అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘జగనన్న విద్యాకానుక’

అమరావతీ (ప్రజా అమరావతి);

అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘జగనన్న విద్యాకానుక’


జగనన్న విద్యాకానుకలో భాగంగా విద్యార్థులకు ఇంగ్లీష్- తెలుగు డిక్షనరీ

ఇంగ్లీష్ బోధన మెరుగుపర్చడంతో పాటు, విద్యార్థులు కూడా ఇంగ్లీష్ నేర్చుకునేందుకు డిక్షనరీలు

పాఠశాలల్లో పిల్లల నమోదును గణనీయంగా పెంచడంతో పాటు, మెరుగైన ఫలితాలు సాధించడమే ధ్యేయం

రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వారి విద్యాభ్యాసానికి అవసరమైన వస్తువులను కిట్ల రూపంలో అందజేత

దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు

ప్రభుత్వ పాఠశాలల్లో విడతల వారీగా ఇంగ్లీష్  మీడియం ప్రవేశపెట్టడం చారిత్రాత్మక నిర్ణయం

ప్రాథమిక స్థాయిలోనే పిల్లల సమగ్ర వికాసానికి బాటలు. విద్యార్థికి బంగారు భవిష్యత్తు అందించాలనే తపన

పునాది స్థాయిలో విద్యావ్యవస్థ పటిష్టతకు ప్రాముఖ్యత..ఇంగ్లీష్ మీడియం ప్రాజెక్టు అమలు కోసం ప్రత్యేకంగా సీనియర్ ఐఏఎస్ అధికారి నియామకం

విద్యా ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతో అంగన్‌వాడీ నుంచి ఉన్నతవిద్య వరకు విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి శ్రీకారం

విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సులతో పాటు ఇంగ్లీష్ ల్యాబ్స్ ఉండేలా చర్యలు..సీబీఎస్‌ఈ సిలబస్ తో విద్యాబోధనకు సూత్రప్రాయ అంగీకారం

రూ. 731.30 కోట్లతో పథకం సమర్థంగా అమలయ్యేలా చర్యలు

స్కూళ్ల లో డ్రాప్ అవుట్స్‌ పై దృష్టి ...మెరుగైన ఫలితాల సాధన

ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఆ మేరకు అదనంగా నిధుల కేటాయింపు

“పుస్తకం తనను తలవంచి చూస్తే సమాజంలో తలెత్తుకునేలా చేస్తా అన్నదంట”.... ఈ సూత్రాన్ని అక్షరాలా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి విశ్వసించారు. “ప్రతి పిల్లవాడి సంపూర్ణ వికాసానికి సరైన విద్య ఎంతో కీలకమన్న” మహాత్మా గాంధీ వ్యాఖ్యలను ఆదర్శంగా తీసుకున్న సీఎం జాతి పిత ఆకాంక్షలను సాకారం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రాథమిక విద్యపై ప్రభుత్వాల ఆలోచనలు మార్చారు. ప్రాథమిక స్థాయిలోనే పిల్లల సమగ్ర వికాసానికి వేసే బాటలు విద్యార్థికి బంగారు భవిష్యత్తుతో పాటు దేశానికి మేలు చేస్తాయని సంకల్పించి,ఆదిశగా అడుగులు వేస్తున్నారు. పునాది స్థాయిలో విద్యావ్యవస్థ పటిష్టతకు ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి మన పేద పిల్లలకు రావాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష. పిల్లలను గొప్పగా చదివించాలని, వారి భవిష్యత్ అందంగా తీర్చిదిద్దాలని, తమ పిల్లలు ఉన్నతస్థాయిలో ఉండాలనే తల్లిదండ్రుల కలను ప్రభుత్వం నెరవేర్చాలని సంకల్పించారు ముఖ్యమంత్రి. తదనుగుణంగా విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో పిల్లల నమోదును గణనీయంగా పెంచడంతో పాటు, మెరుగైన ఫలితాలు సాధించడమే ధ్యేయంగా జగనన్న విద్యాకానుక వంటి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వారి విద్యాభ్యాసానికి అవసరమైన వస్తువులను ఈ కిట్ల రూపంలో అందిస్తోంది. అందులో భాగంగా విద్యార్థులకు ఇంగ్లీష్-తెలుగు డిక్షనరీ అవసరాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకున్నదే తడవుగా ఒక అడుగు ముందుకేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యాకానుకలో కొత్తగా డిక్షనరీని చేర్చారు. విద్యార్థులకు డిక్షనరీ ఇవ్వడం, డిక్షనరీని ఎలా చదవాలో చెప్పాలనుకోవడం బహుశా దేశంలో ఇదే ప్రథమం కావచ్చు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియా ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ఇంగ్లీష్ బోధన మెరుగుపర్చడంతో పాటు, విద్యార్థులు కూడా ఇంగ్లీష్ నేర్చుకునేందుకు వీలైన వాతావరణం కల్పిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. డిక్షనరీ ఉపయోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని నాణ్యత కూడా బాగుండాలని అధికారులను ఆదేశించారు. వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ఇంగ్లిష్‌– తెలుగు డిక్షనరీ ద్వారా పిల్లలు ప్రతి రోజూ ఒక పదం చొప్పున నేర్చుకునేలా చూడాలని, ఈ తరహాలోనే అంగన్‌వాడీల్లో కూడా ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలని సీఎం సూచించారు. బయట ప్రపంచంలో ఉద్యోగాలు పొందాలంటే ప్రపంచంతో పోటీ పడాలని అందుకు బాల్యదశ నుంచే బీజం పడాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్ష. అందులో భాగమే చిన్ననాటి నుండి పిల్లలకు ఇంగ్లీష్ విద్యా విధానం ఉంటే బాగుంటుందని మహా క్రతువుకు శ్రీకారం చుట్టి ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంపై అభిప్రాయసేకరణ నిర్వహించగా తల్లిదండ్రుల కమిటీ 93.88 శాతం, విడిగా తల్లిదండ్రులు 96.17 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలుగు ఒక భాషగా ఉండనుంది. 

