జిల్లాలో ఎరువుల కొరత లేదు
పార్వతీపురం, జూలై 27 (ప్రజా అమరావతి): జిల్లాలో ఎరువుల కొరత లేదని జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు . ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఎరువుల పంపిణీ పరిస్థితిని పర్యవేక్షణ చేస్తున్నామని, పలు మండలాల్లో రైతు సేవా కేంద్రాల్లో ఎరువుల లభ్యత, పంపిణీ జరుగుతున్న విధానాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. రైతులు యూరియాను అధిక మొత్తంలో వాడరాదని ఆయన కోరారు, ఇది పంటకు హాని కలిగిస్తుందని ఆయన చెప్పారు. ఎరువులను సముచితంగా ఉపయోగించు కోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. జిల్లాలో అవసరమైన పరిమాణంలో ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఎరువుల కోసం అనవసరపు ఆందోళన అవసరం లేదని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. జూలై చివరి నాటికి జిల్లాలో దాదాపు 11,327 టన్నుల యూరియా అవసరమవుతుందని అంచనా వేయగా, ఇప్పటివరకు 12,544 టన్నులు జిల్లాకు సరఫరా అయ్యాయని ఆయన చెప్పారు.
గడచిన ఖరీఫ్-24 సీజన్లో ఇప్పటి వరకు 9,465 టన్నుల యూరియాను వినియోగించారని, జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ 25 సీజన్లో ఇప్పటివరకు 9,557 టన్నుల యూరియా వినియోగించగా, మిగిలినది ఆర్ ఎస్ కె లు, సొసైటీలలో అందుబాటులో ఉందని, ఇటీవల 600 టన్నుల RCF కంపెనీ యూరియా జిల్లాకు చేరాయని ఆయన తెలిపారు. జిల్లాకు మరో 3, 4 రోజుల్లో క్రిభ్కో కంపెనీకి చెందిన యూరియా రానుందని, పంటల సాగు నమోదైన మండలాలకు ప్రాధ్యాన్యతా క్రమంలో యూరియాను కేటాయిస్తున్నామనీ, ప్రైవేట్ డీలర్ల వద్ద 966 టన్నులు, సొసైటీలు, రైతు సేవ కేంద్రాల వద్ద 1800 టన్నులు యూరియా, మార్కెఫెడ్ వద్ద 120 టన్నుల బఫర్ యూరియా నిలువలు ప్రస్తుతం రైతులకు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. రైతులకు రానున్న ఆగష్టు సెప్టెంబర్ నెలల్లో కూడా జిల్లా అవసరాలకు సరిపడా యూరియా రానున్నదని, ముందస్తుగా ఎక్కువ బస్తాలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేశారు. యూరియా కావాల్సిన రైతులు సొంతముగా విక్రయ కేంద్రాన్ని సందర్శించి, వారి బయోమెట్రిక్, ఆధార్ వివరాలు ఇ - పాస్ లో ఆన్ లైన్ విధానంలో నమోదు చేసి ఎరువుల కొనుగోలు చేయాలని సూచించారు.
మిగతా ఎరువులైన డీఏపీ, పోటాష్, సూపర్ ఫాస్ఫేట్, కాంప్లెక్స్ ఎరువులు సమృద్ధిగా జిల్లాలో అందుబాటులో ఉన్నాయని, జిల్లాలో ఇప్పటి వరకు 245 రైతు సేవ కేంద్రాల ద్వారా 7,235 టన్నులు, 22 సొసైటీల ద్వారా 1,369 టన్నుల యూరియా, డీఏపీ ఎరువులను పంపిణీ చేశామని ఆయన తెలిపారు.
యూరియా వినియోగాన్ని తగ్గించటానికి ఇటీవల అనేక ప్రత్యామ్నాయ మార్గాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ద్రవ రూప ఎరువులైన, నానో యూరియా, డీఏపీ ఎరువులను రైతు సేవ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచామని అన్నారు. ఎరువులకు సంబంధించి ఏవైనా సూచనలు, మార్గదర్శకాలు, సమాచారం అవసరమైతే జిల్లా వ్యవసాయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు (7989434766) కాల్ చేయవచ్చని ఆయన తెలిపారు.
addComments
Post a Comment