ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రారంభిస్తున్నాం.
వితంతు పింఛన్లు వచ్చే నెలలోగా పంపిణికి రంగం సిద్ధం చేస్తున్నాం.
జగన్ అనే భూతాన్ని వెయ్యి అడుగులు గొయ్యి తీసి కప్పి బయటకు రాకుండా చేస్తాం.
సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది.
జోరువానలో పింఛన్ల పంపిణీ చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.
నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన, ప్రారంభోత్సవం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు.
టెక్కలి (ప్రజా అమరావతి);
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే ఇచ్చిన హామీలను అమలు చేయడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబోమ్మాళి మండల ఉమిలాడ పంచాయితీ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఉదయాన్నే మంత్రి పాల్గొని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. తొలుత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన, ప్రారంభోత్సవాలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో 2023 నుంచి వితంతు పింఛన్లు నిలిపి వేశారని ఆరోపించారు. దీనికి 'స్పౌజ్ కేటగిరీ’గా నామకరణం చేశామని వచ్చే నెల నుంచి వితంతు పింఛన్లు అందజేస్తామని వెల్లడించారు. చదువుకునే ప్రతి విద్యార్థికి 'తల్లికి వందనం' పథకం కింద పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేసి తల్లుల ఖాతాల్లో నగదు వేయడం జరిగిందని అన్నారు. 'తల్లికి వందనం' పథకం కింద రాష్ట్రంలో 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద, తల్లుల ఖాతాల్లో రూ. 8745 కోట్లు ప్రభుత్వం జమ చేయడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వం వలన 10 లక్షల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని కొనియాడారు. సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని అని అన్నారు. మరో ముఖ్య మైన హామీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అగస్టు 15 నుంచి అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వానికి రూ. 2,400 కోట్లు ఆర్ధిక భారమైనా కూడా ఉచిత బస్సు పథకం అమలు చేసి మహిళలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని అన్నారు.
*గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది*
వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని తీవ్ర స్ధాయిలో మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ఆంధ్రప్రదేశ చరిత్రలో ఎన్నడు లేనివిధంగా రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశారని, అదేవిధంగా చేసిన పనులకు రూ. 1, 35 లక్షల రూపాయిలు పాత బకాయిలు ఉన్నాయని అన్నారు. పాదయాత్ర పేరుతో ప్రజలను మోసం చేశారని, అమ్మ ఒడి పథకం అని చేప్పి ఎంత మంది ఉంటే అంత మందికి నగదును ఇస్తామని చెప్పి ఒక్కరకి మాత్రమే నగదును ఇచ్చి మోసం చేసారని మండిపడ్డారు. గత ఐదేళ్లలో మత్స్యకారుల అభ్యున్నతిని విస్మరించారని, వారికి పరికరాలు ఇవ్వలేదని, చేపల వేట నిషేధం సమయంలో భృతి కింద రూ.10 వేలు తప్పా మరేమి ఫలితాలను ఇవ్వలేదని ఆరోపించారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డికి రాష్ట్రంలో గంజాయి బ్యాచ్‌ల వద్దకు పరామర్శలకు వెళ్లడం, బెట్టింగ్ బ్యాచ్ వ్యక్తుల విగ్రహాలను ఆవిష్కరించడం తప్పా ఇంకేం పని లేదన్నారు. వైసీపీ నేతలు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వలన రాష్ట్రాన్ని అస్తవ్యస్ధం చేశారని అన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉన్న భూతాన్ని వెయ్యి అడుగుల లోతు గొయ్యి తవ్వి అందులో కప్పి బయటకు రాకుండా చేస్తామని తీవ్రస్ధాయిలో విరుచుకు పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల అభివృద్ధిని విస్మరించారని, గ్రామాల్లో ఒక్క సీసీ రహదారి కూడా శంకుస్థాపన చేపట్టలేదని, నేడు సిగ్గు లేకుండా కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి గురించి అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. పరామర్శల పేరుతో నాటకాలు ఆడుతున్నారని, సొంత కార్యకర్తను కారు కిందపడి చనిపోతే పరామర్శ చేయకుండా గంజాయి బ్యాచ్ వద్దకు, అవినీతి చేసి జైళ్ళకు వెళ్లిన పలువురుని పరామర్శించడం రాజకీయ నాయకుడు లక్షణమా అని ప్రశ్నించారు.
*అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు*
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం ఉమిలాడ గ్రామం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి అచ్చెన్నాయుడు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఉమిలాడ పంచాయతీ పరిధిలో రూ.1.62 లక్షలతో రహదారిని ప్రారంభించారు. అదేవిధంగా అంతర్గత సీసీ రహదారులు రూ. 56 లక్షల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేశారు. రూ.18, లక్షలతో సీసీ రహదారి ప్రారంభోత్సవం , రూ, 14 లక్షలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, ఆర్డీవో కృష్ణ మూర్తి, పీఎసీఏస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్ , తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment