ట్రైఏజ్ సెంటర్‌తో మానసిక స్థైర్యం
సర్వజనాస్పత్రిలో కోవిడ్ బాధితులకు ప్రత్యేక ఏర్పాట్లు
*అందుబాటులోకి ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్*
*సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే అనంత*
*ప్రత్యేక షెడ్డు ఏర్పాటు చేసి వసతులకు రూ.లక్ష విరాళం ఇచ్చిన ఎమ్మెల్యే*
*కరోనా బాధితులు ధైర్యంగా ఉండాలని సూచన*
*దాతల స్ఫూర్తి మరెందరికో ఆదర్శనీయం*
*ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ఏర్పాటుకు దాతలు ముందుకురండి*
అనంతపురం, మే 17 (ప్రజా అమరావతి):
అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన ట్రైఏజ్ సెంటర్‌తో కోవిడ్ బాధితులకు మానసిక స్థైర్యం పెరుగుతుందని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, గిల్డ్ ఆఫ్ సర్వీస్ స్కూల్ 1977 ఏడో తరగతి బ్యాచ్ స్టూడెంట్స్, ఆలంబన స్వచ్ఛంద సంస్థ సహకారంతో సర్వజనాస్పత్రిలో ట్రైఏజ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్, సిలిండర్లు, కోవిడ్ బాధితులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ సెంటర్‌ను ఎమ్మెల్యే అనంత సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచమంతా కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో మానవతావాదులు ముందుకు వచ్చి ట్రైఏజ్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వీరి స్ఫూర్తి మరెందరికో ఆదర్శనీయం కావాలన్నారు. ట్రైఏజ్ సెంటర్ వద్ద అదనంగా పడకలు ఏర్పాటు చేయడంతో పాటు ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని హామీ ఇచ్చారు. ట్రైఏజ్ సెంటర్‌లో ప్రత్యేక షెడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. అక్కడ అవసరాల కోసం అదనంగా మరో రూ.లక్ష విరాళాన్ని ప్రకటించారు. నగదును ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు ఎండ్లూరి ప్రభాకర్ కు అందజేశారు. కరోనా బారిన పడిన వారు శ్వాస సమస్యతో సర్వజనాస్పత్రికి వచ్చాక కొంత సమయం వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తుతోందన్నారు. దీన్ని గుర్తించి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఏర్పాటు చేశారని, ఈ యంత్రాల ద్వారా బాధితులకు తక్షణం ఆక్సిజన్ అందించవచ్చన్నారు. కరోనా బాధితులకు ప్రతి ఒక్కరూ ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రోగం కంటే కరోనా అనే భయంతోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో మరణాల రేటు 0.80 మాత్రమేనని, ధైర్యంగా ఉండడం వల్లే కరోనాను ఎదుర్కోవచ్చని చెప్పారు. కోవిడ్ కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు. త్వరలోనే తాడిపత్రి వద్ద 500 పడకల ఆస్పత్రి అందుబాటులోకి తెస్తామన్నారు. కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మరిన్ని ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ఏర్పాటుకు దాతలు ముందుకురావాలని కోరారు. కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా అధ్యక్షుడు, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్, కార్యదర్శి డాక్టర్ భానుమూర్తి, కోశాధికారి డాక్టర్ హేమలత, డాక్టర్ ప్రసాద్, వైఎంఎస్ ప్రసాద్, ఆలంబన జనార్దన్, గిల్డ్ ఆఫ్ సర్వీస్ స్కూల్ 1977 ఏడో తరగతి బ్యాచ్ స్టూడెంట్స్ చవ్వా రాజశేఖరరెడ్డి, గీతాబాల, రమేశ్, రోటరీ క్లబ్ సుధీర్, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావు, ఆర్‌ఎంఓ డాక్టర్ విజయలక్ష్మి, ఈఎన్‌టీ హెచ్‌ఓడీ డాక్టర్ నవీద్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment