అవినీతి నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, పారదర్శకత, అందుబాటులో సరిపడా ఇసుక, సరసమైన ధరే లక్ష్యంగా ఇసుక విధానంలో మార్పులు.


అమరావతి (ప్రజా అమరావతి);


*రాష్ట్ర సచివాలయం పబ్లిసిటి సెల్‌లో రాష్ట్ర  భూగర్భగనులు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ గోపాలకృష్ణ ద్వివేది ప్రెస్‌మీట్*
అవినీతి నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, పారదర్శకత, అందుబాటులో సరిపడా ఇసుక, సరసమైన ధరే లక్ష్యంగా ఇసుక విధానంలో మార్పులు.


*కాంట్రాక్టరు ఎంపిక కోసం చరిత్రలో ఎన్నడూలేని విధంగా అత్యంత పారదర్శక విధానం*


*కాంట్రాక్టర్‌ను గుర్తించే పనిని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎం.ఎస్‌.టి.సి.కి అప్పగింత*


*నైపుణ్యం, సమర్థత, సాంకేతికత, అనుభవం, నైపుణ్యం ఉన్న సంస్థలు పాల్గొనేలా బిడ్‌ సెక్యూరిటీగా రూ.120 కోట్లు నిర్ణయం*


*బిడ్ల దాఖలులో సంకోచాలు, భయాలు, సందేహాలు లేకుండా ఉండేందుకు ఆన్లైన్‌ పద్ధతిలో టెండర్లు*


*జేపీ గ్రూపునకు చెందిన జయ్‌ప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ సంస్థను ఎంపిక చేసిన ఎం.ఎస్‌.టి.సి.* 


*ప్రతి 15రోజులకు ఒకసారి, ముందస్తుగానే తదుపరి 15 రోజులకు ప్రభుత్వానికి డబ్బు చెల్లింపు*


*గత ఏడాది జరిగిన తవ్వకాలు సుమారు 1.6  కోట్ల మెట్రిక్‌ టన్నులు.*

*తాజా ఇసుక విధానం ద్వారా ఏడాదిలో 2 కోట్ల మెట్రిక్‌ టన్నుల సరఫరా లక్ష్యం*


*నేరుగా రీచ్‌ల వద్దకు వెళ్లి, నాణ్యతను స్వయంగా పరిశీలించి ఇసుకను కొనుక్కోవచ్చు*


*తనకు నచ్చిన వాహనాన్ని తీసుకెళ్లి.. డబ్బు చెల్లించి రశీదు పొంది, ఇసుక తెచ్చుకోవచ్చు.* 


*ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం ఉండదు*


*వినియోగదారుడికి వాహనం అందుబాటులో లేకపోతే రీచ్‌లవద్దే కాంట్రాక్టు సంస్థ స్టాండ్‌ బైగా వాహనాలను  అందుబాటులో* 


*రీచ్‌ వద్ద మెట్రిక్‌ టన్నుకు రూ.475 లు చెల్లిస్తే చాలు. ఎంత కావాలంటే అంత ఇసుకను తెచ్చుకోవచ్చు. ఎన్ని లారీలు కావాలంటే అన్ని లారీల ఇసుకను తీసుకెళ్లొచ్చు.* 


*ఒకవేళ ఇసుక తీసుకెళ్లే వ్యక్తి వ్యాపారి అయితే.... ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా అధిక ధరకు విక్రయించే వీలు లేదు.*


*రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల వారీగా రవాణాఖర్చులతో కలిపికూడా ప్రభుత్వం ధరలు నిర్ణయించి ప్రకటిస్తుంది*


*ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కన్నా అధిక ధరకు ఎవరైనా విక్రయిస్తే వెంటనే 14500 కాల్‌ సెంటర్‌కు కాల్‌చేసి ఫిర్యాదు చేయవచ్చు.*


*నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరలు విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరిస్తుంది.* 


*ఇప్పటికే ఇసుక అక్రమాలను నివారించడానికి ప్రభుత్వం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌బ్యూరోను ఏర్పాటు చేసింది.*


*ఇసుక రీచ్‌ వద్ద మెట్రిక్‌ టన్నుకు రూ.475లు చెల్లించగానే అందులో రూ.375లు నేరుగా ప్రజల ఖజానా, ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది.*


*ఏడాదికి కాంట్రాక్టు సంస్థకు నిర్ణయించిన ఏడాదికి ఇసుక సరఫరా లక్ష్యం 2 కోట్ల మెట్రిక్‌ టన్నులు.*

*టన్నుకు రూ. 475 చొపున మొత్తం విలువ రూ.950 కోట్లు.*

*ఇందులో కాంట్రాక్టు సంస్థ ప్రభుత్వానికి చెల్లించాల్సింది రూ.765 కోట్లు. మిగిలిన సొమ్ము నిర్వహణా ఖర్చులు కింద కాంట్రాక్టు సంస్థకు వెళ్తాయి. ఇందులో రూ.2వేల కోట్ల అవినీతి ఆరోపణలకు ఆస్కారం ఎక్కడ నుంచి వచ్చింది?*


*నదుల పక్కనే ఉన్న గ్రామాల్లో సొంత అవసరాలకోసం ఎడ్లబళ్ల ద్వారా ఇసుకను తెచ్చుకునే అవకాశం ఉంటుంది.*


*బలహీన వర్గాల ఇళ్ల  నిర్మాణాలకు, ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలకు, రీచ్‌లకు సమీపంలో నివసించే వారికి రాయితీపై ఇసుక కొనసాగుతుంది. వారికి కూపన్‌ విధానం కొనసాగుతుంది.*


*గతంలో మాదిరిగా అవినీతికి ఆస్కారం ఉండదు. ఉచితం పేరు చెప్పి వందలకోట్లు మేర దోపిడీ చేసే అవకాశంలేదు. ప్రభుత్వానికి, ప్రజలకు మంచి జరిగేలా కొత్త విధానం రూపకల్పన.*


*- గనుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ గోపాలకృష్ణ ద్వివేది*


రాష్ట్రప్రభుత్వం ఇసుక తవ్వకాలు, నిల్వ, విక్రయాలును కేంద్రప్రభుత్వ సంస్థ ద్వారా అత్యంత పారదర్శకంగా టెండర్లు నిర్వహించి ప్రైవేటు సంస్థకు అప్పగించిందని, దానిపై వస్తున్న ఆరోపణలు అర్థరహితమని రాష్ట్ర భూగర్భగనులు, పిఆర్‌ అండ్ ఆర్డీ ముఖ్య కార్యదర్శి శ్రీ గోపాలకృష్ణ ద్వివేది ఖండించారు. సచివాలయంలోని పబ్లిసిటి సెల్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యంత పటిష్టమైన నిబంధనలతో ఈ టెండర్ల ప్రక్రియను కేంద్ర సంస్థ ఎంఎస్‌టిసి నిర్వహించిందని, దీనిలో ఎటువంటి లొసుగులకు చోటు లేకుండా చర్యలు తీసుకున్నదని తెలిపారు.  తాజాగా ప్రైవేటు సంస్థ ద్వారా జరిగే ఇసుక విక్రయాలకు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇసుక రీచ్‌ను అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. ఇప్పుడు వినియోగదారులు నేరుగా రీచ్‌కు వెళ్ళి ఇసుక నాణ్యతను స్వయంగా పరిశీలించుకునే అవకాశం వుంటుదని, ఎంత కావాలంటే అంత ఇసుకను కొనుగోలు చేయవచ్చని అన్నారు. తాము సొంతగా ఏర్పాటు చేసుకున్న వాహనంలో ఇసుకను తరలించుకు వెళ్ళే వీలు కల్పించామని, సొంత వాహనాలు సమకూర్చుకోలేని వారి కోసం ప్రతి రీచ్‌ వద్ద 20 వాహనాలను అందుబాటులో వుంటాయని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...1)            రాష్ట్రంలో గతంలో జరిగిన ఇసుక అక్రమరవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం 2019లో నూతన ఇసుక విధానంను తీసుకువచ్చింది. ఎపిఎండిసి ద్వారా ఇసుక విక్రయాలు నిర్వహించింది. ఈ కొత్త విధానం వల్ల ఎదురవుతున్న సమస్యలను, ఇబ్బందులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వాటిని మెరుగుపరుచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. ఇసుక నాణ్యత, రవాణా చార్జీలు, కొరత, ఆన్‌లైన్‌ బుకింగ్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యలు తదితర అంశాలపై ప్రజల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయి. వీటన్నింటికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఇసుక విధానంపై సమగ్ర అధ్యయనం కోసం ప్రభుత్వం కేబినెట్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఆరుసార్లు సమావేశమై ఇసుక విధానంపై అన్ని అంశాలను కూలంకషంగా సమీక్షించింది. 


