ఆదాయార్జన శాఖల్ని యూజర్ ఫ్రెండ్లీగా మార్చండి.



*ఆదాయార్జన శాఖల్ని యూజర్ ఫ్రెండ్లీగా మార్చండి

*


*సొంత ఆదాయాలు పెరగాలి...కేంద్ర నిధులు తేవాలి*


*రూ.180 కోట్ల విలువైన నరేగా పనులు రీ-ఓపెన్ చేయించాం*


*సంస్కరణలతో..ఫలితాలు వస్తున్నాయి*


*శాఖాధికారులుగా కాదు..లీడర్లుగా వ్యవహరించండి*


*ఆదాయార్జన శాఖలపై సమీక్షలో  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు* 


అమరావతి,జులై 11 (ప్రజా అమరావతి): సంస్కరణల అమలు ద్వారా రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సంక్షేమం అందిస్తూ..అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ..ఆదాయార్జన శాఖల ద్వారా మరింత రెవెన్యూ పెరగాలని  ముఖ్యమంత్రి  అధికారులకు  సూచించారు. శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో ఆదాయార్జన శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, మున్సిపల్, పంచాయతీరాజ్, అటవీ శాఖలపై చంద్రబాబు సమీక్షించారు. ఆయా శాఖల్లో ఆదాయార్జనకు సంబంధించి పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.  లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయ సముపార్జన అనేది ఎంత వరకు చేయగలిగామనే అంశంపై వివిధ శాఖల ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. “రాష్ట్రంలోని ఆదాయార్జన శాఖలు సొంతంగా ఆదాయాలు పెంచుకోవడం పైనా దృష్టి సారించాలి. ఆదాయ సముపార్జనలో ఉన్న లీకేజీలను గుర్తించి.. వాటిని నివారిస్తూ.. రాష్ట్రానికి ఆదాయం పెంచేలా చూడాలి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆదాయాలను ఎలా ఆర్జించాలనే  అంశాలపై దృష్టి సారించాలి. వివిధ పథకాల్లో కేంద్రం నుంచి  ఎలా నిధులు ఉన్నాయో గుర్తించి ..ఆ మేరకు ప్రతి పైసాను రాష్ట్రానికి తెచ్చుకునేలా కార్యాచరణ అమలు చేయాలి.  రాష్ట్ర సొంత ఆదాయాలు పెంచుకుంటూనే.. కేంద్ర నిధులపై దృష్టి పెడితే .. రాష్ట్ర ఖజనా కు నిధుల ఇన్ ఫ్లో పెరుగుతుంది. ఈ దిశగా అధికారులు నిరంతరం పని చేస్తూనే ఉండాలి.” అని ముఖ్యమంత్రి సూచించారు.


*రూ.180 కోట్ల విలువైన ఉపాధి పనుల బిల్లులు వచ్చేలా చేశాం*


“2014-19 మధ్య కాలంలో చేపట్టిన రూ. 180 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులను గత ప్రభుత్వం నిలిపేసింది. దీని వల్ల ఆ డబ్బులు కేంద్రం నుంచి రాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఆగిపోయిన  ఉపాధి హామీ పనులను తిరిగి రీ-ఓపెన్ చేయించాం. ఏడాది పాటు నిరంతరం ఫాలో అప్ చేయడం వల్ల 3.52 లక్షలకు పైగా పనులను మళ్లీ  రీ-ఓపెన్ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు త్వరగా ప్రాసెస్ చేయాలి. ఓ నెల రోజుల్లోగా ఈ పనులకు సంబంధించిన రూ.180 కోట్లు వచ్చేలా చేయాలి. ఇక గత ఏడాది లానే  ఈసారి కూడా గ్రామాల్లో నరేగా పనులను ప్రాధాన్యతల వారీగా గుర్తించి.. గ్రామ సభల్లో ఆమోదం తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్సైజ్, ఇసుక, మైనింగ్, స్టాంపులు రిజిస్ట్రేషన్ల లాంటి  శాఖల్లో సంస్కరణలు తెచ్చాం. ఇవి సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈ సంస్కరణలతో ప్రజలకు మేలు జరుగుతోంది. రాష్ట్రానికి కొంత మేర ఆదాయం పెరిగింది.  ప్రజలతో  నిత్యం సంబంధం కలిగి ఉండే  ఆదాయార్జన శాఖల పనితీరు మెరుగ్గా ఉండాలి. ఆయా శాఖల పనితీరు మీద ప్రజల్లో సంతృప్తి స్థాయి కూడా పెరగాలి. ప్రస్తుతం అన్న క్యాంటీన్లు, పెన్షన్ల పంపిణీ వంటి వాటిల్లో సంతృప్తి స్థాయి 90 శాతం దాటింది. స్టాంపులు రిజిస్ట్రేషన్లు, మున్సిపల్, పంచాయతీ రాజ్, ఎక్సైజ్, గనులు వంటి శాఖల్లో కూడా సంతృప్త స్థాయి కూడా 90 శాతం వచ్చేలా అధికారులు పని చేయాలి.” అని చంద్రబాబు ఆదేశించారు.


*అధికారులు సమర్ధ నాయకత్వం అందించాలి*


“ఆదాయార్జన శాఖలను లీడ్ చేస్తున్న అధికారులు వినూత్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ శాఖలకు చెందిన అధికారులు చక్కటి నాయకత్వం అందిస్తే.. ఆయా శాఖల పని తీరు మరింత మెరుగ్గా ఉంటుంది. ఆయా శాఖల్లో ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అన్నారు. నాయకులుగా ఆలోచించి..పని చేస్తే..ఎలాంటి సమస్యకు అయినా  పరిష్కారం లభిస్తుంది. రాష్ట్రానికి అభివృద్ధి ఎంత ముఖ్యమో.. సంక్షేమమూ అంతే ముఖ్యం. రెండు సమపాళ్లల్లో ఉండాల్సిందే. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని.. రాష్ట్రాన్ని మరింత ప్రగతి బాటన పయనించే విధంగా పని చేయాలి.” అని సీఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments