జగన్ రెడ్డి కరోనా వైఫల్యాలను ప్రశ్నిస్తే ఎంపీపై దేశ ద్రోహం కేసా.?

అమరావతి (ప్రజా అమరావతి);

-జగన్ రెడ్డి కరోనా వైఫల్యాలను ప్రశ్నిస్తే ఎంపీపై దేశ ద్రోహం కేసా.?

-ఇది అధికార నేరపూరిత దుర్వినియోగం కాదా.?

-కరోనాపై దృష్టి పెట్టకుండా విమర్శకుల అణచివేతపై సమయం వృధా చేస్తున్న సీఎం

-ప్రజా కోర్టులో, న్యాయ బద్ద కోర్టులోనూ జగన్ రెడ్డి తప్పించుకోలేరు

-రఘురామకృష్ణంరాజు అరెస్ట్.. జగన్ రెడ్డి మూర్ఖత్వానికి నిదర్శనం

-నారా చంద్రబాబు నాయుడు


జగన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రశ్నకు సమాధానం అరెస్ట్.. ప్రశ్నించే గొంతుకకు సంకెళ్లే బహుమానం అనే పరిస్థితి నెలకొంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు కేసులు పెట్టి.. అరెస్టులు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణమరాజును అరెస్టు చేయడం జగన్ రెడ్డి మూర్ఖత్వానికి నిదర్శనం. ప్రజా సమస్యలపై రఘురామ కృష్ణమరాజు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఏకంగా దేశ ద్రోహం కేసు పెట్టి అరెస్టుకు తెరలేపారు.  వై కేటగిరీ భద్రతలో ఉన్న పార్లమెంటు సభ్యుడిని లోక్ సభ స్పీకర్ అనుమతి లేకుండా ఏ విధంగా అరెస్టు చేస్తారు.?

ప్రజల బాగోగుల కంటే.. జగన్ రెడ్డికి కక్ష సాధింపు చర్యలే ముఖ్యమని.. ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించే రఘురామ కృష్ణమరాజును పుట్టిన రోజునాడు సీఐడీ పోలీసులను పంపించి దుర్మార్గమైన సెక్షన్ల కింద కేసు పెట్టి అరెస్టు చేయడంతో స్పష్టమైంది. నాటి ఎమర్జెన్సీ రోజుల్లో, హిట్లర్, గడాఫీ వంటి నియంతల పాలనలో ప్రశ్నించిన వారిని అడ్డగోలుగా అరెస్టు చేసినట్లు.. నేడు రాష్ట్రంలో చట్టం, రాజ్యాంగం అనే వాటిని కనీసం పట్టించుకోకుండా అరెస్టులు చేస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పగ, ప్రతీకారం, కక్ష సాధింపు కోసం వినియోగిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.

టీడీపీ నేతలు దూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీటెక్ రవి మొదలుకొని నేడు ఎంపీ రఘురామకృష్ణమరాజు వంటి వారిపై అక్రమ కేసులు పెట్టేందుకు, అరెస్టులు చేసేందుకు వెచ్చించిన సమయంలో కొంతైనా.. కరోనా నియంత్రణపై పెడితే ఈ రోజు ఇంత మంది ఊపిరి ఆగిపోయేది కాదు. ప్రజలు ఆక్సిజన్ కోసం, మందుల కోసం, వ్యాక్సిన్ కోసం అల్లాడుతుంటే.. ప్రభుత్వం కక్ష సాధింపులపై దృష్టి సారించడం దుర్మార్గం. వైద్యం కోసం హైదరాబాద్ వెళ్తున్న కరోనా రోగుల్ని తెలంగాణ సరిహద్దుల్లో నిలిపివేయడంతో ప్రాణాలు పోతుంటే కనీసం కేసీఆర్తో మాట్లాడని జగన్మోహన్ రెడ్డి.. సీఐడీ పోలీసుల్ని హైదరాబాద్ పంపించి అరెస్టులు చేస్తారా.? ప్రజల ప్రాణాల కంటే.. కక్ష సాధింపు చర్యలే ముఖ్యమా? ప్రశ్నించిన వారిని అరెస్టు చేస్తూ జగన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారు. అమూల్ విషయంలో రైతాంగం హక్కుల గురించి మాట్లాడినందుకు ఏకంగా దేశ ద్రోహం వంటి దుర్మార్గమైన సెక్షన్ల కింద కేసులు పెడుతున్నందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి. ఇప్పటికైనా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మాని ప్రజా క్షేమం గురించి ఆలోచించాలి.

Sd/-

నారా చంద్రబాబు నాయుడు

(టీడీపీ జాతీయ అధ్యక్షులు)