ఉద్యాన పంట నష్టాలను పరిశీలించిన కేంద్ర బృందం అమలాపురం (prajaamaravati), నవంబర్10 ఇటీవల కురిసిన భారీ వర్షాలు,వరదలు కారణంగా అమలాపురం డివిజన్ లో ఉద్యాన పంటలకు జరిగిన నష్టాలను సౌరవ్ రే, జాయింట్ సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నాయకత్వం లో ఆరుగురు సభ్యులు తో కూడిన కేంద్ర బృందం మంగళవారం పరిశీలించింది.ముందుగా రావులపాలెం మండలం పొడగట్లపల్లి లో పది మంది రైతులకు సంభందించిన 5 హెక్టార్ల విస్తీర్ణంలో నష్టపోయిన చిక్కుడు పంటను కేంద్ర బృందం పరిశీలించి ఏ రకంగా నష్టపోయిందీ రైతులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఒక హెక్టార్ విస్తీర్ణంలో చిక్కుడు పంటను కోల్పోయిన రైతు గవిసెట్టి లచ్చన్న తో బృందం నాయకులు సౌరవ్ రే మాట్లాడుతూ ఏ యే పంటలు వేస్తారు,ఎంతమేర నష్టం జరిగింది తదితర వివరాలను అడగ్గా పైకి ఆకులతో పచ్చగా ఉన్నపటికీ కుళ్ళి పోవడంతో కాపు వుండదని ,మొత్తం పంట నష్ట పోవడం జరిగిందని బృందానికి రైతు వివరించారు. అనంతర కేంద్ర బృందం రావులపాలెం మండలం కొమరాజులంక లో భారీ వర్షాలకు,వరదలకు నష్టపోయిన అరటి తోటలు ను పరిశీలించారు. ఈ సందర్భంగా 1.3 ఎకరాల విస్తీర్ణంలో అరటి పంట నష్టపోయిన ముత్స్యర్ల వెంకటేశ్వరరావు తో బృందం నాయకులు సౌరవ్ రే మాట్లాడుతూ పచ్చగా ఉన్నప్పటికీ ఏ విధంగా నష్టం జరుగుతుందని అడగ్గా 21 రోజులు పాటు నీటిలో నాని వుండటం వలన వేర్లు కుళ్ళి పోయి దుంప కుళ్ళి పోతుందని దానివలన గెలలు వేయవని దీనివలన పూర్తిగా నష్టపోయామని రైతు వెంకటేశ్వరరావు వివరించారు.అదే ప్రదేశంలో అరటి రైతు గుర్రాల గంగన్న కు చెందిన 66 సెంట్లు విస్తీర్ణంలో నష్టపోయిన 4 నెలలు వయస్సు వున్న అరటి మొక్కలను కేంద్ర బృందం పరిశీలించింది. కేంద్ర బృందానికి అమలాపురం డివిజన్ లో ఉద్యాన పంటలు కు జరిగిన మొత్తం నష్టం వివరాలను ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రామ్మోహన్ వివరిస్తూ డివిజన్ లో ఈ సంవత్సరం ఆగస్ట్,సెప్టెంబర్,మరియు అక్టోబర్ మాసాలలో కురిసిన భారీ వర్షాలు,వరదలు కారణంగా 4335.111 హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యాన పంటలు కు నష్టం వాటిల్ల గా 12074 మంది రైతులు ఆర్థికంగా నష్టపోయారని వివరించారు. పొ డగట్లపల్లి లో ఉద్యాన పంటలు 70.40 హెక్టార్ల విస్తీర్ణంలో కూరగాయలు పంటలు వుండగా 355 మంది రైతులు వున్నారని, కొమరాజులంక లో అరటి 243.20 హెక్టార్ల విస్తీర్ణంలో వుండగా 685 మంది రైతులు వున్నారని వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర బృందాన్ని కలిసిన కొత్త పేట శాసన సభ్యులు చిర్ల జగ్గిరెడ్డి కేంద్ర బృందం తో మాట్లాడుతూ నియోజక వర్గం లో ఉద్యాన పంటలు కు తీవ్రంగా వాటిల్లిందని,దీనివలన ఈ పంటలపై ఆధార పడి జీవిస్తున్న రైతులు ఆర్ధికగా చాలా నష్టపోయారని వివరించారు. అనంతరం శాసన సభ్యులు తో కలిసి కేంద్ర బృందం ఆలమూరు మండలం బడుగువాని లంక లో భారీ వర్షాలకు తీవ్రంగా నష్టం జరిగిన కూరగాయల పంటలను పరిశీలించారు. అనంతరం బృందం జొన్నాడ లో భారీ వర్షాలకు దెబ్బతిన్న ఆర్.అండ్.బి రహదారిని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో బృందం నాయకులు సౌరవ్ రే తో బాటు బృందం సభ్యులు ఆర్.బి.కౌల్,కన్సల్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్,డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండీచర్, ఆయుష్ పునియా ,అసిస్టంట్ కమీషనర్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, శ్రావన్ కుమార్ సింగ్,ఎస్.ఇ,మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్ పోర్ట్,అండ్ హై వేస్ తో బాటు జిల్లా జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి, అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్.సత్తిబాబు, అమలాపురం డిఎస్పీ షేక్ మాసూంమ్ భాషా ఉద్యాన శాఖ ఉప సంచాలకులు ఎస్.రామ్మోహన్,సహాయ సంచాలకులు నేతల మల్లిఖార్జునరావు తదితరులు పాల్గొన్నారు.


Comments