నేటి ప్రపంచీకరణ యుగంలో ఇంగ్లిష్ లేకుంటే అడుగు బయటపెట్టలేని పరిస్థితి. సివిల్స్ నుంచి గ్రూప్స్ వరకూ... ఏ సర్కారీ కొలువు కావాలన్నా, ఐటీ నుంచి బ్యాంకింగ్ వరకూ  ఏ రంగంలో ఉద్యోగం రావాలన్నా ఇంగ్లిష్ నైపుణ్యాలు తప్పనిసరిగా మారాయి. ఉన్నత విద్యకు వెళ్లాలన్నా, విదేశాల్లో విద్యా, ఉపాధి అవకాశాలు వెతుక్కోవాలన్నా ఇంగ్లిష్ నైపుణ్యం లేకపోవడం తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులకు పెద్ద ఆటంకంగా మారుతోంది. ఇంగ్లిష్ రాకపోవడం వల్ల విద్యార్థులు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాల పరంగా ఇంగ్లిష్ మీడియం విద్యార్థులతో పోల్చుకొని ఆత్మన్యూనతకు గురవుతున్నారు. ఫలితంగా ఉజ్వల అవకాశాలను కోల్పోతున్నారు. ఇంగ్లిష్ రాకుంటే ఎన్ని నైపుణ్యాలున్నా వృథానే అన్న అభిప్రాయం సర్వత్రా నెలకొన్న నేపథ్యంలో  చిన్నప్పటి నుంచే ఇంగ్లిష్‌ను నేర్పించాలి, అందుకు పాఠశాల స్థాయిలోనే పునాది పడాలి అని నమ్మిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా పేద, ధనిక అనే తారతమ్యం చూపకుండా ప్రతి ఒక్కరికీ ఇంగ్లిష్ మీడియంలో చదువుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ప్రస్తుత కాలంలో ఇంగ్లీషు మీడియం చదవాలంటే ఆర్థిక భారంగా మారిన పరిస్థితిని గుర్తించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేదలకు మంచి విద్యాప్రమాణాలు అందించాలనే ఉద్దేశంతో అంగన్‌వాడి నుంచి ఉన్నతవిద్య వరకు విప్లవాత్మక మార్పులు చేపట్టారు. భవిష్యత్ ను తీర్చిదిద్దే నిలయం విద్యాలయంలో అంకురార్పణ చేశారు. ఇంగ్లిష్‌లో చదువుకొని భవిష్యత్‌లో ఉన్నత స్థానాలు అందుకుంటారనే ఆశతో తల్లిదండ్రులు తమ స్థోమతకు మించి ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు కట్టి అప్పులపాలవుతుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తే అన్ని వర్గాల వారికి ఇంగ్లిష్ మీడియం చదువులు, ఇంగ్లిష్ నైపుణ్యాలు లభిస్తాయని ఆలోచించి ఇంగ్లీష్ మీడియం విద్యకు ముఖ్యమంత్రి జగన్ బాటలు వేశారు. ఒక స్థాయి దాటాక ఎంత ప్రయత్నించినా ఇంగ్లిష్ ఒంట బట్టకపోవడం, చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్ చదువులు చదివిన వారితో పోటీపడలేక కుంగిపోవడం,  ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాల స్థాయి నుంచే ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవడం వల్ల విస్తృత ప్రయోజనం చేకూరుతుందని జగన్ మోహన్ రెడ్డి భావించారు. ఇటీవల ఎంహెచ్‌ఆర్‌డీ విడుదల చేసిన నూతన విద్యా విధానం ముసాయిదాలో సైతం పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్ బోధన ప్రాధాన్యం, ఆవశ్యకతను ప్రత్యేకంగా ప్రస్తావించింది. అంతర్జాతీయంగా ఇంగ్లిష్‌కు నెలకొన్న ప్రాధాన్యతను గుర్తించిన పలు దేశాలు తమ జాతీయ భాషతో సంబంధం లేకుండా ఇంగ్లిష్ మీడియానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇప్పుడు