పోలవరం (prajaamaravati), నవంబర్ 10, భారీ వర్షాలు, వరదలు కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలో వివిధ రకాల పంటలు, రోడ్లు బాగా దెబ్బతిన్నాయని, ఎంతో నష్టం వాటిల్లిందని నష్టాల పరిశీలనకు వచ్చిన కేంద్ర బృంద సభ్యులు చెప్పారు. పొలవరంలో దెబ్బతిన్న గోదావరీ ఏటీగట్టు పలు ప్రాంతాలను మంగళవారం సాయంత్రం కేంద్ర బృందం పరిశీలించింది. అనంతరం పోలవరం ప్రాజెక్టుపై నిర్మిస్తున్న రోడ్ పాత్ ను పరిశీలించిన బృందానికి అధికారులు వివరాలను తెలియచేశారు. ఈ సందర్భంగా తమ పర్యటన వివరాలను పరిశీలించిన అంశాలను బృందం సభ్యులు మీడియాకు వివరిస్తూ.. పశ్చిమగోదావరి జిల్లాలో వరి పంటలతోపాటు ఇతర పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయన్నారు. చాలా చోట్ల నీట మునిగిన వరి పంట ఎందుకూ పనికిరాకుండా దెబ్బతిందన్నారు. అధికారులు నష్టం వివరాలు అందించారన్నారు. మాకు వచ్చిన అనుమానాలను అధికారులు నివృత్తి చేశారన్నారు. పరిశీలించి న ఆయా ప్రాంతాల్లో రైతులు, బాధితులు తమ సమస్యలను మా దృష్టికి తీసుకువచ్చారని, వాటిని కూడా పరిశీలిస్తామన్నారు. అధికారులకు పలు సూచనలు చేశామన్నారు. నష్టం వివరాలు, ఎంతమేరకు నష్టం జరిగిందీ కలిపికాకుండా సెపరేట్ గా ఇవ్వాలని సూచించామని చెప్పారు. అనంతరం కేంద్ర బృంద సబ్యులను జిల్లా కలెక్టర్ శ్రీ రేవు ముత్యాల రాజు దుశ్శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ ) శ్రీ కె వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.