రాష్ట్ర వ్యాప్తంగా జ్వరపీడితుల గుర్తింపునకు నేటి(శనివారం) నుంచి ఇంటింటి సర్వే •

 రాష్ట్ర వ్యాప్తంగా జ్వరపీడితుల గుర్తింపునకు

నేటి(శనివారం) నుంచి ఇంటింటి సర్వే


రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్

కరోనా కట్టడికి సత్ఫలితాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ చర్యలు

పెరుగుతున్న డిశ్చార్జి కేసులు

దేశ వ్యాప్తంగా చూస్తే... ఏపీలోనే తక్కువ మరణాలు రేటు

రాష్ట్రానికి అదనంగా రానున్న 230 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ : 

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి

అమరావతి, మే 14 (ప్రజా అమరావతి): నేటి(శనివారం) నుంచి జ్వర పీడితులను గుర్తించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. రాబోయే రెండు మూడు రోజుల్లో కేంద్రప్రభుత్వం కేటాయించిన ఆక్సిజన్ నిల్వలతో పాటు అదనంగా 230 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి రానుందన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జీల సంఖ్య పెరుగుతోందని, ఇది శుభపరిణామమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 89,087 కరోనా టెస్టుల చేయగా, 22,018 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 96 మంది మృతి చెందారని తెలిపారు. దేశ వ్యాప్తంగా చూస్తే రాష్ట్రంలో మరణాల శాతం తక్కువగా ఉందని, ఇది శుభపరిణామమని ఆయన తెలిపారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగానే మరణాల శాతం తక్కువగా నమోదవుతోందన్నారు. రాష్ట్రంలో 6,453 ఐసీయూ బెడ్లు ఉండగా 6,006 రోగులతో నిండి ఉన్నాయని, 447 బెడ్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆక్సిజన్ బెడ్లు విషయానికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా 23,204 బెడ్లకు గానూ 22,029 కరోనా బాధితులతో నిండి ఉన్నాయన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో 16,597 మంది చికిత్స పొందుతున్నారన్నారు. 

రాష్ట్రంలో పెరుగుతున్న డిశ్చార్జీలు...

ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జిలు పెరుగుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల నుంచి 4,306 మంది డిశ్ఛారయ్యారన్నారు. 5,523 మంది వివిధ ఆసుపత్రుల్లో చేరారన్నారు. అడ్మిషన్లు, డిశ్చార్జిల మధ్య గ్యాప్ తగ్గుతూ వస్తోందన్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో డిశ్ఛార్జిలు మరింత పెరిగే అవకాశముందన్నారు. గడిచిన 24 గంటల్లో ప్రైవేటు ఆసుపత్రులకు 18,410 రెమిడెసివిర్ ఇంజక్షన్లను సరఫరా చేశామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో 19,349 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఒకే రోజు ప్రైవేటు ఆసుపత్రులకు 18 వేల కు పైగా రెమిడెసివిర్ ఇంజక్షన్లు ఇవ్వడం ఇదే ప్రథమమన్నారు. గడిచిన 24 గంటల్లో 104 కాల్ సెంటర్ కు 13,868 ఫోన్ వచ్చాయని, వాటిలో వివిధ సమాచారాల నిమిత్తం 5,444 కాల్స్ వచ్చాయన్నారు. అడ్మిషన్లకు 3,018 ఫోన్ కాల్స్, కరోనా టెస్టులకు 2,914, టెస్టు రిజల్ట్ కోసం 1,886 ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. 

అదనంగా 230 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాక...

గడిచిన 24 గంటల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందిందన్నారు. చెన్నై లో ప్లాంట్ లో ఇబ్బందుల రావడంతో ఐదారు రోజుల పాటు ఏపీకి రావాల్సిన ఆక్సిజన్ సరఫరా నిలిచిపోనుందని నిన్న అర్ధరాత్రి సమాచారమిచ్చారన్నారు. వెంటనే అధికారులు కేంద్రంతో మాట్లాడారు. ఏపీ, తమిళనాడు, కేరళ, కర్నాటక అధికారులతో కేంద్ర ప్రభుత్వ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, సమస్యను పరిష్కరించారన్నారు. పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ నుంచి 2 ట్యాంకుల్లో 40 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానుందన్నారు. శనివారం మధ్యాహ్నం నాటికి కృష్ణపట్నం పోర్టులకు ఆ ట్యాంకర్లు చేరుకోనున్నాయన్నారు. జామ్ నగర్ నుంచి మరో 110 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానుందన్నారు. రైలు మార్గంలో ఆదివారం నాటికి గుంటూరుకు రానుందన్నారు. జమ్ షెడ్ పూర్ నుంచి మరో 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానుందన్నారు. మొత్తం రెండు మూడు రోజుల్లో 230 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి రానున్నాయన్నరు. కేంద్రమిచ్చే ఆక్సిజన్ తో పాటు అదనంగా రానున్న ఆక్సిజన్ ను రాష్ట్రంలో ఉన్న అన్ని ఆసుపత్రుల్లో  స్టోరేజ్ చేయడం ద్వారా అత్యవసర సేవలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఇవే కాకుండా మరో రెండు మూడు ట్యాంకర్లు దూర్గాపూర్ నుంచి రానున్నాయన్నారు. దీనివల్ల రాయలసీమ జిల్లాల ఎంతో మేలు కలుగుతుందన్నారు. ట్యాంకర్లు అందుబాటులోకి రావడం వల్ల ఆసుపత్రులకు సరైన సమయంలో ఆక్సిజన్ సరఫరా చేయడానికి వీలు కలుగుతుందన్నారు. అదే సమయంలో ప్లాంట్ల నుంచి కూడా రాష్ట్రానికి రావాల్సిన ఆక్సిజన్ ను తీసుకురావడానికి వీలు కలుగుతుండడంతో పాటు స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుందన్నారు. 

నేటి(శనివారం) నుంచి జ్వరాలపై ఇంటింటి సర్వే

రాష్ట్రంలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బంధీ చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. దీనిలో భాగంగా శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇంటింటికీ వెళ్లి జర్వ పీడితులను గుర్తించే సర్వే ప్రారంభకానుందన్నారు. ఇప్పటికే రాష్ట్ర అధికారులు... జిల్లా వైద్యాధికారులు, ఎన్ఎంలు, ఆశాకార్యకర్తలతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఇంటింటి సర్వేపై దిశా నిర్ధేశం చేశారన్నారు. జర్వ పీడితులను గుర్తించి అక్కడికక్కడే మందులు, కరోనా కిట్లు అందజేయనున్నారన్నారు. దీనివల్ల కరోనా కట్టడి చేయడమే గాక, ఆసుపత్రులపై ఒత్తడి కూడా తగ్గునుందన్నారు. 

సాఫీగా వ్యాక్సిన్ల పంపిణీ...

రాష్ట్రంలో వ్యాక్సిన్ సెకండ్ డోస్ ల పంపిణీ సాఫీగా సాగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. టీకా పంపిణీ కేంద్రాల వద్ద రద్దీ లేకుండా తీసుకున్న ఏర్పాట్లు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ల గురించి ఎదురు చూడకుండా, రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేసిన వ్యాక్సిన్లను సెకండ్ డోస్ గడువు ముగియకముందే వేస్తున్నామన్నారు.