ఘనంగా శ్రీ ప్లవనామ ఉగాది వేడుకలు అందరికీ ఆరోగ్యం ః జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్
విజయనగరం, ఏప్రెల్ 13 (prajaamaravathi) ః శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలు కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం ఘనంగా జరిగాయి. లక్కోజు ఓంకారశాస్త్రి ఆచార్యులు పంచాంగ శ్రవణం చేశారు. ఈ ఏడాది ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు విరివిగా అందుతాయని, వర్షాలు బాగా పడతాయని, పంటలు బాగా పండుతాయని చెప్పారు. కుజుడు రాజ్యాధిపతి కావడంతో ఎరుపు పంటలకు అనుకూలమన్నారు. వర్షాలు, ప్రకృతి విపత్తులు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు. రోడ్డు ప్రమాదాలు, ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తాయని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలూ సఖ్యంగా ఉంటాయన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య కొంతమేరకు తగ్గుతుందన్నారు. ఆరోగ్యపరమైన సేవలు పెరుగుతాయన్నారు. సరిహద్దుల్లో పోరాటం తప్పదని, అయినప్పటికీ దేశం సైనికపరంగా బాగా బలపడుతుందని తెలిపారు. ద్వాదశ రాశిఫలాలను, కందాదాయ ఫలాలను ఓంకారశాస్త్రి వివరించారు. అందరికీ ఆరోగ్యం సిద్దించాలి ః జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ శ్రీ ప్లవనామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికీ మంచి ఆరోగ్యం సిద్దించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆకాంక్షించారు. ఉగాది వేడుకల్లో ఆయన తన సందేశాన్ని వినిపిస్తూ, అన్నిటికంటే ఆరోగ్యం గొప్ప ఐశ్వర్యమని పేర్కొన్నారు. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపైనా ఉందన్నారు. అందుకే జిల్లా ప్రజల ఆయురారోగ్యాలకోసం పరిశుభ్రత, పచ్చదనం, ఆరోగ్యం నినాదాలుగా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. పూర్తిగా ప్రకృతి సేద్యం ద్వారా పండించిన పంటలను రైతుబజార్లలో వారానికి ఒక రోజు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మన జీవితాలు కూడా ఉగాది పచ్చడి లాగ, షడ్రుచుల సమ్మేళనమని కలెక్టర్ పేర్కొన్నారు. మానవ జీవితంలో కష్టాలు కూడా ఒక భాగమేనని అన్నారు. అయితే కష్టాలు, భయాలు ఎల్లకాలం ఉండవని, సంతోషం, ఆనందం కూడా వచ్చి తీరుతుందని, అది ప్రకృతి ధర్మమని ఆయన స్పష్టం చేశారు. సాధ్యమైనంతవరకు ఇతరులకు మంచి చేయాలని, వారి కన్నీళ్లు తుడిచేందుకు కృషి చేయాలని కోరారు. ఎదుటివారికి ఉపకారం చేస్తే, దేవుడు కూడా మనకు మంచి చేస్తాడని అన్నారు. విజయనగరం జిల్లా విద్యలకు, జ్ఞాన సంపత్తికి నిలయమని, సంపూర్ణ ఆయుష్షుకు కూడా మారుపేరుగా మార్చేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. మహారాజ సంగీత, నృత్య కళాశాల విద్యార్థుల ప్రార్థనాగీతంతో ఉగాది వేడుక ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా ఆ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నాదస్వర కచేరీ ఆకట్టుకున్నాయి. సీతారామస్వామి ఆలయ పూజారి సోమేశ్వర శర్మ, గౌరీశ్వరస్వామి ఆలయ పూజారి మల్లేశ్వరశాస్త్రి, ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయ పూజారి భువనేశ్వర ప్రసాద్‌లకు దేవాదాయ శాఖ ప్రకటించిన ఉగాది పురస్కారాలను కలెక్టర్ అందజేశారు. వారిని దుశ్శాలువతో సత్కరించి, రూ.10వేలు నగదు పురస్కారాన్ని కూడా అందించారు. ఈ ఉగాది వేడుకల్లో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు, డిఆర్ఓ ఎం.గణపతిరావు, దేవాదాయశాఖ సహాయ కమిషనర్ కె.శాంతి, సమాచార, పౌర సంబంధాలశాఖ సహాయ సంచాలకులు డి.రమేష్, జిల్లా పర్యాటకాధికారి పిఎన్‌వి లక్ష్మీనారాయణ, డిపిఎం బి.పద్మావతి, డిఇఓ నాగమణి, ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వరి, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ అనురాధా పరశురామ్, కలెక్టరేట్ ఏఓ దేవ్ ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి రామవరం హైస్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
addComments
Post a Comment