*నాటకాలు ఆడడం వైసీపీకి అలవాటు... నీళ్లు తేవడం ఎన్డీఏకు అలవాటు*
*కుప్పానికి రెండేళ్ల ముందే కృష్ణా పుష్కరాలు*
*కృష్ణమ్మను కుప్పానికి తెచ్చాను... మాట నిలబెట్టుకున్నాను*
*రప్పా రప్పా రాజకీయాలంటే ఏంటో... పులివెందుల ప్రజలు వైసీపీకి చూపారు*
*పోలవరం-బనకచర్లతో కరవు శాశ్వతంగా దూరం*
*నదుల అనుసంధానంతో కలిగే లాభాలను తెలంగాణ నేతలు అర్థం చేసుకోవాలి*
*స్త్రీ శక్తితో ఆటో డ్రైవర్లకు ఇబ్బంది ఉండదు... వారినీ ఆదుకుంటాం*
*8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటా*
*కుప్పం బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు*
*పరమసముద్రం చెరువు వద్ద కృష్ణమ్మకు సీఎం జలహారతి*
*2014-19 మధ్య కాలం నాటి అసెంబ్లీలో జరిగిన చర్చ వీడియోను సభలో ప్రదర్శించిన సీఎం చంద్రబాబు*
కుప్పం, ఆగస్టు 29 (ప్రజా అమరావతి): “రాయలసీమ అభివృద్ధికి బ్లూ ప్రింట్ సిద్దం చేసుకున్నాం... అన్ని రంగాల్లోనూ సీమను అభివృద్ధి చేసేలా మా దగ్గర ప్రణాళికలున్నాయి. దీంట్లో భాగంగానే రాయలసీమకు హంద్రీ-నీవా కాల్వల విస్తరణ ద్వారా కుప్పం చిట్ట చివరి భూములకు నీటిని అందించాం. రాయలసీమకు నీళ్లు వస్తే వైసీపీకి జీర్ణం కాదు. వైసీపీకి నాటకాలు ఆడడం అలవాటు... ఎన్డీఏకు నీళ్లు తేవడం అలవాటు.” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శనివారం కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహరతి ఇచ్చారు. హంద్రీ-నీవా కాల్వల విస్తరణ ద్వారా కృష్ణా జాలాలు కుప్పం చివరి భూములకు చేరాయి. శ్రీశైలం నుంచి 738 కిలో మీటర్లు ప్రయాణించి కృష్ణమ్మ కుప్పానికి చేరుకుంది. దీంతో కుప్పం ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. ఈ సందర్భంగా కుప్పంలో పర్యటించిన చంద్రబాబు తన నివాసం నుంచి కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్దకు ఆర్టీసీ బస్సులో మహిళలు, రైతులతో కలిసి చేరుకుని జలహారతి ఇచ్చారు. సంప్రదాయ పద్దతిలో పంచెకట్టుకుని కృష్ణమ్మకు జలహరతి అందించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య కృష్ణమ్మకు పసుపు, కుంకమ సమర్పంచి జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా పరమసముద్రంచెరువు సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... 'నన్ను 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఆదరించిన నా కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు తీసుకురావడంతో నా జన్మ ధన్యమైంది. నా సంకల్పం నెరవేరింది. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. కృష్ణా పుష్కరాలు 2028లో వస్తుంటే కుప్పానికి మాత్రం రెండేళ్లు ముందే వచ్చాయి. కుప్పం ప్రజలు నన్ను ఇంటి బిడ్డగా ఆదరించారు. వారికి నేను ఏం చేసినా తక్కువే' అని చంద్రబాబు అన్నారు.
