ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల జాతీయ మీడియా పర్యటనను ప్రారంభించిన పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ.

 ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల జాతీయ మీడియా పర్యటనను ప్రారంభించిన పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ







విజయవాడ- సెప్టెంబర్ 15, 2025 (ప్రజా అమరావతి):


భారత ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ సహకారంతో, రాష్ట్రంలో మూడు రోజుల జాతీయ మీడియా పర్యటనను ఈరోజు ప్రారంభించింది. ఈ పర్యటన ప్రముఖ జాతీయ మరియు ప్రాంతీయ మీడియా నిపుణులను ఒకచోట చేర్చి, వినూత్నమైన అట్టడుగు స్థాయి పాలనా కార్యక్రమాల అమలును పరిశీలించి నివేదించడానికి వీలు కల్పిస్తుంది.


మీడియా ప్రతినిధి బృందానికి పత్రికా సమాచార కార్యాలయం (పంచాయతీ రాజ్) డిప్యూటీ డైరెక్టర్ అదితి అగర్వాల్ నేతృత్వం వహిస్తున్నారు.


1వ రోజు ముఖ్యాంశాలు:


వెంగళాయపాలెం గ్రామ పంచాయతీ - స్వచ్ఛ రథం పైలట్ ప్రాజెక్ట్ సందర్శన


మొదటిగా గుంటూరు గ్రామీణ మండలంలో ఉన్న వెంగళాయపాలెం గ్రామ పంచాయతీలోని స్వచ్ఛ రథం పైలట్ ప్రాజెక్ట్ అమలును జర్నలిస్టులు పరిశీలించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రారంభించిన స్వచ్ఛ రథం అనేది ఒక మొబైల్ యూనిట్ గృహాల నుంచి ఉత్పన్నమయ్యే స్క్రాప్, వ్యర్థ పదార్థాలను మార్పిడి చేసుకుని, సమాన బరువు కలిగిన రోజువారీ నిత్యావసరాలను అందిస్తుంది. గ్రామ స్థాయిలో వ్యర్థాల విభజనను ప్రోత్సహించి స్థిరమైన పారిశుధ్యాన్ని ప్రోత్సహించడమే ఈ చొరవ లక్ష్యం.


ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డ్‌ సందర్శన 


మీడియా బృందం గుంటూరులోని ఆసియాలోనే అతిపెద్ద మిర్చి (మిరప) మార్కెటింగ్ యార్డ్‌ను సందర్శించింది. అక్కడ వారు మిర్చి యార్డ్ కార్యదర్శి శ్రీమతి చంద్రికతో సంభాషించి, క్షేత్రస్థాయి వాణిజ్య, మార్కెటింగ్ కార్యకలాపాలతో పాటుగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుందో తెలుసుకున్నారు.


చింతలపూడి గ్రామ పంచాయితీ - స్వామిత్వ పథకం & గ్రామ సభాసార్ ఏఐ ఆవిష్కరణలు


మధ్యాహ్నం, మీడియా బృందం చింతలపూడి గ్రామ పంచాయతీకి చేరుకుని అక్కడ స్వామిత్వ పథకం అమలు గురించి తెలుసుకున్నారు. ఈ చొరవ గ్రామీణ నివాసితులకు చట్టబద్ధమైన ఆస్తి హక్కులను అందిస్తుంది, వారు సంస్థాగత రుణాన్ని పొందటానికి, భూమిని మానిటైజ్ చేయడానికి మరియు వివాదాలను తగ్గించడానికి వీలు కల్పిస్తుంది. ఈ పథకం వారి ఆర్థిక స్థిరత్వాన్ని, భూ యాజమాన్య భద్రతను ఎలా మెరుగుపరిచిందో లబ్ధిదారులు తెలుపుతూ ప్రభుత్వానికి వారి కృతజ్ఞతను వ్యక్తం చేశారు.


ఈ సందర్శనలో మంత్రిత్వ శాఖ యొక్క తాజా ఏఐ-ఆధారిత సాధనమైన సభాసార్‌ను గ్రామసభ యొక్క ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా వివరణ పొందారు. పూర్తయిన గ్రామసభల వీడియో రికార్డింగ్‌లను విశ్లేషించడం ద్వారా డాక్యుమెంటేషన్‌ను గణనీయంగా సులభతరం చేసి డిజిటల్ పారదర్శకతను నిర్ధారించేలా ఈ ఏఐ సాధనాన్ని రూపొందించారు. ఇది స్వయంచాలకంగా సమావేశాలను డిజిటల్ విధానంలో పొందుపరుస్తుంది.


తోట చందన, అసిస్టెంట్ డైరెక్టర్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, సిబ్బంది మరియు స్థానిక కమ్యూనిటీ నాయకులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.

Comments