*AP: ఎక్సైజ్‌ శాఖ పునర్వ్యవస్థీకరణ* *నాలుగు జోన్లుగా  మొత్తం జిల్లాల విభజన. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల. అమరావతి (prajaamaravati): ఆంద్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఎక్సైజ్‌శాఖను పునర్వ్యవస్థీకరించింది. రాష్ట్రంలోని మొత్తం జిల్లాలను నాలుగు జోన్లుగా విభజించింది. ఒక్కో జోన్‌కి ఒక డిప్యూటీ కమిషనర్‌ని నియమించింది. కేంద్ర కార్యాలయంలో ఒకటి, జిల్లాల్లో ఐదు విజిలెన్స్‌ విభాగాల్ని ఏర్పాటు చేసింది. వాటికి అసిస్టెంట్‌ కమిషనర్లు (విజిలెన్స్‌) సారథ్యం వహిస్తారు. గతంలోలాగే జిల్లాకో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఉంటారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక... మద్యం, ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ)ని ఏర్పాటుచేసింది. ఎక్సైజ్‌శాఖ అధికారులు, సిబ్బందిలో 70 శాతాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోకి బదలాయించింది. ఇదివరకు ఎక్సైజ్‌ శాఖలో భాగంగా ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ పోస్టు ఇప్పుడు ఎస్‌ఈబీ పరిధిలోకి వెళ్లింది. మెజార్టీ సిబ్బందిని, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బాధ్యతల్ని ఎస్‌ఈబీకి బదలాయించిన నేపథ్యంలో.. ఎక్సైజ్‌శాఖ పరిధిలోని విభాగాల్ని, అధికారులు, సిబ్బందిని, విధుల్ని పునర్వ్యవస్థీకరిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది* *విశాఖ, కాకినాడ, గుంటూరు, కర్నూలు కేంద్రంగా నాలుగు జోన్లు ఏర్పాటవుతాయి. విశాఖ జోన్‌ పరిధిలోకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు, కాకినాడ జోన్‌ పరిధిలోకి తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలు, గుంటూరు జోన్‌ పరిధిలోకి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, కర్నూలు జోన్‌ పరిధిలోకి చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు వస్తాయి.


Comments