రాష్ట్రంలో ఏం జరుగుతుందో బాబుకు తెలియడం లేదు - రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

 


- రాష్ట్రంలో 16 మెడికల్ కళాశాలల శంఖుస్థాపనతో మహాయజ్ఞాన్ని చేపట్టిన సీఎం జగన్మోహనరెడ్డి 

- రాష్ట్రంలో ఏం జరుగుతుందో బాబుకు తెలియడం లేదు 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని 
మచిలీపట్నం, మే 31 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో 16 మెడికల్ కళాశాలల శంఖుస్థాపనతో సీఎం జగన్మోహనరెడ్డి మహాయజ్ఞాన్ని చేపట్టారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు . మచిలీపట్నంలో రూ. 550 కోట్లతో 150 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్న బందరు మైస్సార్ జగనన్న మెడికల్ కళాశాల శంఖుస్థాపన కార్యక్రమాన్ని సోమవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో సీఎం జగన్మోహనరెడ్డి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా ఆంధ్రప్రదేశ్ లో కేవలం 13 మెడికల్ కళాశాలలను మాత్రమే ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తోందన్నారు. జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండేళ్ళలో విద్య , ఆరోగ్య రంగంపై అత్యంత శ్రద్ధ చూపారన్నారు. ఆయా రంగాల్లో మౌలిక వసతులను కల్పించి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను నిర్మిస్తే ప్రతి ఏటా దాదాపు 3 వేల మంది పేద విద్యార్థులకు మెడిసిన్ చదువుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. అతి తక్కువ ఖర్చుతో పిల్లలను చదివించగలిగితే వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకురావచ్చన్నారు. 2023 నాటికి 16 మెడికల్ కళాశాలలను పూర్తిచేయాలనే లక్ష్యంతో సీఎం జగన్ ఉన్నారని, ఇప్పటికే రెండు మెడికల్ కళాశాలల్లో పనులు ప్రారంభమయ్యాయన్నారు. దేశ చరిత్రలోనే ఇంత పెద్దఎత్తున మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడం, నాడు -నేడులో ఆసుపత్రులను అభివృద్ధి చేయడం, విద్యారంగంలో అమ్మ ఒడి, పాఠశాలల అభివృద్ధి వంటి కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ లో చేపట్టడం జరిగిందన్నారు. విద్య, వైద్య రంగాలను రెండు కళ్ళుగా భావించి వాటిని ముందుకు తీసుకువెళ్తున్న సీఎం జగన్మోహనరెడ్డి పట్టుదలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ సారథ్యంలో రాష్ట్రంలో విద్య, ఆరోగ్య రంగాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. కరోనా విపత్తు కారణంగా ఇంటికి పరిమితమైన చంద్రబాబుకు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. చంద్రబాబు ఎప్పుడూ రఘురామకృష్ణంరాజు కాళ్ళపై కొట్టారని, ధూళిపాళ్ళను అరెస్ట్ చేశారని, అచ్చెన్నాయుడును ఈడ్చుకుంటూ తీసుకెళ్ళారని, అక్రమంగా కట్టిన తన ఇంటికి కూల్చివేశారని, మాజీ శాసనసభ్యుడు దోచుకున్న స్థలాలను వెనక్కి లాక్కున్నారని ఇటువంటి వాటి గురించి మాత్రమే మాట్లాడుతున్నాడన్నారు. రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు. సీఎం జగన్మోహనరెడ్డి ప్రజల కోసం ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారు వంటి విషయాలు చంద్రబాబుకు పట్టడం లేదన్నారు. సీఎం జగన్ దెబ్బకు చంద్రబాబుకు పూర్తిగా మైండ్ చెడిపోయి పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నాడన్నారు. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. కాగా మచిలీపట్నం మెడికల్ కళాశాల వర్చువల్ విధానం శంఖుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), వెలంపల్లి శ్రీనివాసరావు , బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, ఎమ్మెల్యేలు జోగి రమేష్, కొలుసు పార్థసారథి, కొక్కిలిగడ్డ రక్షణనిధి, సింహాద్రి రమేష్ బాబు, కైలే అనిల్ కుమార్, ఎం జగన్మోహనరావు, దూలం నాగేశ్వరరావు, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత, బందరు ఆర్డీవో ఖాజావలి తదితరులు పాల్గొన్నారు.