పరిషత్ ఎన్నికల్లో 66.81 శాతం పోలింగ్ . అత్యధికంగా నమోదు చేసుకున్న జిల్లాల్లో ఒకటిగా నిలిచింది విజయనగరం, ఏప్రిల్ 08 (prajaamaravathi) ః మొన్న పంచాయతీ.. నేడు పరిషత్.. ఎలక్షన్ ఏదైనా జిల్లాలోని ఓటర్ల ఉత్సాహం మాత్రం తగ్గలేదు. పంచాయతీ ఎన్నికల్లో చూపిన ఉత్సుకతే... ఇక్కడా చూపారు. జిల్లాలో ఉన్న మొత్తం 14,46,983 మంది ఓటర్లలో 9,66,430 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రక్రియ మొదట్లో మందకొడిగా మొదలైనా సాయంత్రం అయ్యేసరికి జోరందుకుంది. గురువారం ఉదయం 7.00 గంటలకే మొదలైన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సాయంత్రానికి 66.81 శాతం పోలింగ్ నమోదయ్యింది. దీంతో రాష్ట్రంలోనే అత్యధికంగా పోలింగ్ నమోదైన జిల్లాల్లో ఒకటిగా విజయనగరం నిలిచింది. పంచాయతీ ఎన్నికల్లో 87.09 శాతం పోలింగ్‌తో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన జిల్లా మళ్లీ ఇప్పుడు కూడా అదే పంథా కొనసాగించడం హర్షణీయం. ఉదయం 7.00 గంటలకే మొదలైన పోలింగ్ క్రమేణా పెరగసాగింది. 8.00 గంటలకు కేవలం 3.92 శాతంతో మొదలైన ఓటింగ్ సరళి.. గంటకు గంటకూ పెరిగింది. మధ్యాహ్నం 02.00 గంటకు 51.09 శాతంతో రాష్ట్రంలో అత్యధికంగా పోలింగ్ నమోదైన జిల్లాల్లో ఒకటిగా నిలిచింది. ఓటింగ్ ముగిసే సమయానికి మొత్తం 66.81 శాతంతో ఉనికిని చాటుకున్న జిల్లాగా విజయనగరం నిలిచింది. *అత్యధికం డెంకాడలో.. అత్యల్పం సీతానగరంలో..* మండలాల విషయానికి వచ్చే సరికి 81.71 శాతంతో డెంకాడ మండలం ముందు వరుసలో ఉండగా 79.52 శాతంతో ద్వితీయ స్థానంలో భోగాపురం మండలం నిలిచింది. ఇక పోతే సీతానగరం మండలంలో 56.84 అత్యల్పంగా పోలింగ్ నమోదైంది. డెంకాడ మండలంలో 42981 మంది ఓటర్లు ఉండగా.. 35119 మంది ఓటు వేశారు. సీతానగరంలో 27356 మందికి గాను కేవలం 15550 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సమయం సాయంత్రం 5.00 గంటల వరకే అయినా.. 6.00 గంటల వరకూ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవటం గమనార్హం. జిల్లా ఎన్నికల యంత్రాంగం చూపిన చొరవ.. ప్రోత్సాహం.. కనబరిచిన పనితీరు ఈ సందర్భంగా ఫలించాయనే చెప్పాలి. దీనిపై అధికార వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యమైన ప్రతీ ఒక్కరినీ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్.
పరిషత్ ఎన్నికల్లో 66.81 శాతం పోలింగ్ . అత్యధికంగా నమోదు చేసుకున్న జిల్లాల్లో ఒకటిగా నిలిచింది
addComments
Post a Comment