ఎలాంటి ఉద్యోగమైనా ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే పోటీలో ముందంజలో నిలిచేందుకు ఆస్కారం ఉంటుంది. ఆ దిశగా విద్యార్థులను ఇప్పటి నుంచే తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ప్రాథమిక స్థాయి నుంచే ప్రత్యేకంగా ఇంగ్లిష్ మీడియం పాఠశాలలను ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో మరిన్ని సత్ఫలితాలు వస్తాయన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటి నుంచి ఆరు తరగతులను 2020-2021 విద్యా సంవత్సరం నుంచి తదుపరి తరగతులను 2021-22 నుంచి ఇంగ్లిష్ మీడియంలోకి మార్చుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఎస్‌ఈ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) విధానం అమలు చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించారు. ఇప్పటికే ఇంగ్లిష్ మీడియంలో బోధించడానికి ఉపాధ్యాయులకు అవసరమైన నైపుణ్యం, అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇవ్వడం, హ్యాండ్ బుక్స్ రూపకల్పన, వాటిని అభివృద్ధి చేయడం, తరగతి గదుల్లో ఉత్తమ బోధన పద్ధతుల గురించి వివరించడం, టీచర్లకు అవసరమైన బోధన మెటీరియల్‌ను రూపొందించారు. విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సులతో పాటు ఇంగ్లీష్ ల్యాబ్స్ ఉండేలా చర్యలు చేపట్టారు. పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో విడతల వారీగా ఇంగ్లీష్  మీడియం ప్రవేశపెట్టడం చారిత్రాత్మక నిర్ణయం. ఇంగ్లీష్ మీడియం ప్రాజెక్టు అమలు కోసం ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించారు. ఇంగ్లీష్ భాషపై శిక్షణ కోసం వెబ్ నార్ లు నిర్వహించారు. ఇప్పటికే డీడీ సప్తగిరి ఛానల్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించారు. కరోనా విపత్కర సమయంలో ఆన్ లైన్ క్లాసులు నిర్వహించారు. ఉన్నత విద్య వరకు ప్రతి విద్యార్థి చదువుకోవాలి.. ఉద్యోగం ఇచ్చేందుకు ప్రపంచమంతా మన దగ్గరకు రావాలని సంకల్పించి పేదవాడి తలరాతలు మార్చే పథకాలకు రూపకల్పన చేశారు. చదువులమ్మ ఒడిలో భవితను మార్చుకోవాలని అమ్మఒడికి శ్రీకారం చుట్టి విద్యార్థుల తల్లుల అకౌంట్ లో ఏటా 15 వేలు జమచేసి ఆర్థిక చేయూతనిస్తున్నారు. ఇప్పటికే 2020 జనవరి 4 నుండి జనవరి 9 వరకు అమ్మఒడి వారోత్సవాలు జరిపి తల్లిదండ్రులతో విస్తృత చర్చలు జరిపారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నారు. బడికి వెళ్లే పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు మంచి మెనూతో జగనన్న గోరుముద్ద పథకం తీసుకొచ్చారు. ఒకటి నుంచి పదవ తరగతి వరకు  ప్రతి విద్యార్థికి విద్యాకానుక అందిస్తున్నారు. జగనన్న విద్యాకానుక ద్వారా విద్యార్థులకు అవసరమయ్యే సౌకర్యాలను సమకూర్చుతున్నారు. జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాదీవెన ద్వారా ఉన్నతవిద్యకు తోడ్పాటునందిస్తున్నారు. 

