హోం ఐసోలేషన్ లో ఉన్న కరోనా బాధితులకు టెలీ సేవలు

 హోం ఐసోలేషన్ లో ఉన్న 

కరోనా బాధితులకు టెలీ సేవలు


రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్

కొవిడ్ కేర్ సెంట్లలోనే టెస్టింగ్, ఫలితం వెల్లడి...  

ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ లు ఆపలేదు... : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి

సచివాలయం, మే 1 (ప్రజా అమరావతి) : హోం ఐసోలేషన్ లో ఉన్న కరోనా బాధితులకు టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా వైద్యులతో సలహాలు సూచనలు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కొవిడ్ కేర్ సెంటర్లలో కరోనా టెస్టులు చేయడంతో పాటు అక్కడే ఫలితాలు కూడా ఇవ్వనున్నామన్నారు. కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైన సిబ్బందిని నియమించుకునే అధికారం జిల్లా కలెక్టర్లకే అప్పగించినట్లు ఆయన తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో 98,214 కరోనా టెస్టులు నిర్వహించగా, 19,412 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 61 మరణాలు సంభవించాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటల్లో 5,371 రెమ్ డి సివిర్ ఇంజక్షన్లు వినియోగించగా, 27,615 ఇంకా అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకూ అవసరమైన మేర రెమ్ డిసివిర్ ఇంజక్షన్లు సరఫరా చేస్తున్నామన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్ ట్రీట్ మెంట్ కోసం ఆసుపత్రులను జిలా కలెక్టర్లు గుర్తిస్తున్నారన్నారు. కాల్ సెంటర్ కు నేడు(1.5.2021) ఒక్క రోజే 13,898 మంది ఫోన్లు చేశారన్నారు. వారిలో 3,356 మంది టెస్టుల వివరాలకు, 3,359 వివిధ సమాచారానికి, ఆసుపత్రుల్లో అడ్మిట్ కోసం 304 మంది, 2,678 మంది టెస్టు రిజల్ట్ కోసం ఫోన్ కాల్ చేశారన్నారు.

నిన్నా మొన్నటి కన్నా ఆక్సిజన్ ఎక్కుగా సరఫరా...

నిన్నా మొన్నటి కన్నా నేడు ఎక్కువగా ఆక్సిజన్ ను సరఫరా చేశామని ఆయన తెలిపారు. గడిచిన 24 గంటల్లో 443 టన్నుల లిక్విడ్ ఆస్సిజన్ సప్లయ్ చేశామన్నారు. కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ఆక్సిజన్ కేటాయింపులు మరింత పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి కోరామన్నారు. నేటి(శనివారం) సాయంత్రం 7.30 కేంద్ర ప్రభుత్వం... ఏపీ, తెలంగాణా, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుందని, ఆ సమావేశంలో ఆక్సిజన్ కేటాయింపులపై పెంపు విషయం కోరనున్నామని ఆయన తెలిపారు. విజయవాడ నుంచి ఒడిశాలోని అంగుల్ ప్లాంట్ కు 2 ఖాళీ ట్యాంకర్లను ఎయిర్ లిఫ్ట్ చేశామన్నారు. 2 ట్యాంకర్ల ద్వారా 50 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఏపీకి రానుందన్నారు. రవాణా సమయాన్ని బట్టి రోడ్డు, రైలు మార్గంలో త్వరితగతంగా ట్యాంకర్లను వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎల్లుండి మళ్లీ ట్యాంకర్లు లిఫ్ట్ చేస్తామన్నారు. ఆక్సిజన్ సప్లయ్ కోసం రాష్ట్రంలో 64 ట్యాంకర్లను వినియోగిస్తున్నామన్నారు. కేంద్రం ఆదేశాల మేరకు ఐయూసీఎల్ కంపెనీ కేటాయించిన 2 సీఎన్జీ వాహనాలు రావాల్సి ఉందన్నారు. వాటి వల్ల 20 నుంచి 25 టన్నుల కెపాసిటీ పెరిగే అవకాశముందన్నారు. 

హోం ఐసోలేషన్ బాధితులకు టెలీ సేవలు...

టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ కు 2,668 మంది డాక్టర్లు రిజిస్టర్ చేసుకున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వారి ద్వారా టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా  ఫోన్ లో సలహాలు సూచనలు అందజేశామన్నారు. హోం ఐసోలేషన్ లో 88,898 మంది ఉన్నారని, వారందరికీ ఫోన్ చేసి ఆరోగ్య సమాచారంతో పాటు సలహాలు సూచనలు అందిజేసే కార్యక్రమం నేటి సాయంత్రం(శనివారం) నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. ఒకవైపు ఎన్ఎఎం.లు, ఆశా కార్యకర్తలు స్వయంగా ఇంటికెళ్లి వెళ్లి కరోనా బాధితులను పరామర్శిస్తారన్నారు. మరో వైపు టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా డాక్టర్లు నేరుగా కరోనా బాధితులకు ఫోన్ చేసి సలహాలు సూచనలు అందజేస్తారన్నారు. 

