*రాష్ట్ర కార్మిక, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖామాత్యులు వాసంశెట్టి సుభాష్*
అమరావతి, జులై 23 (ప్రజా అమరావతి): సుపరిపాలన – తొలి అడుగు కార్యక్రమంలో ప్రజల నుండి ప్రభుత్వంపై మంచి ఫీడ్ బ్యాక్ వస్తున్నదని రాష్ట్ర కార్మిక, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖామాత్యులు వాసంశెట్టి సుభాష్ తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుపరి పాలన – తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా దాదాపు తొమ్మిది నియోజకవర్గాల్లో పర్యటించడం జరుగుచున్నదని, ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వం పై మంచి ఫీడ్ బ్యాక్ వస్తున్నదన్నారు. అభివృద్ది, సంక్షేమం అనే జోడు గుర్రాలతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదన్నారు.
రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలాగా వస్తున్నాయని, దాదాపు రూ.6 లక్షల కోట్ల మేర పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తద్వారా 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రంగం సిద్దం అయిందన్నారు. ఐ.టి. శాఖ పరంగా ఇప్పటికే రూ.20 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తద్వారా 50 వేల ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయన్నారు. అయితే రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం ఇష్టం లేని ప్రతి పక్ష పార్టీ నాయకులు వాటిని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్తను తీసుకు రావాలనే లక్ష్యంతో ఎం.ఎస్.ఎం.ఇ. కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం జరుగుచున్నదన్నారు. నిరుపేద కుటుంబాలకు ఆసరాను కల్పించే విధంగా పి-4 కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు పర్చడం జరుగుచున్నదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.12 వందల కోట్లతో రాష్ట్రంలో గంతల రహిత రోడ్లను నిర్మించడం జరిగిందన్నారు.
తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా కుటుంబంలో చదువుకునే పిల్లలు అందరికీ ఆర్థిక సహాయాన్ని నేరుగా తల్లి ఖాతాల్లోకి జమచేయడం జరుగుచున్నదని, ఎవరైనా తమకు అందలేదని ఫిర్యాదు చేసిన వెంటనే వారికి కూడా అందజేయడం జరుగుచున్నదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అర్హులు అందరికీ పింఛన్లు, రేషన్ కార్డులు అందజేయడం జరుగుచున్నదన్నారు.
అమలాపురంలో కొందరు వ్యక్తులు ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురి వద్ద డబ్బులు తీసుకుని మోసగించిన సంఘటనకు సంబందించి తమపై బురద జల్లే విదంగా కొందరు ప్రయత్నిస్తున్నారని తప్పు పట్టారు. మోసగించిన వారు తమ అనుయాయులు ఏమాత్రం కాదని, తప్పు చేసిన వారిని ఏమాత్రము ఉపేక్షించాల్సిన అవసరం లేదని, వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.
addComments
Post a Comment