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, యాజమాన్య పాఠశాలల విద్యార్థులకు 2021–22 విద్యా సంవత్సరానికి జగనన్న విద్యా కానుక పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే పాఠశాల విద్యాశాఖకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ పథకం అమలుకు ఈసారి దాదాపు రూ.100 కోట్ల మేర నిధులు పెంచింది. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరగుతుండటంతో ఆమేరకు నిధులు ఎక్కువగా కేటాయించింది. 

1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు అందించే జగనన్న విద్యాకానుక కిట్లలో 3 జతల యూనిఫారం, షూ, 2 జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు, పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్ లు, నోట్‌ బుక్ లతో పాటు ఈసారి కొత్తగా డిక్షనరీని ఇవ్వనున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, జడ్పీ, ఎంపీపీ, మున్సిపల్, వివిధ సంక్షేమ శాఖల రెసిడెన్షియల్‌ స్కూళ్లు, ఆశ్రమ స్కూళ్లు, ఎయిడెడ్‌ స్కూళ్లు, మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీలు, గుర్తింపు ఉన్న మదర్సాలలోని 1–10 వరకు చదువుతున్న దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు ఈ కిట్లు అందించనున్నారు. ఈసారి డిక్షనరీని కూడా చేర్చడంతో ఆమేరకు వాటిని ప్రొక్యూర్‌ (సేకరించాలని) చేయాలని ఇప్పటికే పాఠశాల విద్యా శాఖను ప్రభుత్వం ఆదేశించింది. 2020–21 విద్యా సంవత్సరంలో జగనన్న విద్యా కానుక కోసం ప్రభుత్వం రూ.648.10 కోట్లకు పైగా వెచ్చించగా, ఈ ఏడాది రూ.731.30 కోట్లను మంజూరు చేసింది. యూనిఫారం కుట్టు కూలీ కింద 1–8 విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.120, అదే విధంగా 9–10 విద్యార్థుల కోసం ఒక్కొక్కరికి రూ.240 చొప్పున నిధులు అందిస్తోంది. స్టూడెంట్ కిట్ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడవద్దని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.

గత ప్రభుత్వాలేవీ స్కూళ్లలో డ్రాప్ అవుట్స్‌ పై దృష్టి పెట్టలేదు. ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేశాయి. పాఠశాలల బిల్డింగ్ లు, ప్రహారీ గోడలు శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ క్రమంలో విద్యార్థులకు మంచి విద్య అందించాలంటే మంచి మౌలిక వసతులు ఉండాలని, మంచి వాతావరణం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి నాడు నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆ దిశగా అడుగులు వేశారు. పిల్లలను బడిలో చేర్చే సమయంలో ఇబ్బంది పడే పేదింటి అక్కచెల్లెమ్మలకు విముక్తి కలిగించడంతో పాటు, పాఠశాలల్లో డ్రాప్‌ అవుట్‌లను గణనీయంగా తగ్గిస్తూ, బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే లక్ష్యంగా పెట్టుకొని అడుగులు వేస్తున్నారు. పూర్వ ప్రాథమిక దశలోని పిల్లల అవసరాలు తెలుసుకోవటం ద్వారా వారి శక్తి సామర్థ్యాలు అవగాహన చేసుకోవడం, తద్వారా  పిల్లల సమగ్ర అభివృద్ధిని మరింత మెరుగ్గా సాధించవచ్చని ముఖ్యమంత్రి గట్టిగా నమ్మారు. అందుకే మంచి వసతుల కల్పనతో విద్యను అందిస్తున్నారు. విద్య అంటే జ్ఞానం సంపాదించటం. పుస్తక జ్ఞానమూ, అనుభవ జ్ఞానమూ విద్య ద్వారా లభ్యం కావాలన్నది జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం. అందుకే విద్యకు విశేష ప్రాధాన్యతనిస్తూ మార్గదర్శకుడయ్యారు. జగన్ మోహన్ రెడ్డి నిర్ణయంతో విద్యార్థుల భవిష్యతే కాదు ప్రభుత్వ పాఠశాలలకు పునర్ వైభవం వస్తుందని సర్వత్రా విశ్వసిస్తున్నారు. చదువు మనిషికి నిండుదనాన్ని ఇస్తుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నమ్మి అమలు చేసే ప్రయత్నాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. విద్య కోసం విశేష కృషి చేస్తున్న ముఖ్యమంత్రి ప్రయత్నాన్ని పలువురు మేధావులు, విద్యావేత్తలు అభినందిస్తున్నారు. సదరు విశేష కృషికి నిదర్శనంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో 4 లక్షల మంది విద్యార్ధులు కొత్తగా ప్రవేశాలు పొందారు.