‘జల జీవన్’ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సచివాలయం (prajaamaravati), నవంబర్ 11 : రాష్ట్రంలో జల జీవన్ మిషన్ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. గ్రామ, అధికారుల స్థాయిల్లో లక్ష్యాలు నిర్ధేశించుకుని గడువులోగా పనులు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. సచివాలయంలోని అయిదో బ్లాక్ లో ‘రాష్ట్రంలో జల జీవన్ మిషన్ అమలు’ వర్క్ షాపు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో జల జీవన్ మిషన్ పనులు నిర్ధేశించిన గడువులోగా పూర్తిచేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వమిచ్చిన గడువులోగా పనులు పూర్తికి నేటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఇందుకు అధికారులు తమ తమ స్థాయిల్లో లక్ష్యాలు నిర్ధేశించుకోవాలన్నారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ అందరూ బాధ్యత తీసుకోవాలన్నారు.. రెండ్రోజుల్లో టెండర్లు పిలిచి వీలైనంత వేగంగా పనులకు శ్రీకారం చుట్టాలన్నారు. ఏవైనా ఇబ్బందులుంటే తెలిపితే, సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు. మరో వారం రోజుల తరవాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరోసారి జలజీవన్ మిషన్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తానన్నారు. ఆపై ప్రతి 15 రోజులకొకసారి సమీక్షలు నిర్వహిస్తామన్నారు. పనులు నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ఎంతటిరవానైనా కఠిన చర్యలు తీసుకోడానికి వెనుకాడేదిలేదని స్పష్టంచేశారు. జలజీవన్ మిషన్ పనుల పూర్తికి ఎటువంటి సలహాలు ఇచ్చినా తీసుకుంటామని, అధికారులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని మంత్రి తెలిపారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ పనులు జనవరి 11 లోగా పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించిందన్నారు. రాష్ట్రంలో డిసెంబర్ 31 నాటికి ఈ పనులు పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకోవాలన్నారు. ఇందుకు రోజు, వారాల వారీగా పనుల పురోగతిపై సమీక్షలు నిర్వహించుకోవాలని, అధికారుల నుంచి క్షేత్రస్థాయి వరకూ టార్గెట్లు పెట్టుకోవాలని తెలిపారు. జల జీవన్ మిషన్ పనులపై ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చూపొద్దన్నారు. అదే సమయంలో జాతీయ ఉపాధి హామీ పథకం,, నాడు-నేడు పనులు కూడా సకాలంలో పూర్తి చేయాలన్నారు. రాష్ట్రానికి 3 జాతీయ పురస్కారాలు... బహిరంగ మల విర్జన రహితంగా ఏపీని తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా ODF, ODF ప్లస్ తో పాటు జీరో వేస్ట్ మేనేజ్ మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా అమలు చేస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని అభినందిస్తూ కేంద్రం స్వచ్చ భారత్‌ దివస్‌ సందర్భంగా 3 జాతీయ అవార్డులను అందజేసిందన్నారు. స్వచ్ఛ సుందర్‌ సముదాయిక్‌ శౌచాలయ(SSSS) కేటగిరీలో రెండో ర్యాంకు, సముదాయిక్‌ శౌచాలయ అభియాన్‌(SSA) కేటగిరీలో మూడో ర్యాంక్‌, దీంతో పాటు గంధగి ముక్త్‌ భారత్‌ కేటగిరీలో (రాష్ట్రంలో అత్యధిక ODF పస్ల్ గ్రామాలకు గానూ) మూడో ర్యాంక్‌ ఏపీకి లభించిందన్నారు. ఈ అవార్డులను కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ అందించిందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్ల వ్యవస్థ ద్వారా భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించడం ఖాయమని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ వర్క్ షాపులో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సంపత్ కుమార్, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం ఇంజనీరింగ్ చీఫ్ తో పాటు 13 జిల్లాల పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఈలు తదితరులు పాల్గొన్నారు.