*అసెంబ్లీకి రండి చర్చిద్దాం... వైసీపీకి సీఎం సవాల్
*తెలుగు వారికి పెన్షన్ పరిచయం చేసింది ఎన్టీఆరే*
*30 ఏళ్లక్రితమే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని.. ఏనాడూ విశ్రమించ లేదు*
*కూటమి గెలిచాకే ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది*
*తప్పును నిలదీసే ధైర్యం ప్రజల్లో రావాలి*
*రాజంపేట ప్రజా వేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు*
*పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా పింఛన్లు పంపిణీ చేసిన సీఎం*
*దోబీ ఘాట్ సందర్శించి రజకులతో ముచ్చటించిన ముఖ్యమంత్రి*
రాజంపేట,సెప్టెంబర్ 1 (ప్రజా అమరావతి): ఫేక్ ప్రచారం చేయడం కాదు...అసెంబ్లీకి వచ్చి వివిధ అంశాలపై చర్చించాలని రాజంపేట ప్రజావేదిక నుంచి సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీకి సవాల్ విసిరారు. పేదలకు సేవలో కార్యక్రమంలో భాగంగా సోమవారం రాజంపేట మండలం బోయినపల్లిలో సీఎం పర్యటించారు. కిడ్నీ పనిచేయక మంచానికే పరిమితమైన యడవల్లి సుమిత్రమ్మ ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి ఆమెకు స్వయంగా పింఛను అందించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అలాగే వివిధ పథకాల లబ్దిదారులతో మాట్లడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అసెంబ్లీకి రాకుండా...సోషల్ మీడియాలో, పత్రికా సమావేశాల్లో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న వైసీపీపై ముఖ్యమంత్రి విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... “మొన్నటి వరకూ సిద్ధం, సిద్ధం అంటూ ఎగిరిపడిన 11 మంది వైసీపీ నేతలు అసెంబ్లీలో చర్చకు రావాలి. ఎవరు సంక్షేమం చేశారో, ఎవరు అభివృద్ధి చేశారో తేల్చు కుందాం. ఫేక్ ప్రచారాలతో ఎల్లకాలం ప్రజలను మోసం చేయలేరు. క్లెమోర్ మైన్లతో పేల్చినా చలించని నేను ఎవరికీ భయపడను. సూపర్ సిక్స్ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు, పెట్టుబడులు మొదలు.. బాబాయ్ హత్య, డోర్ డెలివరీ రాజకీయాలు, కోడి కత్తి డ్రామాలు, గులక రాయి ఎపిసోడ్లు, పులివెందుల-ఒంటిమిట్ట ఎన్నికలు ఇలా దేని పైనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. వాళ్లు రక్తం పారించిన సీమలో మేం నీరు పారించాం. సీమలో ఫ్యాక్షన్ మాట వినపడకుండా చేశాం. రాష్ట్రంలో రౌడీ అన్న వాడు లేకుండా చేశాం. సొంత కార్యకర్తను కారుతో తొక్కించి.. నెపాన్ని మా మీద వేశారు. మామిడి కాయలు రోడ్డుపై తొక్కించి డ్రామాలాడిన వ్యక్తులు మమ్మల్ని విమర్శిస్తున్నారు. మహిళలపై సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేస్తున్న వారిని కఠినంగా శిక్షించి ఆడబిడ్డలకు భద్రత కల్పిస్తాం.” అని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
*పింఛన్ల పంపిణీ దానం కాదు...బాధ్యత*
“పింఛన్ల పంపిణీ దానమో, ధర్మమో కాదు. అది ప్రభుత్వాల బాధ్యత. ప్రతి నెలా పింఛన్ల పంపిణీ పండుగా జరుగుతోంది. గత ప్రభుత్వంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి చూశాం. ఇప్పుడు లక్షా 65 వేల మంది అధికారులు కేవలం 3 గంటల్లో పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఎన్డీఏ ప్రభుత్వం పేదలకు పింఛన్లు అందిస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు రూ.42 వేల కోట్లు కేవలం పెన్షన్ల కోసం ఖర్చు చేశాం. ఈ సెప్టెంబర్ నెలలోనే పింఛన్ల కింద 63,61,380 మందికి రూ.2,747 కోట్లు వెచ్చించాం. 1983లో ఎన్టీఆర్ రూ. 30తో పేదలకు పింఛనుకు శ్రీకారం చుట్టారు. నేను 1995లో ముఖ్యమంత్రి అయ్యాక పెన్షన్ ను రూ. 75కు పెంచాను. 2014 నాటికి రూ.200 ఉన్న పింఛన్‌ను మళ్లీ ఒకేసారి రూ.1,000కి పెంచాం. దివ్యాంగులకు రూ.1500 చేశాం. మళ్లీ 2018లో వృధ్యాప్య, వితంతు పెన్షన్‌ను రూ.2,000లకు, దివ్యాంగులకు రూ.3,000 చేశాం. ఐదేళ్లలో పింఛన్లు 10 రెట్లు, దివ్యాంగులకు 12 రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం.” అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
