మునిసిపల్ ఓట్ల లెక్కిపునకు ఏర్పాట్లు పూర్తి
ఓట్లలెక్కింపునకు పక్కాగా ఏర్పాట్లు, జిల్లాలో 77 టేబుళ్ల ఏర్పాటు
సిసి కెమెరాలు, వీడియో చిత్రీకరణ
ఉదయం 8 గం.లకు కౌంటింగ్ ప్రారంభం
ఫలితాల వెల్లడి బాధ్యత రిటర్నింగ్ అదికారులదే
కౌంటింగ్ పర్యేవేక్షణకు ప్రత్యేకాధికారుల నియామకం
కౌంటింగ్ కేంద్రాలకు ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరా
జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ వెల్లడి
విజయనగరం (ప్రజా అమరావతి), మార్చి 13; జిల్లాలోని మూడు మునిసిపాలిటీలు, నగర పాలకసంస్థ, నగర పంచాయతీల సాధారణ ఎన్నికలకు సంబంధించిన ఓట్లలెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ చెప్పారు. ఓట్లలెక్కింపుకోసం ఐదు చోట్లా పక్కా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఓట్లలెక్కింపు ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ చెప్పారు. అంతకుముందే అభ్యర్ధుల సమక్షంలో స్ట్రాంగ్‌రూంలు తెరచి బ్యాలెట్ పెట్టెలను కౌంటింగ్ కేంద్రాలకు తరలించనున్నట్టు వెల్లడించారు.
విజయనగరం నగరపాలక సంస్థ ఎన్నికకు సంబంధించి స్థానిక రాజీవ్ స్టేడియంలో ఓట్లలెక్కింపు కోసం చేసిన ఏర్పాట్లను కలెక్ట శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఓట్లలెక్కింపు కోసం ఏర్పాటు చేసిన సిసి కెమెరాల పనితీరు, పోలింగ్ ఏజెంట్లు, అభ్యర్ధులు కూర్చొనేందుకు ఏర్పాట్లు, కౌంటింగ్ సూపర్ వైజర్లు, సహాయకుల సీటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి కమిషనర్ వర్మకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ నెల్లిమర్ల నగర పంచాయతీకి సంబంధించి మహాత్మా జ్యోతిబా పూలే బి.సి.సంక్షేమ గురుకుల పాఠశాలలో, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు మునిసిపాలిటీలకు సంబంధించి ఆయా పురపాలక సంఘ కార్యాలయాల్లో ఓట్లలెక్కింపునకు ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు. విజయనగరంలో 25, సాలూరు, బొబ్బిలిలో 15 చొప్పున, పార్వతీపురంలో 12, నెల్లిమర్లలో 10 టేబుళ్లు కలసి మొత్తం జిల్లాలో 77 టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి మునిసిపాలిటీకి ఒక ప్రత్యేకాధికారిని నియమించామని ఆ అధికారి పర్యవేక్షణలో కౌంటింగ్ జరుగుతుందన్నారు. విజయనగరంకు జె.సి.(అభివృద్ధి) డా.మహేష్ కుమార్ రావిరాల, సాలూరుకు డా.జి.సి.కిషోర్ కుమార్, పార్వతీపురంకు ఐటిడిఏ పి.ఓ. ఆర్.కూర్మనాథ్, బొబ్బిలికి జె.సి(ఆసరా) జె.వెంకటరావు, నెల్లిమర్లకు ఆర్.డి.ఓ. బిహెచ్.భవానీశంకర్ తదితరులను నియమించామన్నారు. వీరి ఆధ్వర్యంలో ఓట్లలెక్కింపు చేపట్టేందుకు 207 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 90 మంది కౌంటింగ్ సూపర్ వైజర్లను నియమించామన్నారు.
కౌంటింగ్ కేంద్రాల్లో ప్రక్రియనంతటినీ సిసి కెమెరాలు, వీడియోగ్రఫీ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందని, మోనిటరింగ్ స్క్రీన్లపై అన్ని టేబుళ్లలో జరుగుతున్న ప్రక్రియ తెలుసుకొనే అవకాశం ఉంటుందన్నారు. అన్ని టేబుళ్ల వద్ద బారికేడ్ల ఏర్పాట్లు, ఫెన్సింగ్ ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ హాళ్లలో లోనికి ప్రవేశించేందుకు, బయటకు వెళ్లేందుకు వేర్వేరు ద్వారాలు ఏర్పాటు చేశామన్నారు.
కౌంటింగ్ ప్రక్రియ గురించి వివరిస్తూ ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారని, ఆ తర్వాత సాధారణ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతారని వెల్లడించారు. బ్యాలెట్ బాక్కుల నుంచి తీసిన బ్యాలెట్లను 25 చొప్పున కట్టలుగా కట్టి ఆ తర్వాత వాటిని లెక్కించడం ప్రారంభిస్తారని తెలిపారు. అభ్యర్ధుల వారీగా వచ్చిన ఓట్లను కౌంటింగ్ సూపర్‌వైజర్ నమోదుచేసి రిటర్నింగ్ అధికారికి అందజేశారని ఆ రౌండుకు సంబంధించి లెక్కింపు పూర్తయిన తర్వాత రిటర్నింగ్ అధికారి ఫలితాన్ని ప్రకటిస్తారని తెలిపారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకం లేకుండా సరఫరా ఇవ్వాలని ఇ.పి.డి.సి.ఎల్. అధికారులకు ఆదేశాలు జారీచేశామని కలెక్టర్ వెల్లడించారు.
జిల్లాలోని మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీ ఎన్నికల ఫలితాలు వెల్లడించేందుకు అన్ని మునిసిపాలిటీల వద్ద మీడియా పాయింట్లు ఏర్పాటు చేస్తున్నామని, కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం ద్వారా జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల ఫలితాలు సేకరించి ఎన్నికల కమిషన్ కు, మీడియాకు అందించే ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు.
ఓట్లలెక్కింపునకు హాజరయ్యే అభ్యర్ధుల తరపు ఏజెంట్లకు కూడా పాస్‌లు జారీచేస్తున్నామని, ఆయా అభ్యర్ధులు అందజేసిన పేర్లను పోలీసులతో తనిఖీ చేయించిన మీదట పాస్‌లు జారీచేస్తున్నట్టు పేర్కొన్నారు.
మేయర్/ చైర్‌పర్సన్ ఎన్నిక ప్రక్రియ అదే రోజు ప్రారంభం
మునిసిపల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్ధులకు మేయర్, మునిసిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఏర్పాటు చేసే ప్రత్యేక సమావేశానికి హాజరుకావాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ద్వారా జారీఅయిన నోటీసులు అదే రోజున గెలుపొందిన అభ్యర్ధులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీల్లో మేయర్, చైర్‌పర్సన్‌ల ఎన్నికకు కూడా ప్రత్యేకాధికారులను నియమిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. మార్చి 18వ తేదీన ఆయా నగర పాలక, పురపాలక సంస్థల్లో ఈ ఎన్నిక జరుగుతుందన్నారు. పరోక్ష పద్ధతిలో ఈ ఎన్నిక జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఆరోజు కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం అనంతరం ఎన్నిక నిర్వహిస్తారని చెప్పారు.
జిల్లా కలెక్టర్ వెంట ఆర్.డి.ఓ. భవానీశంకర్, మునిసిపల్ కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, మునిసిపల్ ఇంజనీర్ దిలీప్ తదితరులు ఉన్నారు.
addComments
Post a Comment