*హంస వాహనంపై సరస్వతి అలంకారంలో సిరుల‌త‌ల్లి* తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన గురువారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది. భారతీయ సంస్కృతిలో అనాదిగా మహావిజ్ఞాన సంపన్నులైన మహాత్ములను, యోగిపుంగవులను ''పరమహంస''లుగా పేర్కొనడం సంప్రదాయం. హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే పాల‌ను, నీటిని వేరు చేయగలగడం. అలాగే యోగిపుంగవులు కూడా జ్ఞానం, అజ్ఞానం తెలిసి మెలగుతారు. అట్టి మహాయోగి పుంగవుల హృదయాలలో జ్ఞానస్వరూపిణియైన అలమేలుమంగ విహరిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకై సరస్వతీదేవిని ఉపాసించే సాధకులు ''హంసవాహన సంయుక్తా విద్యాదానకరీ మమ'' అని ఆ తల్లిని ఆరాధిస్తారు. వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌ కుమార్‌, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, విఎస్‌వో శ్రీ బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీమతి మల్లీశ్వరి, ఏవిఎస్వో శ్రీ చిరంజీవి, విఐలు శ్రీ సురేష్ రెడ్డి, శ్రీ మహేష్, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ క‌న్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.