*ఫేక్ పార్టీ-ఫేక్ పింఛన్లు*
“గత ప్రభుత్వంలో అవయవాలు సక్రమంగా ఉన్నవారికి కూడా పింఛన్లు మంజూరు చేశారు. వారి పార్టీ కార్యకర్తలకు ప్రజల సంపదను దోచిపెట్టారు. ప్రభుత్వ ధనం దోపిడీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలో వద్దో ప్రజలే చెప్పాలి. భర్త చనిపోతే భార్యకు పింఛను ఇవ్వని గత పాలకులు విమర్శలు చేస్తున్నారు. అర్హులకు మాత్రమే చెందాల్సిన సంక్షేమం.. అనర్హులకు ఇవ్వొచ్చా? వైసీపీ తీరును ప్రజలు గమనించాలి. తప్పును తప్పు అనే చెప్పే ధైర్యం ప్రజలకు రావాలి. మంచికి అండగా నిలబడాలి. అప్పుడే మాకు మరింత బలం చేకూరుతుంది. ప్రజలే నా బలం...బలగం. వారి కోసం మరింత సంక్షేమాన్ని అందిస్తాం. కూటమి ప్రభుత్వం రాగానే భర్త చనిపోయిన నెలలోనే పింఛన్లు అందిస్తున్నాం. ఈ నెలలో రూ.3.14 కోట్లతో కొత్తగా 7,872 మందికి వితంతు పింఛన్లు ఇస్తున్నాం. రాష్ట్రంలో మొత్తం 8,10,182 మంది దివ్యాంగ పింఛన్లు, మెడికల్ పింఛన్లు ఇస్తున్నాం. దివ్యాంగులకు ఇస్తున్న రూ.6 వేలల్లో రూ.5,550 పెంచింది తెలుగు దేశం ప్రభుత్వాలే. 2 నెలలుగా పింఛను తీసుకోని 1,20,187 మందికి రూ.101 కోట్లు, 3 నెలలుగా పెన్షన్ తీసుకోని 11,986 మందికి రూ.15 కోట్లు అందించడం ప్రజా సంక్షేమంపై ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం.” అని ముఖ్యమంత్రి అన్నారు.
*ప్రజలకు నిలదీసే స్వేచ్ఛను ఇచ్చాం*
రాష్ట్ర పునర్నిర్మాణం కోసం బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తే ప్రజలు చారిత్రాత్మక విజయం కట్టబెట్టారు. రాష్ట్ర విభజన తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చాయి.2014-19లో దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి మన రాష్ట్రంలో చేశాం. 2019 నుంచి గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఐదేళ్లూ ప్రజల మొహాల్లో నవ్వులు లేవు. ఏం మాట్లాడలేని పరిస్థితి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాకే ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ఎమ్మెల్యేలు అయినా సరే...తప్పు చేశారని భావిస్తే...నిలదీయోచ్చు. ఇదే తరహాలో ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. మంచి ప్రభుత్వానికి అండగా నిలవాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు మించే సంక్షేమం అందిస్తున్నాం. 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీ నిర్వహించాం. ఎంతమంది పిల్లలున్నా.. తల్లికి వందనం ఇచ్చాం. అన్న క్యాంటీన్, అన్నదాత సుఖీభవ అమలు చేశాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. చేనేతలకు ఉచిత విద్యుత్, మత్య్సకారుల సేవలో భాగంగా వేట విరామ సమయంలో రూ.20 వేలు, నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేలకు వేతనాలు పెంపు, 40వేలకు పైగా సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. సన్న బియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, రోడ్లపై గుంతలు పూడ్చుతున్నాం. రైతులకు 90 శాతం సబ్సీడీతో డ్రిప్ ఇస్తున్నాం.” అని సీఎం చంద్రబాబు తెలిపారు.