2)     అనంతరం సబ్‌ కమిటీ ప్రభుత్వానికి పలు సిఫారస్‌లతో నివేదిక సమర్పించింది. ఈ సిఫారస్‌లను వివిధ మాధ్యమాల ద్వారా ప్రజల ముందు వుంచి వారి సూచనలు, సలహాలు, అభ్యంతరాలను ప్రభుత్వం ఆహ్వానించింది. 

దానికి స్పందించిన వివిధ వర్గాల వారు మొత్తం 589 సూచనలు చేశారు. వాటిల్లో సహేతుకమైన 485 సూచనలను ప్రభుత్వం సానుకూలంగా తీసుకుంది. అనంతరం మెరుగుపరిచిన ఇసుక విధానంను కేబినెట్ ఆమోదించింది.

ఈ విధానంలో వినియోగారులకు నాణ్యమైన ఇసుకను అందించడం, అన్ని రీచ్‌ల్లోనూ ఒకే ధర, సహేతుకమైన రవాణా చార్జీలు, ఇసుక కొరత అనే మాట రాకుండా చేయడం, అత్యంత సులువుగా ఇసుక కొనుగోలు చేయడం, ఎటువంటి ఫిర్యాదులు వున్నా వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెచ్చే విధానంకు ప్రాధాన్యత ఇచ్చాం.


3)    మెరుగైన ఇసుక విధానంలో భాగంగా ఇసుక తవ్వకాలు, నిల్వ, విక్రయాలు నిర్వహించే సంస్థలను ఎంపిక చేసే బాధ్యతను కేంద్రప్రభుత్వ సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా 7 కేంద్ర సంస్థలతో ప్రభుత్వం సంప్రదింపులు చేసింది. వాటిల్లో ముందుకు వచ్చిన ఎంఎస్‌టిసి సంస్థతో భూగర్భ గనుల శాఖ ఎంఓయు కుదుర్చుకుంది.  ఈ క్రమంలోనే సాంకేతిక, ఆర్థిక అంశాల్లో ప్రభుత్వం నిర్ధేశించిన అర్హతలు వున్న సంస్థలను ఇసుక తవ్వకాలు, నిల్వ, రవాణా, విక్రయాల కోసం టెండర్ల ద్వారా ఎంపిక చేయాలని కోరాం.


4)       అవినీతి నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, తవ్వకం, నిల్వ, పంపిణీలో పారదర్శకత, అందుబాటులో కావాల్సినంత ఇసుక, సరసమైన ధరలే లక్ష్యంగా కొత్త ఇసుక విధానం. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కాంట్రాక్టరు ఎంపిక కోసం అత్యంత పారదర్శక విధానాన్ని పాటించాం. దానిలో భాగంగానే ఇసుక తవ్వకం, నిల్వ, పంపిణీల కోసం కాంట్రాక్టర్‌ను గుర్తించే పనిని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎం.ఎస్‌.టి.సి.కి అప్పగించాం.  బిడ్డింగ్‌ ప్రక్రియలో ఆషామాషీతనం లేకుండా, సమర్థతలేని సంస్థలకు ఆస్కారం లేకుండా, నైపుణ్యం, సమర్థత, సాంకేతికత, ఆపరేషన్స్‌లో అపార అనుభవం, నైపుణ్యం ఉన్న సంస్థలు పాల్గొనేలా బిడ్‌ సెక్యూరిటీగా రూ.120 కోట్లు చెల్లించాలని నిర్ణయించారు. 


5)             దరఖాస్తు చేసుకున్న కంపెనీల సాంకేతిక సమర్థతలను ఎం.ఎస్‌.టి.సి. పరిశీలించిన తర్వాత ఆర్థిక బిడ్లను ఆహ్వానించింది. పోటీలో ఎక్కుమంది పాల్గొనేందుకు వీలుగా స్వీకరణకు గడువును కూడా పెంచారు. దీనిపై అన్ని ప్రముఖ దినపత్రికల్లో టెండర్ల ప్రకటనలు ఇవ్వడంద్వారా విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది. బిడ్ల దాఖలులో సంకోచాలు, భయాలు, సందేహాలు లేకుండా ఉండేందుకు ఆన్లైన్‌ పద్ధతిలో టెండర్లు స్వీకరించడమైంది. పోటీగా పలు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. తద్వారా బిడ్డింగ్‌ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడమైంది. 


6)            ఈ ప్రక్రియలో జేపీ గ్రూపునకు చెందిన జయ్‌ప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ సంస్థను ఎం.ఎస్‌.టి.సి. ఎంపిక చేసింది. ఎప్పుడూ లేని విధంగా ఇసుకను నిర్వహించే కాంట్రాక్టు సంస్థ నుంచి రూ.120 కోట్ల రూపాయల ఫెర్మార్మన్స్‌ గ్యారంటీ(బ్యాంకు గ్యారంటీ)ని కూడా స్వీకరించడమైంది. అంతేకాక ఈ సంస్థ ప్రతి 15రోజులకు ఒకసారి, ముందస్తుగానే తదుపరి 15 రోజులకు సంబంధించి డబ్బును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. 


7)       గత ఏడాది జరిగిన ఇసుక తవ్వకాలు సుమారు 1.6 కోట్ల మెట్రిక్‌ టన్నులుపైనే కాగా, తాజా ఇసుక విధానం ద్వారా ఏడాదిలో 2 కోట్ల మెట్రిక్‌ టన్నుల ఇసుక తవ్వకాలు, సరఫరాను కనీస లక్ష్యంగా కాంట్రాక్టు సంస్థకు నిర్ణయించడమైంది. దీనివల్ల కొరత లేకుండా విరివిగా వినియోగదారులకు ఇసుక అందుబాటులో ఉంటుంది. ఇకపై ఆన్‌లైనా ద్వారా ఇసుకను బుక్‌ చేసుకోవాల్సిన అవసరంలేదు. సర్వర్లు మొరాయించడం, నెట్‌వర్క్‌ సమస్యలు, ఉద్దేశ పూర్వకంగా ఇసుకను బ్లాక్‌చేయడం, కృత్రిమ కొరతను సృష్టించండం లాంటి అక్రమాలకు చెక్‌ పడుతుంది. 


8)        ఎక్కడ ఇసుక దొరుకుతుందనే ఇబ్బందులు అవసరంలేదు. నేరుగా రీచ్‌ల వద్దకు వెళ్లి, నాణ్యతను స్వయంగా పరిశీలించి ఇసుకను కొనుక్కోవచ్చు. తనకు నచ్చిన వాహనాన్ని తీసుకెళ్లి.. డబ్బు చెల్లించి రశీదు పొంది, ఇసుక తెచ్చుకోవచ్చు. ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. ఒకవేళ వినియోగదారుడికి వాహనం అందుబాటులో లేకపోతే రీచ్‌లవద్దే కాంట్రాక్టు సంస్థ స్టాండ్‌ బైగా వాహనాలను  ఉంచుతుంది. వాటిద్వారా ఇసుకను తీసుకెళ్లొచ్చు. తాజా ఇసుక విధానం ప్రకారం మెట్రిక్‌ టన్నుకు రూ.475 లు చెల్లిస్తే చాలు. ఎంత కావాలంటే అంత ఇసుకను తెచ్చుకోవచ్చు. ఎన్ని లారీలు కావాలంటే అన్ని లారీల ఇసుకను తీసుకెళ్లొచ్చు. 


9)       ఒకవేళ ఇసుక తీసుకెళ్లే వ్యక్తి వ్యాపారి అయితే.... ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా అధిక ధరకు విక్రయించే వీలు లేదు. వినియోగదారుల ప్రయోజనాలు పరిరక్షించేలా అన్నిరకాల చర్యలూ తీసుకోవడమైంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల వారీగా రవాణాఖర్చులతో కలిపికూడా ప్రభుత్వం ధరలు నిర్ణయించి ప్రకటిస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కన్నా అధిక ధరకు ఎవరైనా విక్రయిస్తే వెంటనే 14500 కాల్‌ సెంటర్‌కు కాల్‌చేసి ఫిర్యాదు చేయవచ్చు. నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరలు విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే ఇసుక అక్రమాలను నివారించడానికి ప్రభుత్వం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరోను ఏర్పాటు చేసింది.


