*ఏపీ ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలందించడంలో భాగస్వామ్యం దిశగా "జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ" : పరిశ్రమలు, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి* *పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటితో జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ ప్రతినిధుల వీడియో కాన్ఫరెన్స్* *విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటులో ముందడుగు* *అంటురోగాలు, ఇతరత్రా వైద్య పరిశోధనలు, సర్వేలలో భాగస్వామ్యానికి ఆసక్తి* *భవిష్యత్ లో యువతకు వైద్యానికి సంబంధించిన కోర్సులు , శిక్షణ, డిగ్రీ పట్టా అందించడం పైనా చర్చ* అమరావతి (prajaamaravati), నవంబర్, 10; విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్స లెన్స్ ఏర్పాటులో ముందడుగు దిశగా ప్రఖ్యాత జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ ప్రతినిధులతో చర్చించినట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిస్తోన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రజలకు నాణ్యమైన సేవలందించడంలో తామూ భాగస్వామ్యమవుతామని యూనివర్శిటీ ప్రత్యేక ఆసక్తి కనబరచినట్లు మంత్రి స్పష్టం చేశారు. జాన్స్ హాప్కిన్స్ ప్రతినిధులు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మేకపాటితో సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి క్యాంప్ కార్యాలయం నుంచి మంగళవారం వర్చువల్ గా భేటీ జరిగింది. ఈ సందర్భంగా సుమారు రూ.2 లక్షల కోట్లు వెచ్చించి రానున్న 3 ఏళ్లలో ప్రాథమిక వైద్య కేంద్రాలు సహా ఏపీ లోని అన్ని ఆస్పత్రులను ఆధునీకరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజ్, ప్రతి శాసనసభ నియోజకవర్గానికో నర్సింగ్ కాలేజీలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో ప్రతినిధులకు వివరించారు. జాన్స్ హాప్ కిన్స్ గత నెల అంటే అక్టోబర్ 26న ఏపీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఆసక్తి చూపుతూ పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాదికి లేఖ రాశారు. వెంటనే ప్రభుత్వపరంగా అందుకు సంబంధించి ఏం చేయాలన్నదానిపై మంత్రి మేకపాటితో చర్చించి పరిశ్రమల శాఖ వేగంగా చర్యలు చేపడుతోంది.పేదలు, నిరుపేదలకు కూడా 10 వేల గ్రామాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు కొత్త ఊపిరి పోస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వైద్యరంగాన్ని, వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడం కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టిన హెల్త్ సర్వేలో భాగస్వామ్యానికీ ముందుకొచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. అంటు వ్యాధులు సహా పలు పెద్ద రోగాల ప్రక్షాళనకు చేపట్టవలసిన విప్లవాత్మక మార్పులకు, చికిత్సలో ఒక విధానం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని జాన్స్ హాప్కిన్స్ ముందుకొచ్చిందని మంత్రి తెలిపారు. యువతీ, యువకులకు రాబోయే రోజుల్లో అధునాతన వైద్య విధానాలు , కోర్సులు, శిక్షణ ప్రపంచస్థాయిలో అందించడంపైనా మంత్రి మేకపాటితో చర్చించినట్లు ఆయన తెలిపారు. 'ఐఎస్ బీ'తో కలిసి విద్యకు సంబంధించిన అవకాశాలను పెంచేందుకు సుముఖంగా ఉన్నట్లూ మంత్రి గౌతమ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, జాన్స్ హ్యాప్కిన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన అంతర్జాతీయ ప్రొఫెసర్లు, వైద్య నిపుణులు పాల్గొన్నారు.


Comments