*అరబిందో సంస్థకు మేలు చేయడం కోసం క్లాజులను మార్చారు: పట్టాభిరాం* అమరావతి : క్లాజ్ నెం. 5.1.3లో ఉన్న అంబులెన్స్‌లను పరిశీలించి, వాటిలో ఇంకేమైన రిపేర్ చేయాల్సినవి, అదనంగా ఎక్విప్‌మెంట్ తీసుకురావాల్సినవి, ఉన్నవాటిని సరిచేయాలనే క్లాజ్ ఉంటే.. ఆ క్లాజ్‌ను ప్రభుత్వం తీసివేసిందని టీడీపీ నేత పట్టాభిరాం ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 5.1.4 క్లాజులో కొనుగోలు చేసే అంబులెన్స్‌లకు సెల్టర్లు కల్పించాలని ఉంటే దాన్ని కూడా తీసివేయడమేంటని ప్రశ్నించారు. ఇదేనా ప్రభుత్వం జ్యూడిషియల్ రివ్యూ అని ప్రశ్నించారు. ఉన్న క్లాజులను తీసివేయడమే ప్రభుత్వం సంస్కరణ అని ఎద్దేవా చేశారు. ఫ్రీ క్వాలిఫికేషన్ క్రేటీరియా క్లాజు నెం. 6.1 సబ్ క్లాజ్ 2.. దీంట్లో ఎక్కడా ఎబ్రాడ్ అనే పదంలేదని.. ప్రభుత్వం జ్యూడిషియల్ రివ్యూలో భాగంగా ఎబ్రాడ్ అనే పదాన్ని ఎందుకు చేర్చారని పట్టాభి ప్రశ్నించారు. అరబిందో సంస్థకు అంబులెన్స్‌ల విషయంలో ఎక్కడా అనుభవం లేదని, వాళ్లకు అనుకూలంగా ఉండేందుకు, మేలు చేసేందుకు ఎబ్రాడ్ అనే పదాన్ని చేర్చారన్నారు. అనుభవం లేని ఆ సంస్థకు అంబులెన్స్ సర్వీసులను ప్రభుత్వం కట్టబెట్టిందని, రూ. 307 కోట్లు దోచిపెట్టడం కోసం జ్యూడిషియల్ రివ్యూ పేరుతో ప్రభుత్వం క్లాజుల్లో మార్పులు చేసి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిందన్నారు. దీనికి జగన్ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని పట్టాభిరాం ప్రశ్నించారు. ఈ కుంభకోణానికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయని, దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన సవాల్ విసిరారు.


Comments