*ప్రజా సేవే నా లక్ష్యం*
“సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఇదే రోజున నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. ఈ కాలంలో నేను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. అయినా వెనకడుగు వేయలేదు. సమైక్యాంధ్రలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా, విపక్షనేతగా పని చేశాను. సంపద సృష్టించి, ప్రజలకు సంక్షేమం అందించాననే తృప్తి నాకు ఉంది. రాజంపేటలో నేను కట్టిన దోబీ ఘాట్లు చూసి ఆనందించాను. 25 ఏళ్ల క్రితం ఈ ఘాట్లు నేను కట్టినవే అని వారు చెబితే సంతోషం వేసింది. ఈ 30 ఏళ్లలో ఏనాడు నేను విశ్రమించ లేదు. నిద్ర లేచింది మొదలు మిషన్ తరహాలో పనిచేస్తాను. తెలుగు జాతి అగ్రస్థానంలో ఉందంటే అందుకు టీడీపీనే కారణం. నాడు హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములం అయ్యాం. నేడు అమరావతి నిర్మాణం చేసే అవకాశం ప్రజలు ఇచ్చారు. ఆవిర్భావం నుంచి పార్టీ వెన్నంటే ఉన్న బీసీల రుణం తీర్చు కోలేనిది. అనునిత్యం ప్రజా సేవలోనే ఉన్నాను. పేదల జీవితాల్లో వెలుగులు నింపి, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నా.” అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
*రాళ్లసీమను రతనాల సీమ చేస్తున్నాం*
“రాళ్ల సీమగా మారుతుందనుకున్న రాయలసీమను రతనాలసీమ చేస్తున్నాం. సీమలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చాం. కరెంటు లేని పరిస్థితి నుంచి ఇంటిపైనే సౌర విద్యుత్ తయారు చేసే పరిస్థితి తెచ్చాం. పేదరికం నిర్మూలన కోసం వెలుగు తీసుకొచ్చాను. డ్వాక్రా, సాగునీటి , సహకార సంఘాలు ఏర్పాటు చేశాం. చెప్పినట్టే సీమకు కృష్ణా జలాలు తెచ్చాం. సీమ అభివృద్దికి బ్లూ ప్రింట్ అమలు చేస్తున్నాం. కియాతో అనంతపురం జిల్లా రూపురేఖలు మార్చేశాం. రాబోయే రోజుల్లో ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్స్ రంగాలకు సీమను హబ్ చేశాం. గోదావరి నుంచి నీరు వృథాగా సముద్రంలోకి పోతుంటే సీమలో నీటి కోసం ఇబ్బందులు వస్తున్నాయి. వంశధార నుంచి గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం చేస్తాం.” అని చంద్రబాబు వెల్లడించారు.
*జిల్లాల విభజన సమస్యను పరిష్కరిస్తాం*
“రాజంపేటను అభివృద్ధిలో ముందుకు తీసుకెళతాం. జిల్లాల విభజనలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని సరి చేస్తాం. రాజంపేట నియోజకవర్గం ప్రజలు ఎన్నికల్లో మాకు ఓటేయలేదు. కొన్ని కారణాల వల్ల రాజంపేట ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు రాలేదు. అయినప్పటికీ రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు. కూటమిని ఓడించారు. గెలిచిన వారిని చూసుకోవాలి... వారి సమస్యలు తీర్చాలి. అయినా రాజకీయాన్ని అభివృద్ధితో ముడిపెట్టను... అభివృద్ధి చేస్తాను. 2014లో టీడీపీ ప్రభుత్వమే ఒంటిమిట్ట శ్రీరాముడి ఆలయాన్ని అభివృద్ధి చేసింది. రాజంపేటకు మెడికల్ కాలేజీ కావాలని అడిగారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటాం. ప్రజలు అందరికీ సంక్షేమం అందించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పాలన చేస్తోంది. పీ4తో పేదరిక నిర్మూలన సాధ్యం చేసి చూపిస్తాం.” అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
*దోబీ ఘాట్ సందర్శన... షెడ్లు నిర్మించాలని ఆదేశం*
బోయనపల్లిలో దోబీ ఘాట్ ను ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుపై రజకులను అడిగి తెలుసుకున్నారు. దోబీ ఘాట్లలో షెడ్లు నిర్మించాలని రజకులు కోరగా వెంటనే తగిన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే దోబీ ఘాట్ కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులున్నా... అధికారులకు తెలియచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సహా జిల్లా ప్రజా ప్రతినిధులు, స్థానిక టీడీపీ నేతలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment