తోతాపూరి మామిడి రైతులకు కేంద్రం అండ‌గా నిల‌వాలి.


ఢిల్లీ (ప్రజా అమరావతి);

*తోతాపూరి మామిడి రైతులకు కేంద్రం అండ‌గా నిల‌వాలి

*

- కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‍ను కోరిన‌ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు .
- తోతాపురి మామిడి రైతుల‌కు 12 రూ. మ‌ధ్దతు ధ‌ర అంద‌చేశాం
- మామిడి రైతుల కోసం మార్కెట్ మద్దతు కింద రూ.260 కోట్లు ఆర్ధిక సాయం అందచేయండి
- వెనుకబడిన జిల్లాల కోసం మైక్రో ఇరిగేషన్ పథకానికి రాయితీ పెంచాలని విన‌తి
- విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరిన అచ్చెన్నాయుడు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా తోతాపూరి మామిడిని పండించిన‌ రైతుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం అండ‌గా నిల‌బ‌డాల‌ని కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహ‌న్ ను ఏపీ మంత్రి మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు కోరారు. మంగ‌ళ‌వారం ఢీల్లీలోని కేంద్ర మంత్రి కార్యాల‌యంలో మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి చౌహ‌న్ తో కేంద్ర మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడుతో క‌ల‌సి భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో రైతుల సమస్యలపై కేంద్ర మంత్రితో మంత్రి అచ్చెన్నాయుడు చ‌ర్చించారు. వ్య‌వ‌సాయ  రంగ స‌మ‌గ్ర అభివృద్ధికి  సంపూర్ణ స‌హ‌కారం అందించాల‌ని కేంద్ర  మంత్రిని కోరారు.  ముఖ్యంగా రాష్ట్రంలో తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివ‌రించారు. తొతాపురి మామిడి ధర తగ్గడంతో రైతులకు వ‌చ్చే న‌ష్టాన్ని ముందుగానే గ్ర‌హించి,  ధర రూ.8 క‌న్నా త‌క్కువ‌కు పడిపోవడంతో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ధరల లోటు చెల్లింపు పథకం కింద మద్దతు ధరగా రూ.12 నిర్ణయించినట్లు వివరించారు. 6.5 లక్షల మెట్రిక్ టన్నుల తొతాపురి మామిడి పంట కొనుగోలు చేయాల్సి ఉంటుందని కేంద్ర మంత్రికి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.260 కోట్లు ఖర్చు చేస్తుందని.. కేంద్ర ప్ర‌భుత్వం త‌గిన తోడ్పాటును అంద‌చేయాల‌ని కోరారు. మార్కెట్ మద్దతు పథకం (MIS) క్రింద తొతాపూరి మామిడిపండ్లను ఫ్యాక్టరీలు లేదా వ్యాపారుల ద్వారా ప్రతి కిలో రూ.12/- ఇందులో రూ.8/- ను ఫ్యాక్టరీలు / వ్యాపారులు చెల్లించగా, మిగిలిన రూ.4/- ను రైతుల ప్రయోజనార్థం ప్రభుత్వం భరించనుందని, ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు అందించాల‌ని కేంద్ర మంత్రికి వివ‌రించారు.  ప్రతిపాదిత పంట కోసం MIS క్రింద ధర లోటు చెల్లింపు (PDP) అమలులో కనీస మద్దతు ధరలో (MIP) 50% ను రాష్ట్ర ప్రభుత్వం భరించ‌నున్న‌ట్లు, కేంద్ర ప్రభుత్వం 100% భరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా వెనుకబడిన జిల్లాల కోసం మైక్రో ఇరిగేషన్ పథకానికి రాయితీ పెంచాల‌ని కోరారు. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ల లోని బుందేల్‍ఖండ్ తరహాలో ఏపీకి కేంద్రం అదనపు సాయం చేయాలన్నారు. గుంటూరులో చిల్లీ బోర్డ్, శ్రీకాకుళంలో జీడిప‌ప్పు బోర్డ్, చిత్తూరు లో మామిడి బోర్డ్ ల‌ను ఏర్పాటు చేస్తే రైతుల‌కు ఎంతో ప్ర‌యోజ‌న‌క‌ర‌మైన ఫ‌లితాల‌ను రాబ‌ట్ట‌వ‌చ్చ‌ని వివ‌రించారు. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు.  

