యువ పోలీస్ అధికారులు టెక్నాలజీ మీద మరింత పట్టుసాధించాలి -డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.
అమరావతి (ప్రజా అమరావతి):
యువ పోలీస్ అధికారులు టెక్నాలజీ మీద మరింత పట్టు సాధించాలనిడీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (హైదరాబాద్)77 ఆర్ ఆర్ బ్యాచ్ కు చెందిన 28 మంది ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారులు స్టడీ, కల్చరల్ టూర్ లో భాగంగా సోమవారం మంగళగిరి లోని ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర పోలీస్ ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి పోలీస్ ఉన్నతాధికారులు పోలీస్ శాఖలోని పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు.
ముఖ్యంగా పోలీస్ శాఖలో అమలవుతున్న సంస్కరణలు, పోలీసింగ్ లో టెక్నాలజీ వినియోగం, నేరాల నియంత్రణ మరియు సైబర్ నేరాలను అరికట్టడానికి పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు గురించి వివరించి అవగాహన కల్పించడం జరిగింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'యోగాంధ్ర విజయవంతానికి తీసుకున్న చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ మరియు క్రౌడ్ కంట్రోలింగ్ కు వాడిన సాంకేతికతను గురించి ప్రొబెషనర్ ఐ.పీ.ఎస్. అధికారులకు వివరించారు.
అంతేకాకుండా ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ శాఖ రూపొందించిన "అస్త్రం" యాప్ గురించి, మహిళలు, బాలికల రక్షణకు రూపొందించిన శక్తి యాప్ "శక్తి టీమ్స్", రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు ఏర్పాటు చేసిన "ఈగల్ టీమ్స్ సాధిస్తున్న ఫలితాల, పనితీరు గురించి వివరించారు. నేరపరిశోధనలో "ఏఐ' వినియోగం గురించి, పోలీసింగ్ మరియు ప్రజాసేవలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాలను అన్వేషించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన "ఏఐ హ్యాక్ థాన్"వివరాలను తెలిపారు. ఇందులో అభివృద్ధి చేసిన పలు సాంకేతిక అంశాల మీద అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ టెక్నాలజీ పెరిగే కొద్దీ నేరస్తులు పోలీసు శాఖకు సరిక్రొత్త సవాళ్లను విసురుతున్నారన్నారు. వీటిని అధిగమించడానికి యువ పోలీస్ అధికారులు టెక్నాలజీ మీద మరింత పట్టుసాధించాల్సిందిగా సూచించారు. యువ ఐ.పీ.ఎస్ అధికారులు పోస్టింగ్ పొందిన ప్రాంతాల్లో స్థానిక భాషల మీద పట్టు సాధించాలని ఉద్భోధించారు. ప్రజలతో సన్నిహిత సంబంధాలు నెరపాలంటే భాషే మార్గమన్నారు. కెరీర్ కొత్తల్లో తాము ఎదుర్కొన్న సవాళ్లను, పోలీస్ శాఖలో ఎదురయ్యే వివిధ రకాల సమస్యలు, సవాళ్లపై తన స్వీయ అనుభవాలను యువ ఐ.పీ.ఎస్ అధికారులతో డీజీపీ పంచుకున్నారు.
అంతకు ముందు యువ ప్రొబెషనరీ ఐ.పీ.ఎస్ అధికారులకు APCRDA కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ఆ శాఖ కమిషనర్ మరియు అడిషనల్ కమిషనర్ లు రాజధాని అమరావతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ (L & O) శ్రీ ఎన్. మధుసూధన రెడ్డి, ఐ.జీ.పీ. శ్రీ శ్రీకాంత్ (OPERATIONS & Technical Services), ఐ.జీ.పీ. బి. శ్రీమతి రాజకుమారి (W & CSW) ఐ.జీ.పీ. శ్రీ ఆకె రవికృష్ణ (EAGLE), డి.ఐ.జీ. శ్రీ సత్యయేసుబాబు (PTO & Training), డి.ఐ.జీ. శ్రీ పకీరప్పా (DIG L&O) తదితర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment