పలుగు చేతబట్టి ఉపాధి పనులు చేసిన జిల్లా కలెక్టర్

 పలుగు చేతబట్టి ఉపాధి పనులు చేసిన జిల్లా కలెక్టర్



: *ఉపాధి పని చేసి కూలీలలో ఉత్సాహం నింపిన జిల్లా కలెక్టర్..*


: *అర్హులందరికీ పనులు కల్పించాలి*


: *ఈ ఏడాది ఇప్పటివరకు 2.66 కోట్ల మందికి ఉపాధి పనులు కల్పించాం*


: *కోవిడ్ నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి*


:జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు...


అనంతపురం, మార్చి 23 (praja అమరావతి) :


జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పలుగు చేతపట్టి ఉపాధి పని చేశారు.. కూలీలలో ఉత్సాహం నింపారు.. వారితో మాటామంతి కలిపి వారిలో ఒకడిగా కలిసిపోయి ఉపాధి పనులపై ఆరా తీశారు.. అర్హులందరికీ పనులు కల్పించాలని, అడిగినవారికి లేదనకుండా పని ఇవ్వాలని, కోవిడ్ నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ దృశ్యం ఆత్మకూరు మండలం వడ్డిపల్లి గ్రామ పరిధిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న ఉపాధి పనుల పరిశీలనలో ఆవిష్కృతం అయింది.


ఆత్మకూరు మండలంలోని వడ్డిపల్లి గ్రామ పరిధిలో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న ఉపాధి పనులను మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. 


 *ఈ ఏడాది ఇప్పటివరకు 2.66 కోట్ల మందికి ఉపాధి పనులు కల్పించాం : జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు...*


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 2.66 కోట్ల మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించామన్నారు. ప్రతిరోజు 2.30 లక్షల మంది పైగా కూలీలకు ఉపాధి పనులు కల్పిస్తున్నామని, ఇంకా ఎక్కువ మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతిరోజు 6 నుంచి 7 కోట్ల రూపాయల వరకూ కూలీల జేబుల్లోకి కూలీ డబ్బులు అందజేస్తున్నామన్నారు. ఉపాధి పనులు కూలీలకు బాగా ఉపయోగపడుతున్నాయని, వేసవి కాలంలో ఉపాధి హామీ పనులను చేపట్టడం ద్వారా వర్షాకాలంలో వర్షం ద్వారా పడిన నీరు అక్కడే ఇంకిపోయేలా డగౌట్స్ పాంట్స్, సింక్ రిమూవల్ పనులు చేయడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్మూలించడానికి ఉపాధి పనులు ఉపయోగపడతాయని, ఉపాధి పనులతో భూగర్భ జలాలు పెంపొందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో 6 లక్షల కుటుంబాలు జాబ్ కార్డులు కలిగి ఉన్నాయని, 9 లక్షల మంది పైచిలుకు ఉపాధి పనులు చేస్తున్నారని, కొత్తగా దరఖాస్తు చేసుకున్న 30 వేల మందికి జాబ్ కార్డులు రెండు రోజుల్లో ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. గతేడాది జిల్లాలో 6.50 లక్షల మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర యావరేజీకన్నా జిల్లాలో మంచిగా కూలీలకు కూలీ డబ్బులు వస్తున్నాయని తెలిపారు.


ఉపాధి పని కావాలన్న ప్రతి ఒక్కరికి పని కల్పించడం తమ లక్ష్యమని, ఉపాధి పనులపై డ్వామా ఎంపీడీవోలు, ఏపీడీలతో సమీక్షలు నిర్వహిస్తూ సాధ్యమైనంత ఎక్కువమందికి పని కల్పించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఉపాధి పనుల ద్వారా వచ్చే మెటీరియల్ కాంపోనెంట్ కింద అంగన్వాడి సెంటర్ లు, రైతు భరోసా కేంద్రాలు నిర్మిస్తున్నామన్నారు. వివిధ రకాలుగా సమాజానికి ఉపయోగపడేలా ఉపాధి పనులు చేపడుతున్నామని, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి ఉపాధి పనులు అన్ని విధాల ఉపయోగపడుతాయన్నారు. వేసవి కాలం కావడంతో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కూలీలకు మజ్జిగ అందజేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 


కోవిడ్ నేపథ్యంలో ఉపాధి పనులు చేసే ప్రాంతంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించామని జిల్లా కలెక్టర్ తెలిపారు.


ఈ సందర్భంగా ఉపాధి పనులు ప్రతి రోజు కల్పిస్తున్నారా, క్రమం తప్పకుండా డబ్బులు అందజేస్తున్నారా అంటూ ఉపాధి కూలీలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఎన్ని రోజులనుంచి పనులు చేస్తున్నారు, ఎంతమంది పనికి వచ్చారు, ఎన్ని గ్రూపులు ఉన్నాయి, రోజుకు ఎన్ని గంటలు పనికి వస్తారు, అడిగిన వెంటనే పని కల్పిస్తున్నారా అని జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ మాకు అడిగిన వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ పనులు కల్పిస్తున్నారని, ఈరోజు 234 రూపాయలకు పైగా కూలీ డబ్బులు ఇస్తున్నారని జిల్లా కలెక్టర్ కు తెలిపారు. దీంతో బాగా పనిచేసిన ఫీల్డ్ అసిస్టెంట్ రామాంజనేయులును జిల్లా కలెక్టర్ అభినందించారు. ఫీల్డ్ అసిస్టెంట్ కి ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి అందించే స్ఫూర్తి అవార్డు అందించేలా చూడాలని సూచించారు.


ఈ కార్యక్రమంలో డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, ఎంపిడిఓ రామాంజనేయులు, ఏపీడీ నీలిమ, ఏపీఓ సుజాత, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు. 



Comments