వైద్య సిబ్బంది నియామకం అధికారం కలెక్టర్లకే...

జిల్లాల్లో అవసరమైన వైద్య సిబ్బందిని నియమించుకునే అధికారం కలెక్టర్లకు ఇచ్చామని ఆయన తెలిపారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో నియామకాలు పూర్తయితే, మరికొన్ని జిల్లాలో ఇంకా కొనసాగుతున్నాయన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నియామకాలు కూడా అధిక సంఖ్యలో చేపట్టామని వివరించారు. గడిచిన ఏడాది కాలంలో 9 వేల మందిని శాశ్వత ప్రాతిపదిక రిక్రూట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఇంకా అవసరమనుకుంటే రిక్రూట్ చేసుకొవొచ్చునని కలెక్టర్లకు తెలిపామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుతున్న సేవలు, బాధితుల గురించి సమాచారం సేకరించడానికి ఆరోగ్య మిత్రలను, గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లను వినియోగిస్తున్నామన్నారు. 

అవసరమైన వారికే బెడ్లు...

రాష్ట్రంలో 551 ఆసుపత్రుల్లో కొవిడ్ ట్రీట్ మెంట్ ఇస్తున్నారని, వాటిలో బెడ్లు 43,498 ఉన్నాయన్నాని తెలిపారు. వాటిలో నేటి(శనివారం) ఉదయం వరకూ 32,301 బెడ్లు నిండాయన్నారు. ఇంకా 11 వేలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసుపత్రుల్లో ఉంటే రక్షణ ఉంటుందనే ఆలోచనతో ఆసుపత్రుల్లో చేరడానికే కరోనా బాధితులు మొగ్గు చూపుతున్నారని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఆసుపత్రిలో సేవలు అవసరం లేదన్నారు. ఇంటిలోగాని, కొవిడ్ కేర్ సెంటర్లలోగాని సేవలు పొందొచ్చునన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లపై బాధితుల్లో నమ్మకం కలుగుతోందన్నారు. దీంతో కొవిడ్ సెంటర్లకు తరలి వస్తున్నారన్నారు. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికే ఆసుపత్రుల్లో బెడ్లు కేటాయించి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. స్వల్ప లక్షణాలున్నవారికి కొవిడ్ కేర్ సెంటర్లలో సేవలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో డిశ్చార్జి పాలసీని అమలు చేస్తున్నామన్నారు. దానిలో భాగంగా ఆసుపత్రుల్లో సేవలు పొందుతూ కోలుకున్నవారిని డిశ్చార్జి చేసి, వారి స్థానంలో వేరొకరికి అవకాశమిస్తున్నామని తెలిపారు. కృష్ణా జిల్లాలో నిన్న ఒక్కరోజే 500 మంది డిశ్చార్జయ్యారన్నారు. ఇలా డిశ్చార్జి అయినవారు అవసరమనుకుంటే కొవిడ్ కేర్ సెంటర్లలో ఉండొచ్చు...లేకుంటే ఇంటికే నేరుగా వెళ్లొచ్చునన్నారు. 

కొవిడ్ కేర్ సెంట్లలోనే టెస్టింగ్, ఫలితం వెల్లడి...  

రెండు మూడు రోజుల్లో కొవిడ్ కేర్ సెంట్లలోనే టెస్టింగ్ చేసి, అక్కడే ఫలితాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. కరోనా టెస్టింగ్ ఫలితాలు త్వరితగతంగా ఇస్తున్నామని, ఎక్కడో ఒక్క చోట చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చునని అన్నారు. ఆయా సమస్యలు తమ దృష్టికి వచ్చిన వెంటనే వాటిని తక్షణమే పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో 24 గంటల్లో ఫలితాలు ఇస్తున్నారన్నారు. కొన్ని జిల్లాల్లో రెండ్రోజుల సమయం పడుతోందన్నారు. రాష్ట్రమంతటా మంగళవారం నుంచి టెస్టులు చేసిన తరవాత రోజే ఫలితాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రోజు రోజుకూ కొవిడ్ కేర్ సెంటర్లలో రోగుల సంఖ్య పెరుగుతోందన్నారు. శనివారం మధ్యాహ్నం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ కేర్ సెంటర్లలో 8,709 మంది ఉన్నారన్నారు. రాబోయే రెండు మూడ్రోజుల్లో ఆ సంఖ్య 15 వేలకు చేరుకోవొచ్చునన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లను బలోపేతం చేయడంతో, రోగులు  ఈ సెంటర్లో చేరడానికి మొగ్గు చూపుతున్నారన్నారు.

ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ లు ఆపలేదు...

రాష్ట్రంలో ఎక్కడా ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ లు ఆపలేదన్నాని ఆయన తెలిపారు. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న శాంపిళ్లను రెండ్రోజుల్లో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. అన్ని రాష్ట్రాల్లో ర్యాపిట్ టెస్టుల చేస్తున్నారన్నారు. అంబులెన్స్ లు కొరత ఉన్న చోట వాటిని పెంచుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు ఇచ్చామన్నారు. 

Comments