ఆర్టీసీ సంస్థ కూడా అభివృద్ధి చెందుతుందని వివరించారు.
ఈ వేడుకలు సంస్థ హెచ్. ఆర్. డి అండ్ వెల్ఫేర్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) శ్రీ ఏ. అప్పలరాజు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంజనీరింగ్) శ్రీ చెంగల్ రెడ్డి , ఎఫ్.ఎ అండ్ సి ఏ ఒ శ్రీ ఎన్. సుధాకర రావు, డిప్యూటీ సిపిఏం (హెచ్.ఆర్.డి అండ్ వెల్ఫేర్) శ్రీమతి జి. పాణిచక్ర తేజ, ఏ.డి (విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ) శ్రీమతి టి.శోభామంజరి ఇంకా తదితర ఉన్నతాధికారులు, అధికారులు, సూపర్వైజర్లు, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, ఉద్యోగులు పలువురు హాజరై అల్లూరి సీతారామరాజు త్యాగనిరతిని గుర్తు చేసుకుని నివాళులర్పించారు.
addComments
Post a Comment