ఈ సంవత్సరంలో మామిడిపండు గుజ్జు ఫ్యాక్టరీల్లో నిల్వలు పెరగడం మరియు ఉత్పత్తి అధికంగా ఉండటం వల్ల, ధరలు గణనీయంగా పడిపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని, రైతులకు న్యాయమైన ధర లభించేందుకు కేంద్ర ప్రభుత్వ మద్దతు అవసరం ఉంద‌న్నారు. రూ.12/- కిలో ధరకు, మొత్తం అంచనా వ్యయం రూ.780 కోట్లు అవుతుందని, ఇందులో ఫ్యాక్టరీలు / వ్యాపారులు ప్రతి కిలోకు రూ.8/- చెల్లించగా, అంచనా వ్యయం రూ.520 కోట్లు, మిగిలిన రూ.260 కోట్లు (రూ.4/- కిలోకు) ప్రభుత్వ భాగస్వామ్యంగా ఉంటుందన్నారు. పై అంశాలను దృష్టిలో ఉంచుకొని, కేంద్ర ప్రభుత్వం, రైతుల ప్రయోజనాన్ని కాపాడటానికి, ధర పతనం అయిన‌ నేపథ్యంలో మార్కెట్ మద్దతు పథకం (MIS) క్రింద ఆర్థిక సహాయం రూ.260 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. 


మైక్రో ఇరిగేషన్‌ అమలు ద్వారా వ్యవసాయ స్థాయిలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఎరువుల వినియోగం, కూలీ ఖర్చులు మరియు ఇతర పెట్టుబడులను తగ్గించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌న్నారు.  ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం - 2014 సెక్షన్ 46(2) ప్రకారం, రాయలసీమ, ప్రకాశం మరియు ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిందని, ఈ ఎనిమిది వెనుకబడిన జిల్లాలలో తోట పంటల సాగుకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉన్నప్పటికీ, తరచూ ఏర్పడుతున్న ఎండలు మరియు బోర్లు ఎండిపోవడం వలన‌ రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారని వివ‌రించారు. రైతులలో 78% మంది చిన్న మరియు అతి చిన్న రైతులే కాగా, మైక్రో ఇరిగేషన్ వ్యవస్థల ఏర్పాటుకు అవసరమైన 45% రైతుల వాటాను భరించలేని స్థితిలో ఉన్నారని, వ్యవసాయ రంగంలో సుస్థిరత కోసం మైక్రో ఇరిగేషన్ ప్రాధాన్యతను గుర్తించి, ఈ ఎనిమిది వెనుకబడిన జిల్లాల్లో మైక్రో ఇరిగేషన్ విస్తరణను లక్ష్యంగా పెట్టుకొని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.  2025-26 సంవత్సరంలో సుమారు 3 లక్షల హెక్టార్ల మైక్రో ఇరిగేషన్ విస్తరణతో పాటు, తదుపరి ఐదు సంవత్సరాలలో మొత్తం 15 లక్షల హెక్టార్ల మైక్రో ఇరిగేషన్ విస్తరణను లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని, 15% వృద్ధి సాధించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మైక్రో ఇరిగేషన్ పథకాలను ప్రోత్సహిస్తోందని అన్నారు. ఈ పథకం కింద, చిన్న మరియు అతి చిన్న రైతులకు 90% సబ్సిడీతో, అలాగే ఎస్సీ, ఎస్టీ రైతులకు 100% సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ అమలు చేస్తున్నామ‌ని కేంద్ర మంత్రి చౌహ‌న్ కు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.


Comments