*రాష్ట్రమంతటా విజిలెన్స్ బృందాల దాడులు*
*2,845 మెట్రిక్ టన్నుల ఎరువుల స్వాధీనం... 191 కేసులు నమోదు*
*ఎవరినీ ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం*
అమరావతి, సెప్టెంబర్ 1 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల అక్రమ విక్రయాలు జరగకూడదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల విజిలెన్స్ బృందాలు దాడులు చేశాయి. గతవారం రోజులుగా నిర్వహించిన సోదాల్లో పెద్దఎత్తున ఎరువుల అక్రమ నిల్వలు బయటపడ్డాయి. అలాగే బహిరంగ మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి కొందరు డీలర్లు అక్రమ విక్రయాలకు పాల్పడుతున్నట్టు దాడుల్లో వెళ్లడైంది. ఆగస్ట్ 23 నుంచి ఆగస్ట్ 31 వరకు మొత్తం 286 విజిలెన్స్ బృందాలు 598 దుకాణాల్లో తనిఖీలు చేపట్టాయి. ఈ సందర్భంగా అక్రమంగా విక్రయిస్తున్న రూ.1.83 కోట్ల విలువైన 934 మెట్రిక్ టన్నుల ఎరువులు సీజ్ చేశారు. వారిపై 67 కేసులు నమోదు చేశారు. అలాగే అక్రమంగా నిల్వ ఉంచిన రూ.4.30 కోట్ల 1,911 మె.ట. ఎరువుల అమ్మకాలు తాత్కాలికంగా నిలిపివేస్తూ స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 124 కేసులు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమించిన మరో 8 దుకాణ యజమానులపై క్రిమినల్ కేసులు కూడా పెట్టారు. దీనిపై సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.., రైతులను ఇబ్బంది పెట్టేలా ఫెర్టిలైజర్ దుకాణదారులు, డీలర్లు నడుచుకుంటే వారిని ఉపేక్షించవద్దని అధికారులకు సూచించారు. అన్నదాతలకు ఎక్కడా ఎరువులు, పురుగుమందుల కొరత రానియొద్దని నిర్దేశించారు.
addComments
Post a Comment