నిర్ధేశించిన గడువులోగా భూ రీ సర్వే పూర్తి చేయండి... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్

 నిర్ధేశించిన గడువులోగా

భూ రీ సర్వే పూర్తి చేయండి...

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్


సచివాలయం (ప్రజా అమరావతి), ఫిబ్రవరి 25 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్-జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం పగడ్బంధీగా చేపట్టిందని, నిర్ధేశించిన గడువులోగా భూ రీ సర్వే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు. సచివాలయంలోని చీఫ్ సెక్రటరీ కార్యాలయంలో సీఎస్ అధ్యక్షతన గురువారం వైఎస్సార్-జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం అమలు తీరు తెన్నులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఉషారాణి... రాష్ట్రంలో చేపట్టిన భూ రీ సర్వే కార్యక్రమాన్ని పవర్ ప్రజెంటేషన్ ద్వారా సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు వివరించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు భూ రీ సర్వే పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. మూడు విడతల్లో భూ రీ సర్వే చేపడుతున్నామన్నారు. మొదటి విడతగా 5,363, రెండో విడతగా 5,911, మూడో విడతగా 6,187 గ్రామాల్లో రీ సర్వే చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే మొదటి విడత రీ సర్వే ప్రారంభమైందన్నారు. రీ సర్వే త్వరిగతిన పూర్తి చేయడానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడువు నిర్దేశించారన్నారు. సీఎం ఆదేశించిన విధంగా మొదటి విడత రాబోయే జూన్ నాటికి పూర్తి చేయనున్నామన్నారు. రెండో విడత జులై లో ప్రారంభించి, 2022 ఫిబ్రవరి నాటికి పూర్త చేస్తామన్నారు. మూడో విడత మార్చి 2022లో ప్రారంభించి అదే సంవత్సరం అక్టోబర్ నాటికి భూ రీ సర్వే పూర్తి చేస్తామన్నారు. రీ సర్వే సమగ్రంగా నిర్వర్తించడానికి గానూ రాష్ట్ర వ్యాప్తంగా 70 బేస్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. రెవెన్యూ, సర్వే, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో వైఎస్సార్-జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం చేపట్టామన్నారు. రీ సర్వే కోసం డ్రోన్లు, కార్స్ టెక్నాలజీని వినియోగిస్తున్నామన్నారు. గత ఏడాది డిసెంబర్ 21న తక్కెళ్లపాడు గ్రామంలో సర్వే రాయి వేసి భూ రీ సర్వే కార్యక్రమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని ముఖ్య కార్యదర్శి ఉషారాణి తెలిపారు. రీ సర్వే కోసం గ్రామ, వార్డు సచివాలయల్లో ఉన్న సర్వేయర్లకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం మాట్లాడుతూ, భూ రీ సర్వే కార్యక్రమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టారని. రీ సర్వే ద్వారా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా అడ్డుకోవొచ్చునన్నారు. పేరుకుపోతున్న భూవివాదాలను పరిష్కరించడానికి వీలు కలుగుతుందన్నారు. సర్వే తర్వాత ల్యాండ్‌ టైటిలింగ్‌ కార్డులు అందజేస్తారని, వాటిలో యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ నెంబర్‌, భూమి కొలతలు, యజమాని పేరు, ఫొటో ఉంటుందన్నారు. గ్రామ సచివాలయంలో డిజిలైజ్డ్‌ ప్రాపర్టీ రిజిస్టర్, టైటిల్‌ రిజిస్టర్‌, వివాదాల నమోదు కోసం రిజిస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ, ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా భూ రీ సర్వే పగడ్బంధీగా చేపట్టాలన్నారు. సర్వే సమయంలో సరిహద్దు రాళ్లు ఎంతో కీలకమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన సర్వే రాళ్లను ఇప్పటి నుంచే సేకరించాలని ఆదేశించారు. సిబ్బందికి అవసరమైన శిక్షణ కూడా అందజేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూ రీ సర్వే ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని, నిధులు కొరత రానివ్వబోమని తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ధేశించిన లక్ష్యంలోగా భూ రీ సర్వే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సీఎస్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో సీసీఎల్ఎ నీరబ్ కుమార్ ప్రసాద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రజిత్ భార్గవ్, గోపాలకృష్ణ ద్వివేదితో పాటు రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, సర్వే డిపార్టుమెంట్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. 


Comments