రాష్ట్రాభివృద్ధికి గ్రోత్ ఇంజిన్‌గా విశాఖ.


*రాష్ట్రాభివృద్ధికి గ్రోత్ ఇంజిన్‌గా విశాఖ*


*కెప్పెల్, జీఐసీ, విల్మార్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ*

*రాష్ట్రంలో అవకాశాలు వివరించి.., భాగస్వామ్యానికి పిలుపు*

సింగపూర్, జూలై 29 (ప్రజా అమరావతి): నగరాభివృద్ధి, వాణిజ్య సదుపాయాలు, మౌలిక వసతుల రంగాల్లో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన సింగపూర్‌కు చెందిన కెప్పెల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లిమ్ యాంగ్ వియ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. సింగపూర్ లో మూడో రోజు పర్యటనలో భాగంగా సీఎం వివిధ పారిశ్రామిక దిగ్గజ కంపెనీలతో బేటీ అయ్యారు.  అమరావతి నగర అభివృద్ధిలో కెప్పెల్ భాగస్వామ్యంపై ప్రధానంగా ఇరువురి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రాభివృద్ధి కోసం విశాఖను గ్రోత్ ఇంజిన్‌గా మార్చే లక్ష్యంతో ఐటీ, వాణిజ్యం, గృహ నిర్మాణ రంగాల్లో ప్రాజెక్టుల అభివృద్ధికి కెప్పెల్‌ను ఆహ్వానించారు.

*జీఐసీతో దీర్ఘకాలిక భాగస్వామ్యం లక్ష్యం :* 

అమరావతి నగర అభివృద్ధి, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, పరిశ్రమల రంగం అభివృద్ధి, మౌలిక సదుపాయాల రంగాలలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్ట్ మెంట్ కార్పోరేషన్ (జీఐసీ) సంస్థ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ బ్రాన్ యోతోనూ ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. జీఐసీతో దీర్ఘకాలిక భాగస్వామ్యం, స్థిరమైన పెట్టుబడులపై ప్రణాళికల రూపకల్పనపై చర్చించారు. వైద్య, విద్య, పట్టణ ప్రణాళిక, పౌర సదుపాయాలు వంటి రంగాల్లో జీఐసీ పెట్టుబడులు పెట్టేలా అనువైన వాతావరణం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆయా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ఆపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం స్పష్టం చేశారు.  

*ఫుడ్ ప్రాసెసింగ్‌పై విల్మర్ ఆసక్తి :*

అలాగే, విల్మార్ ఇంటర్నేషనల్ సంస్థ గ్రూప్ హెడ్ రాహుల్ కలేతో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు... సమావేశంలో ఫుడ్ ప్రాసెసింగ్, ఎడిబుల్ ఆయిల్స్, అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. రైతులకు విలువ ఆధారిత మార్కెట్‌ను కల్పించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్‌లో సహకరించాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించగా విల్మర్ టెక్నాలజీ అందుకు ఆసక్తి వ్యక్తం చేసింది.
Comments