*ఎన్టీఆర్ సంకల్పాన్ని నెరవేర్చాం*
“ఆనాడు ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజ్ నిర్మాణంతో కాటన్ దొర... కృష్ణా, గోదావరి జిల్లాల పరిస్థితి మార్చేశాడు. అందుకే కాటన్ దొరను అక్కడి ప్రజలు ఆరాధిస్తారు. అలాగే ఎన్టీఆర్ కృష్ణా మిగులు జలాలు సీమకు తేవాలని సంకల్పం చేశారు. సీమను సస్యశ్యామలం చేయాలని కలలు కన్నారు. సీమలో పశువులను బతికించుకోవడానికి రైళ్లలో నీళ్లను తెప్పించిన పరిస్థితి నాడు ఉండేది. వేరుశనగ పంట వేస్తే కనీసం విత్తనాల ఖర్చు కూడా వచ్చేది కాదు. సీమలో ఇలాంటి పరిస్థితిని మార్చాలనే సంకల్పంతో 1999లో హంద్రినీవాను నేనే ప్రారంభించాను.' 2025 నాటికి పరమసముద్రానికి కృష్ణా జలాలు తెచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు. 'శ్రీశైలం మల్లన్న పాదాల చెంత నుంచి కుప్పం మల్లన్న వద్దకు కృష్ణా జలాలను తెచ్చాం. గంగమ్మ కరుణించింది... కృష్ణమ్మ తరలి వచ్చింది. 2014-19 మధ్య సీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై రూ.12,441 కోట్లు ఖర్చు పెట్టాం. వైసీపీ కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. ఎన్నికల ముందు గేట్లతో సెట్టింగులు వేసి డ్రామాలాడారు. నీళ్లు కూడా బయట నుంచి తెచ్చి వదిలారు. వారు విమానం ఎక్కేలోగానే ఆ నీరు ఇంకిపోయింది. అబద్ధాలు చెప్పడంలో వైసీపీ దిట్ట. అసాధ్యాలు సుసాధ్యం చేయడంలో ఎన్డీఏ దిట్ట. నేను వెళ్లేలోగా నీరు ఇంకిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రతి చెరువుకు నీరిచ్చే బాధ్యత నాది.” అని సీఎం హామీ ఇచ్చారు.
*టీడీపీకి నీటి విలువ తెలుసు*
“నీటి విలువ తెలిసిన పార్టీ తెలుగుదేశం. వైసీపీ లాంటి పార్టీలకు నీటి విలువ, రైతు సమస్యలు ఎప్పటికీ తెలియవు. 100 రోజుల కార్యాచరణ లక్ష్యంతో రూ.3,850 కోట్లు మంజూరు చేశాం. కాల్వలు వెడల్పు చేశాం. నాలుగు నెలల్లో 40 టీఎంసీల నీరు తెచ్చాం. పది రిజర్వాయర్లను నింపాం. చెరువులను నింపుతున్నాం. సీమ జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందుతుంది. పరిశ్రమలకు కూడా నీరు లభిస్తుంది. వచ్చే ఏడాదికి చిత్తూరు చివరి భూములకు కూడా నీరందిస్తాం. పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, పూతలపట్టు, చిత్తూరు, జీడీ నెల్లూరు నియోజకవర్గాల ప్రజలకు దీంతో ప్రయోజనం కలుగుతుంది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా వంశధార-పెన్నా నదుల అనుసంధానం చేయవచ్చు. ఇదే జరిగితే రాయలసీమకే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాలకు శాశ్వతంగా కరవు అనేదే ఉండదు. తెంలగాణ ప్రజలు, నేతలు కూడా నదుల అనుసంధానం వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకోవాలి. నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో నీటి నిర్వహణపైనే దృష్టి పెట్టాను. నీరు-మీరు, నీరు-చెట్టు, చెక్ డ్యాములు, సాగు నీటి సంఘాలు, వాటర్ షెడ్లు అంటూ నీటి నిర్వహణ కోసం ప్రయత్నించాను. పరుగెత్తే నీటిని నడిపించాలి... నడిచే నీటిని నిలపాలనే సూత్రంతో పనిచేశాను. కుప్పం సహా సీమలోని ప్రతి చెరువునూ నింపుతాం. చెరువులను నింపితే... వర్షాభావ పరిస్థితులు వచ్చినా తట్టుకోగలం” అని సీఎం అన్నారు.
