జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్ గా ఉండాలి.


*జీఎస్టీ వసూళ్లలో  ఏపీ రోల్ మోడల్ గా ఉండాలి

*

 *డేటా అనలటిక్స్ ద్వారా పన్నుల విశ్లేషణ* 

*డేటా లేక్ ద్వారా అన్ని శాఖల సమాచారం ఒక్క చోటుకే* 

*కేంద్ర- రాష్ట్ర జీఎస్టీ అధికారుల సమన్వయ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు*

అమరావతి, జూలై 11 (ప్రజా అమరావతి): జీఎస్టీ వసూళ్లలో ఏపీ దేశానికి రోల్ మోడల్ గా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలు లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన  కేంద్ర- రాష్ట్ర జీఎస్టీ అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ బాబు.ఏ, కేంద్ర రాష్ట్రాల జీఎస్టీ అధికారులు హాజరయ్యారు. డేటా అనలటిక్స్ లాంటి సాంకేతికతను వినియోగించి ఎగవేతలను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సమర్ధవంతమైన పన్ను వసూళ్ల ప్రక్రియ ద్వారా జాతీయ సంపదను పెంచాలని సీఎం సూచించారు. అది ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి ఉపకరించాలని సీఎం అన్నారు. దీనికోసం జీఎస్టీ రియలైజేషన్ కోసం కేంద్ర- రాష్ట్రాల అధికారుల మధ్య సమాచార సమన్వయం ఉండాలన్నారు. జీఎస్టీ వసూళ్లకు సంబంధించి పొరుగు రాష్ట్రాలతో పోటీ పడేలా కార్యాచరణ ఉండాలని అన్నారు. వస్తున్న పన్ను వసూళ్ల సమాచారాన్ని డేటా అనలటిక్స్ ద్వారా విశ్లేషించాలని ముఖ్యమంత్రి అన్నారు. ఎగవేతలను గుర్తించేందుకు విద్యుత్ వినియోగం లాంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సీఎం సూచించారు. ఏపీలో ఎలాంటి పన్ను ఎగవేతలకు అవకాశం లేకుండా చూడాలని జీఎస్టీ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 

*డేటా లేక్ ద్వారా సమాచారం పంచుకుంటాం*

ప్రతీ వ్యవస్థా సమర్ధవంతంగా పని చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, పెట్టుబడులను ఆకర్షించటంలో ఏపీ దేశంలో 4 స్థానంలో ఉందని... అన్ని రంగాల్లోనూ ఏపీ బెస్ట్ గా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గతంలో హైదరాబాద్ ను అభివృద్ధి చేసినందు వల్లే తెలంగాణా రాష్ట్రానికి 75 శాతం మేర ఆదాయాన్ని తెచ్చిపెడుతోందని ఏపీలోని విశాఖ, విజయవాడ, తిరుపతి లాంటి నగరాలు కూడా అదే స్థాయికి చేరుస్తామని అన్నారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్లలో ఎక్కడా పొరపాటు జరక్కుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల సమాచారాన్ని ఒకచోటకు చేర్చి డేటా లేక్ ను రూపొందిస్తుందని ఈ సమాచారాన్ని కేంద్ర జీఎస్టీ అధికారులకూ అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్రానికి రావాల్సిన వనరులు సమృద్ధిగా ఉంటే ప్రతీ చిన్న అంశానికీ కేంద్రం వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. సీఐఐ లాంటి సంస్థలతో కలిసి పన్ను ఎగవేతల్లేకుండా అవగాహన కల్పించాలని... అప్పటికీ అదుపులోకి రాకపోతే కఠినంగా వ్యవహరించాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.  మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా జీఎస్టీ  వసూళ్లలో 3.4 శాతం వృద్ధి నమోదు అయ్యిందని అధికారులు సీఎంకు వివరించారు. త్వరలోనే  విశాఖ, విజయవాడల్లో ఏర్పాటు కానున్న జీఎస్టీ ట్రిబ్యునల్స్ ద్వారా పన్ను వివాదాలు పరిష్కారం అవుతాయని అధికారులు తెలిపారు. సెంట్రల్ జీఎస్టీ జోనల్ కార్యాలయం, క్వార్టర్ల నిర్మాణం కోసం అమరావతిలో 5 ఎకరాల భూమిని కేటాయించాలని కేంద్ర అధికారులు ముఖ్యమంత్రికి విన్నవించారు.
Comments