చిన్నశేష వాహనంపై నవనీతకృష్ణుని అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారి అభయం తిరుపతి (prajaamaravati): తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల మొదటిరోజైన బుధవారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు నవనీతకృష్ణుని అలంకారంలో చిన్నశేషవాహనంపై అభయమిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్-19 మార్గదర్శకాల మేరకు ఆలయం వద్దగల వాహన మండపంలో రాత్రి 7 నుండి 8 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది. మొదటి వాహనం చిన్నశేషుడు. చిన్నశేష వాహనంపై అమ్మవారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిస్తారు. శేషభూతమైన ఈ ప్రపంచం సిరులతల్లి రక్షణలో సుఖాన్ని పొందుతోంది. ఈ వాహనంపై అమ్మవారి దర్శనం వల్ల యోగసిద్ధి చేకూరుతుంది. వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి, జెఈవో పి.బసంత్కుమార్, బోర్డు సభ్యులు మురళీకృష్ణ, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, అదనపు సివిఎస్వో శివకుమార్రెడ్డి, విఎస్వో బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఏఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ మల్లీశ్వరి, ఏవిఎస్వో చిరంజీవి, విఐలు సురేష్ రెడ్డి, మహేష్, ఆర్జితం ఇన్స్పెక్టర్ రాజేష్ కన్నా ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.