అమరావతి: (ప్రజా అమరావతి )కర్ణాటక రాష్ట్రంలోని ఏరోస్పేస్ పరిశ్రమలను మంత్రి లోకేశ్ ఏపీకి ఆహ్వానించారు.బెంగళూరు సమీపంలోని దేవనహళ్లి తాలూకాలోని చన్నరాయపట్న, చుట్టుపక్కల గ్రామాల్లో ఏరోస్పేస్ ప్రాజెక్టు కోసం చేపట్టదలచిన భూసేకరణ ప్రక్రియను కర్ణాటక ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రైతుల తీవ్ర నిరసనల నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ ప్రకటన చేశారు. ఏరోస్పేస్ ప్రాజెక్టు కోసం 1,777 ఎకరాలను సేకరించాలని కర్ణాటక ప్రభుత్వం తొలుత ప్రణాళిక వేసింది. అయితే, ఈ ప్రాంతంలోని రైతులు, భూ యజమానులు భూసేకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. పరిశ్రమలు తరలిపోయే అవకాశం ఉన్నప్పటికీ, రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ భూసేకరణను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారు. ఈ విషయం తెలిసి ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఏరోస్పేస్ పరిశ్రమల కోసం తన వద్ద మంచి పాలసీ సిద్దంగా ఉందని తెలిపారు. ఆ పరిశ్రమవర్గాలు ఆంధ్రప్రదేశ్ వస్తే, ఆకర్షణీయమైన ఏరోస్పేస్ పాలసీతోపాటు అత్యుత్తమ స్థాయిలో ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నామన్నారు. బెంగళూరుకు సమీపంలోనే వెంటనే కేటాయించేందుకు 8,000 ఎకరాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. త్వరలోనే కలసి మాట్లాడుకుందామని ఆ పరిశ్రమలకు ఆహ్వానం పలికారు.
ఏరోస్పేస్ ఇండస్ట్రీకి మంత్రి లోకేష్ ఆహ్వానం.
addComments
Post a Comment