బాలల దినోత్సవం ఏ దేశంలో ఎప్పుడు? భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ పుట్టిన రోజైన నవంబర్ 14న దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం జరుపుకొంటాం. నెహ్రూకి పిల్లలంటే ఎంతో ఇష్టం. పిల్లలు కూడా ఆయన్ను చాచా నెహ్రూ అంటూ ప్రేమగా పిలిచేవారు. అందుకే నెహ్రూకి పిల్లలకు మధ్య ఉన్న బంధానికి గుర్తుగా ఆయన పుట్టిన రోజున పాఠశాలల్లో విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ‘బాలల దినోత్సవా’న్ని ఘనంగా జరుపుతాం. అయితే, ఐక్యరాజ్య సమితి నవంబర్ 20ను అంతర్జాతీయ బాలల దినోత్సవంగా ప్రకటించింది. ఒక్కో ఏడాది ఒక్కో థీమ్‌తో నిర్వహిస్తుంది. కానీ, కొన్ని దేశాలు భారత్‌లాగే వేర్వేరు రోజుల్లో జరుపుకుంటున్నాయి. మరి ఏయే దేశాలు ఎప్పుడు.. ఎలా జరుపుకుంటున్నాయో చూద్దామా.. జపాన్ జపాన్‌లో ఏటా మే 5న ‘కొడొమో నొ హి’ పేరుతో బాలల దినోత్సవాన్ని జరుపుతారు. ఈ రోజు తల్లిదండ్రులు వారికి ఎంత మంది సంతానం ఉన్నారో అన్ని చేప ఆకారంలో ఉండే బుడగలను గాలిలోకి వదులుతారు. పిల్లలకు నచ్చిన ఆహార పదార్థాలన్నీ వండి పెడతారు. ఇక పిల్లలు ఈ రోజున తమ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు, బంధువులకు కృతజ్ఞతలు చెబుతారు. బాలల దినోత్సవం సందర్భంగా క్రీడల్లో రాణించే పిల్లలకు టోక్యోలోని నేషనల్ స్టేడియంలో పిల్లల కోసం ప్రత్యేకంగా కిడ్స్ ఒలింపిక్స్ నిర్వహిస్తారు. అయితే, ఇవన్నీ కేవలం బాలురకే. బాలికలకు ప్రత్యేకంగా మార్చి 3న ‘డాల్స్ డే’ పేరుతో మరో బాలల దినోత్సవం జరుపుతారు. ఆ రోజున ఇంట్లో బామ్మలు, తల్లులు వారికి వారసత్వంగా వచ్చిన బొమ్మలను అమ్మాయిలకు ఇస్తారు. దక్షిణ కొరియా కూడా మే 5న బాలల దినోత్సవం జరుపుకొంటుంది. ఈ రోజున ఆ దేశంలోని తల్లిదండ్రులు పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు, దుస్తులు, ఇతర వస్తువులు బహుమతిగా ఇస్తారు. థాయ్‌లాండ్ థాయ్‌లాండ్‌లో బాలల దినోత్సవాన్ని ఏటా జనవరి నెల రెండో శనివారం రోజున నిర్వహిస్తారు. అక్కడ బాలల దినోత్సవాన్ని ‘వాన్ డెక్’ అని వ్యవహరిస్తారు. దేశానికి చిన్నారులే అమూల్యమైన వనరులని అక్కడి ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఆ రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి వేడుకలను ఘనంగా జరుపుతారు. థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి చిన్నారులను ఉద్దేశించి మాట్లాడమే కాదు.. ఓ నినాదాన్ని ఇస్తారు. దేశంలోని జూ, మ్యూజియం, ఆర్మీ, నేవీ, వైమానిక శిబిరాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పార్లమెంట్‌ను చిన్నారులు ఆ రోజున ఉచితంగా సందర్శించే అవకాశం ఉంటుంది. టర్కీ టర్కీ బాలల దినోత్సవాన్నే ‘నేషనల్ సోవిరిటీ అండ్ చిల్డ్రన్స్ డే’గా జరుపుకుంటున్నారు. 1920 ఏప్రిల్ 23న టర్కీ జాతీయ అసెంబ్లీని స్థాపించారు. అయితే టర్కీ ప్రథమ అధ్యక్షుడు అటాటర్క్‌కు పిల్లలంటే మక్కువ. అందుకే ఆయన గౌరవార్థం.. అసెంబ్లీ స్థాపించిన రోజునే బాలల దినోత్సవం జరుపుకోవడం మొదలుపెట్టారు. ఆ రోజు చిన్నారుల్ని టర్కీ జాతీయ అసెంబ్లీకి తీసుకెళ్తారు. ప్రజా ప్రతినిధుల స్థానంలో చిన్నారుల్ని కూర్చొబెడతారు. బాల నాయకుల నుంచి ఒక అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ఆ రోజంతా టర్కీ ప్రభుత్వం బాలల చేతుల్లోనే ఉంటుంది. అంతేకాదు.. అంతర్జాతీయ స్థాయిలో బాలల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివిధ దేశాల సంస్కృతి, సంప్రదాయాలు, నృత్యాలు ప్రదర్శించేలా వేదిక ఏర్పాటు చేస్తారు. మెక్సికో ఏప్రిల్ 30న మెక్సికోలో బాలల దినోత్సవం జరుగుతుంది. ఈ రోజున బాలలతోపాటు వారి తల్లిదండ్రులు పాఠశాలలకు హాజరవుతారు. అక్కడ వివిధ కార్యక్రమాలు, పోటీ నిర్వహిస్తారు. వివిధ అంశాల్లో చిన్నారుల్లో ఉండే ప్రతిభను బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తారు. అలాగే విందు ఏర్పాటు చేస్తారు. సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆ రోజంతా సంతోషంగా గడుపుతారు. ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో బాలల దినోత్సవం ఏటా అక్టోబర్ నెలలో నాలుగో బుధవారం రోజున జరుపుతారు. ఆ ఒక్కే రోజు కాదు.. బాలల హక్కుల కోసం వారం పాటు బాలల వారోత్సవాలు జరుపుతారు. మొదట్లో దేశంలో వివిధ రాష్ట్రాల్లో బాలల దినోత్సవం వేర్వేరు రోజుల్లో ఉండేది. కానీ, ప్రభుత్వం దేశమంతటా ఒకేసారి జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాలకు విజ్ఞప్తి చేయడంతోపాటు బాలల వారోత్సవాల నిర్వహణకు ఏటా ఆయా రాష్ట్రాలకు 2 వేల డాలర్ల చొప్పున కేటాయిస్తోంది. చిలి చిలిలో బాలల దినోత్సవం ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. అధికారికంగా అక్టోబర్ మొదటి బుధవారం జరిపితే.. అనధికారికంగా ఆగస్టునెల రెండో ఆదివారం జరుపుతుంటారు. ఈ రోజున తల్లిదండ్రులు, పెద్దలు చిన్నారుల కోసం బొమ్మలు, తినుబండరాలు కొనిస్తుంటారు. పెరుగ్వే ఆగస్టు 16న పెరుగ్వేలో బాలలదినోత్సవం జరుగుతుంటుంది. అయితే ఈ రోజున జరపడం వెనుక ఓ విషాద గాథ ఉంది. 1869లో పెరుగ్వే చేసిన ఓ యుద్ధంలో దేశంలోని అనేక మంది బాలలు కూడా పాల్గొన్నారు. ఆగస్టు 16న యుద్ధంలో పాల్గొన్న 3,500 మంది తొమ్మిది నుంచి 15ఏళ్ల వయసున్న చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వారి జ్ఞాపకార్థం అదే రోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా యుద్ధంలో మరణించిన బాలలకు నేటి చిన్నారులు నివాళులర్పిస్తారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో కొందరు తమ కుటుంబంలో పుట్టి చిన్నతనంలోనే మరణించిన వారికి నివాళులర్పిస్తారు. ఇక దక్షిణాఫ్రికాలో నవంబర్ తొలి శనివారం, మలేషియాలో అక్టోబర్ చివరి శనివారం, సింగపూర్‌లో అక్టోబర్ తొలి శుక్రవారం, అర్జెంటీనా.. పెరులో ఆగస్టు తొలి ఆదివారం, ఇండోనేషియా జులై 23న, అమెరికా జూన్ రెండో ఆదివారం, నైజీరియా మే 27న, స్పెయిన్.. యూకే మే రెండో ఆదివారం, బంగ్లాదేశ్ మార్చి 17న, న్యూజిలాండ్, మార్చి తొలి ఆదివారం, మయన్మార్ ఫిబ్రవరి 13న జరుపుకొంటాయి. జర్మనీ, పోలాండ్, మంగోలియా, పోర్చుగల్, ఒకప్పటి సోవియెట్ దేశాలుసహా 52 దేశాలు జూన్1న బాలల దినోత్సవాన్ని జరుపుకొంటుండగా.. అరబ్ దేశాలు, కెనడా, ఐర్లాండ్, ఈజిప్ట్, దాదాపు 27 దేశాలు నవంబర్ 20న నిర్వహిస్తున్నారు. మరికొన్ని దేశాలు వివిధ తేదీల్లో జరుపుకొంటున్నాయి.
Popular posts
Andhra Pradesh Accelerates Green Building & Net-Zero Goals with Government Incentives at IGBC Green Andhra Summit 2025.
• GUDIBANDI SUDHAKAR REDDY

ప్రపంచంలోనే అతిపెద్ద అకౌంటింగ్ పవర్ హౌస్ ఐసిఎఐ!.
• GUDIBANDI SUDHAKAR REDDY

అవయవ దానం పై అవగాహన సదస్సు.
• GUDIBANDI SUDHAKAR REDDY

అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీకానున్న ముఖ్యమంత్రి.
• GUDIBANDI SUDHAKAR REDDY
పేద పిల్లలు చదువులో వెనుకబడకూడదు…
• GUDIBANDI SUDHAKAR REDDY

Publisher Information
Contact
prajaamaravathi@gmail.com
9347530295
D.NO. 16-4, A, KOLLIPARA VILLAGE AND MANDAL, DIST. GUNTUR -522304, ANDHRA PRADESH
About
Praja Amaravati is a monthly magazine
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
Post a Comment