*రాక్షసుల్లా అడ్డు పడుతున్నారు*
“రాష్ట్రాభివృద్ధికి యజ్ఞం చేస్తుంటే... కొందరు రాక్షసుల్లా అడుగడుగునా అడ్డుపడుతున్నారు. తప్పుడు ప్రచారాలతో ప్రతి మంచి పనికీ అడ్డంకులు సృష్టిస్తున్నారు. చేతనైతే అభివృద్ధి, సంక్షేమంలో పోటీ పడాలి. మొన్నటి ఎన్నికల్లో సీమ ప్రజలు 52 సీట్లకు గాను వాళ్లకు 7 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినా వారికి బుద్ధి రాలేదు. ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న వైసీపీ విషవృక్షంలా తయారైంది. తన ఉనికి చాటుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే వారి కుట్రలకు కాలం చెల్లింది. ప్రజలు చైతన్యంతో కుట్రలు బద్దలు కొడుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కుప్పంలో తెలుగుదేశాన్నే గెలిపిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న కుప్పంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నించారు. రప్పా రప్పా రాజకీయం చేస్తామని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల్లో రప్పా రప్పా రాజకీయం ఎలా ఉంటుందో... ప్రజలే వారికి చూపించారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా... ఇబ్బందులు సృష్టించినా.. అభివృద్ధి చేస్తున్నాం.. సంక్షేమమూ చేపడుతున్నాం.” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
*ఆటో డ్రైవర్లకూ అండగా ఉంటాం*
“ఉచిత బస్సు ప్రయాణంతో ఆడబిడ్డలంతా సంతోషంగా ఉన్నారు. స్త్రీ శక్తితో ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడకుండా చూస్తాం. వారిని కూడా ఆదుకుంటాం. ఆటో డ్రైవర్లకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తాం. మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల రిక్రూర్మెంట్ చేపడుతున్నాం. కుప్పం నుంచి కూడా 50 మంది టీచర్లు ఎంపికయ్యారు. కుప్పం నియోజకవర్గానికి ఒకప్పుడు టీచర్లే వచ్చే వారు కారు.. ట్రాన్సఫర్లు చేయించుకుని వెళ్లిపోయేవారు. కానీ ఇప్పుడు కుప్పం యువతీ, యువకులే టీచర్లయ్యారు. తల్లికి వందనం అందరికీ ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులను ఆదుకుంటున్నాం. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. పెన్షన్లు ఇస్తున్నాం. దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఇలా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ పాలన చేస్తున్నాం. కుప్పానికి 12 పరిశ్రమలు వచ్చాయి.
రూ.3908 కోట్లు పెట్టుబడులు, 15600 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 26581 మందికి పరోక్ష ఉపాధి లభిస్తుంది.
ఐ-ఫోన్ ఛాసిస్ ఉత్పత్తి చేసేలా హిందాల్కో సంస్థ యూనిట్టును ప్రారంభించబోతోంది. కుప్పాన్ని ఇతర రాష్ట్రాలకు కనెక్ట్ చేస్తూ పెద్ద ఎత్తున రహదారుల నిర్మాణం జరుగుతోంది. ప్రపంచంలోని టెక్నాలజీనంతా కుప్పానికి తెస్తాను.” అని చంద్రబాబు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల, చిత్తూరు జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
*కుప్పంలో సీఎం పర్యటన సైడ్ లెట్స్*
చంద్రబాబు జలహరతి ఇస్తున్న సమయంలోనే కుప్పంలోని మొత్తం 60కు పైగా ప్రాంతాల్లో జలహారతులు కుప్పం ప్రజలు ఇచ్చారు. కుప్పంలోని తన నివాసం నుంచి ఆర్టీసీ బస్సులో ముఖ్యమంత్రి ప్రయాణించారు.
మహళలు, రైతులతో కలిసి స్త్రీ శక్తి బస్సులో సీఎం వెళ్లారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు మహిళలు, రైతులతో సంభాషిస్తూ బస్సులో సీఎం ప్రయాణించారు. స్త్రీ శక్తి పేరుతో అందిస్తున్న ఉచిత బస్సు సదుపాయం ఎలా ఉందని మహిళలను అడిగిన చంద్రబాబు.... తాము ఎక్కడికి వెళ్లినా ఇబ్బంది లేకుండా... ఫ్రీ బస్సులో వెళ్తున్నామని మహిళలు చెప్పారు. హంద్రీ-నీవా నీళ్లు తొలిసారి కుప్పానికి వచ్చాయి.. కాల్వల్లో నీళ్లు చూశారా..? చెరువులు నిండాయా అంటూ చంద్రబాబు ఆరా తీశారు. తొలిసారి కుప్పానికి కృష్ణమ్మ వచ్చిందని... చాలా సంతోషంగా ఉందని రైతులు, మహిళలు చెప్పారు. ఇక సభకు హాజరయ్యే ముందు బోటులో పరమ సముద్రం చెరువులోకి వెళ్లి చెరువును పరిశీలించారు. ఇక సభలో 2014-19 మధ్య అసెంబ్లీలో సాగునీటి రంగంపై జరిగిన చర్చ వీడియోను సీఎం చంద్రబాబు ప్రదర్శించారు. నాడు ప్రతి నియోజకవర్గానికి నీళ్లిస్తామని సభలో చంద్రబాబు ప్రకటించిన వీడియోను పొందుపరిచారు. జగన్ అడ్డంగా పడుకున్నా... నీళ్లిచ్చి తీరతామంటూ నాడు సభలో నాడు చంద్రబాబు స్పష్టం చేస్తూ ప్రకటన వీడియో చూసిన సభికులు చప్పట్లతో సభా ప్రాంగణాన్ని మార్మోగించారు. ఈ సందర్భంగా వైసీపీ తీరును సభలో సీఎం ఎండగట్టారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను తరలించి.. కృష్ణా జలాలను సీమకు తీసుకువచ్చే ప్రయత్నం చేశామని నాడు సభలో జరిగిన చర్చను చంద్రబాబు వివరించారు. పట్టిసీమకు అడ్డుపడే ప్రయత్నం చేశారని వైసీపీ తీరును చంద్రబాబు దుయ్యబట్టారు. 2019 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల సీమకు నీరు చేరలేదని ముఖ్యమంత్రి వెల్లడించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి సందర్శించారు. రిజర్వాయర్లల్లో నీరు ఏ విధంగా నింపుతున్నాం.. ప్రవాహాలు వస్తున్న తీరును జనానికి అర్థమయ్యేలా సీసీ కెమెరాల ద్వారా లైవులో చూపించే ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. నీటి విలువ, ఇరిగేషన్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నామనే అంశాలను, ఎన్ని రోజుల్లో నీటిని తరలించామనే విషయాలను వివరిస్తూ లైవ్ డెమానిస్ట్రేషన్ ఇవ్వాలని సీఎం సూచించారు. హంద్రీ-నీవా కాల్వ విస్తరణ పనుల పైలాన్ ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.