10)           ఇసుక రీచ్‌ వద్ద మెట్రిక్‌ టన్నుకు రూ.475లు చెల్లించగానే అందులో రూ.375లు నేరుగా ప్రజల ఖజానా, ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. రూ. మిగిలిన రూ.100లు నిర్వహణా ఖర్చులు కింద కాంట్రాక్టర్‌కు చెందుతాయి.

కాంట్రాక్టు సంస్థకు నిర్ణయించిన ఏడాదికి ఇసుక సరఫరా లక్ష్యం 2 కోట్ల మెట్రిక్‌ టన్నులు. టన్నుకు రూ. 475 చొపున మొత్తం విలువ రూ.950 కోట్లు. ఇందులో కాంట్రాక్టు సంస్థ ప్రభుత్వానికి చెల్లించాల్సింది రూ.765 కోట్లు. మిగిలిన సొమ్ము యంత్రాలు, పరికరాలు, పంపిణీ కింద నిర్వహణా ఖర్చులు కింద కాంట్రాక్టు సంస్థకు వెళ్తాయి. ఇందులో రూ.2వేల కోట్ల అవినీతి ఆరోపణలకు ఆస్కారం ఎక్కడ నుంచి వచ్చింది?


11)           నదుల పక్కనే ఉన్న గ్రామాల్లో సొంత అవసరాలకోసం ఎడ్లబళ్ల ద్వారా ఇసుకను తెచ్చుకునే అవకాశం ఉంటుంది. గ్రామ సచివాలయాలద్వారా కూపన్‌లు తీసుకుని వీరు ఇసుకను పొందవచ్చు. బలహీన వర్గాల ఇళ్ల  నిర్మాణాలకు, ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలకు, రీచ్‌లకు సమీపంలో నివసించే వారికి రాయితీపై ఇసుక కొనసాగుతుంది. వారికి కూపన్‌ విధానం కొనసాగుతుంది. గతంలో మాదిరిగా ఉచితం పేరు చెప్పి వందలకోట్లు మేర దోపిడీ చేసే అవకాశంలేదు. ప్రభుత్వానికి, ప్రజలకు మంచి జరిగేలా కొత్త విధానం రూపకల్పన.


12)           కాంట్రాక్టింగ్ ఏజెన్సీ ఈ నిబంధనల విషయంలో విఫలమైంతే ప్రభుత్వానికి జరిమానా చెల్లించాల్సి వుంటుంది. కృత్రిమ కొరతను క్రియేట్ చేయకుండా 70శాతం రీచ్‌లు తప్పకుండా పనిచేయాలి. మాన్‌సూన్ సీజన్‌లో రిజర్వ్ స్టాక్‌ చేయకపోయినా కూడా పెనాల్టీ చెల్లించాల్సి వస్తుందని, దీనిని బ్యాంక్ గ్యారెంటీ నుంచి వెంటనే రికవరీ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 65 రీచ్‌లు నడుస్తున్నాయి. మొత్తం 200 రీచ్‌లను గుర్తించాం. పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేశాం. మైనింగ్ ప్రక్రియ పూర్తి అవుతుండగానే, కొత్త రీచ్‌లను మైనింగ్‌ కోసం సిద్దం చేస్తున్నాం. 


13)        మైనింగ్ కార్యకలాపాల్లొ నిర్ధిష్టమైన అనుభవం వున్న సంస్థలే టెండర్లలో పాల్గొనేలా రూపొందించిన నిబంధనల వల్ల అర్హత వున్న సంస్థలకే అవకాశం లభించింది. ప్రస్తుతం టెండర్ దక్కించుకున్న జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ కూడా ఈ అర్హతలను నిరూపించుకోవడం వల్లే వారిని కేంద్రప్రభుత్వ సంస్థ అయిన ఎంఎస్‌టిసి ఎంపిక చేసింది. ఇందులో ఎటువంటి అవినీతి, అక్రమాలకు అవకాశం లేదు. ఎంఎస్‌టిసి అనేక రాష్ట్రాల్లో ఈ తరహా టెండర్లను విజయవంతంగా నిర్వహిస్తున్న కేంద్రం ప్రభుత్వ సంస్థ. థర్డ్ పార్టీ ద్వారా ఇసుక టెండర్లు నిర్వహించడం ద్వారానే ఎటువంటి ఆరోపణలు లేని విధానంను తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దీనిపై చేస్తున్న ఆరోపణలు అర్థరహితం.