*ఓ బలమైన సంఘటన నా జీవితాన్ని మార్చింది.*
*డాక్టర్ గా ఉన్న నన్ను పోలీస్ అధికారిని చేసింది.*
*ఫ్రెండ్లీ పోలీసింగ్ నా సక్సెస్ ఫార్ములా*
*ఐపీఎస్ అంటే నా దృష్టిలో ఇండియన్ పబ్లిక్ సర్వీస్*
*విశాఖ ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఎంతో మంచివారు*
*క్రైమ్ రిపోర్టర్స్ తో ముఖాముఖి కార్యక్రమంలో*
*శంఖబ్రత బాగ్చి ఆసక్తికర వ్యాఖ్యలు*
అమరావతి (ప్రజా అమరావతి);
నా జీవితంలో ఓ సంఘటన డాక్టర్ గా ఉన్న నన్ను పోలీసు అధికారిగా మార్చేసింది.1990 దశకంలో పశ్చిమ బెంగాల్లో ఓ పోలీస్ స్టేషన్ వద్ద ఓ సామాన్య కుటుంబం ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల్ని కళ్ళారా చూసిన నేను తీవ్రంగా చెల్లించి పోయాను. ఆ పేద కుటుంబం తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటే వినే పోలిసే లేకుండా పోయాడు. ఆ సంఘటన నా మదిలో బలంగా నాటుకుపోయింది. అప్పుడే నేను పోలీసు అధికారిగా మారాలని గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) ని పబ్లిక్ సర్వీస్ గా మార్చాలని నిర్ణయించుకున్నాను. ఆ బలమైన కోరికే నన్ను పోలీసు అధికారిగా మార్చింది అని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. శుక్రవారం ఉదయం విశాఖపట్నం క్రైమ్ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సిపితో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా ఆయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. రెండున్నర దశాబ్దాల క్రితం పోలీసులంటే ఎంతో క్రూరమైన వ్యక్తులని జనంలో ఒక అభిప్రాయం ఉండేదని, ఆ అభిప్రాయం కాస్త క్రమేపీ మారుతూ వస్తోందన్నారు. పెండ్లి పోలీసింగ్ ద్వారా ఎన్నో సత్ఫలితాలు సాధించవచ్చని తన కెరియర్లో ఎన్నోసార్లు నిరూపితమయ్యాయని ఆయన స్పష్టం చేశారు. అందుకే ఏ జిల్లాలో, ఏ క్యాడర్లో పనిచేసినా పౌర సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. దీంట్లో భాగంగానే తన ఫోన్ నంబర్ ను ప్రజలకు తెలియజేస్తూ ఏ సమయంలో ఏ కష్టం వచ్చినా నేరుగా ఫోన్ ద్వారా గాని, వాట్సాప్ మెసేజ్ రూపంలో గానీ తెలియజేయమని కోరుతున్నానని చెప్పారు.
విశాఖ నగర పోలీస్ కమిషనర్ గా గడిచిన ఏడాది కాలంలో నా ఈ ప్రయత్నం ఎంతోమందికి చేరువైందని, పోలీసు శాఖ పట్ల విశ్వసనీయతను పెంచిందని సిపి వెల్లడించారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు, ట్రాఫిక్ క్రమబద్దీకరణకు, సైబర్ నేరాల నియంత్రణకు ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో నైట్ లైఫ్ కల్చర్ పెరుగుతోందని, దీనిని దృష్టిలో పెట్టుకొని పర్యాటకంగా విస్తరిస్తున్న నగరంలో నైట్ పోలీసింగ్ కూడా పటిష్టంగా చేపడుతున్నామని సిపి చెప్పారు.
*ఫ్యాక్షనిస్టులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాను.*.
*విశాఖలో సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తున్నాను*..
కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు సిపి చెప్పారు. రాజకీయపరంగా తీవ్రమైన ఒత్తిడిలను, ఫ్యాక్షనిస్టుల నుంచి ఎన్నో ఇబ్బందులను చవిచూసినట్లు తెలిపారు. జమ్మలమడుగులో ఫ్యాక్షనిస్టుల భరతం పట్టేందుకు చాలా కఠినంగా పనిచేశానని, ఎలాంటి ఒత్తిళ్లకు తావు లేకుండా విధులు నిర్వర్తించానని చెప్పారు.
కాగా నగర పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్న తనకు ఎంతో సంతృప్తి కలుగుతుందని, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, ప్రజలు అంతా కూడా మంచి సహకారాన్ని, మద్దతును అందించడం వల్ల సత్ఫలితాలు సాధించగలుగుతున్నట్లు చెప్పారు.
*విశాఖను దేశంలో అగ్రగామిగా నిలిపేందుకు నాలుగు టార్గెట్లు*
విశాఖ నగరాన్ని ప్రశాంతంగా ఉంచేందుకు చేపట్టాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నానని ఆయన అన్నారు.
అలాగే పలు నేరాలపై జైలుకు వెళ్లి తిరిగి బెయిల్ పై బయటకు వచ్చిన వారి కదలికలపై ప్రత్యేక కన్ను వేసి వారిలో నేర ప్రవృత్తిని తగ్గించేందుకు లేదా పూర్తిగా మార్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు చెప్పారు. దీంతోపాటు నగరంలో గల బిచ్చగాళ్లను, ట్రాన్స్ జెండర్ల జీవితాల్లో మార్పు తీసుకువచ్చి, వారికి మంచి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
అలాగే ఎక్కడా నిరాశ్రయులు లేకుండా ఆశ్రయాలు కల్పించడం ద్వారా మెరుగైన సమాజానికి బాటలు వేయాలని పనిచేస్తున్నట్లు చెప్పారు. కమిషనర్ గా నేను ఉన్నంతకాలం లో ఈ పనులు పూర్తి చేసేందుకు ప్రతిక్షణం పనిచేస్తానన్నారు. విశాఖపట్నం క్రైమ్ రిపోర్టర్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు దాడి రవికుమార్, సతీష్ బాబుల సారధ్యంలో జరిగిన ఈ ముఖాముఖి కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శేషుగిరి, నల్లా రాము, ఆర్గనైజింగ్ సెక్రటరీ భానోజి,వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.ఎస్.ఆర్.ప్రసాద్,సంయుక్త కార్యదర్శులు నరేష్,శివరామకృష్ణ, కోశాధికారి పొట్నూరు వాసు, కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరావు మరియు పలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ప్రతినిధులు హాజరయ్యారు.
addComments
Post a Comment