*కుప్పం అభివృద్ధికి ఎంవోయూలు*
కుప్పం ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వివిధ సంస్థలతో 6 ఎంఓయూలు చేసుకున్నారు.
* కుప్పం పరిధిలో వ్యర్ధాల నుంచి సంపద కార్యక్రమం అమలు కోసం ఏజీఎస్- ఐటీసీతో ఒప్పందం
* వ్యర్ధాల సుస్థిర నిర్వహణపై ఇంటింటి ప్రచారం, పాఠశాలల్లో అవగాహనా కార్యక్రమాలను 15 ఏళ్ల పాటు నిర్వహించేలా ఒప్పందం
* కుప్పంలో మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయటం, మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు గ్రామీణ ప్రాంతాల్లో మార్కెటింగ్ అంశాలపై షీలీడ్స్ సంస్థతో ఒప్పందం
* కుప్పం నియోజకవర్గంలో 10వేల మంది మహిళల్ని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయటంతో పాటు గ్రామీణ మార్కెట్లను అందిపుచ్చుకునేలా శిక్షణ ఇచ్చేందుకు ఎంఓయూ
* కుప్పంలో ఫైబర్ బోర్డు ఉత్పత్తి కోసం కింగ్స్ వుడ్ డెకార్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఎంఓయూ
* రూ.1,100 కోట్ల పెట్టుబడితో మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డును ఉత్పత్తి చేయనున్న కింగ్స్ వుడ్ సంస్థ
* ఈ యూనిట్ ఏర్పాటుతో 2012 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు
* కుప్పంలో 2 సీటర్ ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసిన పయనీర్ క్లీన్ యాంప్స్ లిమిటెడ్
* రూ.150 కోట్ల పెట్టుబడితో ఏడాదికి 70 నుంచి 100 శిక్షణకు ఉపయోగించే 2 సీటర్ విమానాలను తయారు చేయనున్న పయనీర్ యాంప్స్ లిమిటెడ్
* మొత్తం 250 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న పయనీర్ క్లీన్ యాంప్స్ లిమిటెడ్
* బెంగుళురుకు చెందిన స్పేస్ టెక్నాలజీ సంస్థ ఎత్రెయాల్ ఎక్ప్ ప్లోరేషన్ గిల్డ్ సంస్థతో అవగాహనా ఒప్పందం
* మీడియం లిఫ్ట్ లాంచింగ్ రాకెట్ రేజర్ క్రెస్ట్ ఎంకె-1 తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం అవగాహనా ఒప్పందం చేసుకున్న ఎత్రెయాల్
* రూ. 500 కోట్ల పెట్టుబడిని మూడు దశల్లో పెట్టేలా కార్యాచరణ, మొత్తం 500 మందికి ఉద్యోగ అవకాశాలు
* అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ ఏర్పాటు చేసేందుకు రెడ్ బెర్రీ ఫుడ్ లాజిస్టిక్స్ తో ఒప్పందం
* రూ.300 కోట్ల పెట్టుబడితో 15 వేల మందికి ఉపాధి కల్పించేలా ప్రతిపాదన సమర్పించిన రెడ్ బెర్రి ఫుడ్ లాజిస్టిక్స్ సంస్థ
* మామిడి, జామ, టమాటో పల్పింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్న రెడ్ బెర్రీ ఫుడ్ లాజిస్టిక్స్
addComments
Post a Comment