ప్రాధాన్యతలతో అభివృద్ధి దిశగా అడుగులు : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.5 ప్రాధాన్యతలతో అభివృద్ధి దిశగా అడుగులు : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.*కోవిడ్ విపత్తులోనూ ఆంధ్రప్రదేశ్ 1.58శాతం వృద్ధి*


*2030 లక్ష్యంగా మరిన్ని ప్రణాళికలు*


*13 జిల్లాలను కలుపుతూ పారిశ్రామిక కారిడార్లు సహా మౌలిక సదుపాయాల కల్పన*


*మాది ఉత్తుత్తి ఎంఓయూ గవర్నమెంట్ కాదు ప్రాక్టికల్  ప్రభుత్వం*


*రెండేళ్లలో చేసిన అభివృద్ధి ప్రజల ముందు ఉంచాలనే ప్రెస్ కాన్ఫరెన్స్*


*పరిశ్రమలు, ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలలో వృద్ధిపై మీడియాముఖంగా మంత్రి మేకపాటి ప్రజంటేషన్*  


అమరావతి, జూన్, 08 (ప్రజా అమరావతి); అమరావతి: ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం  కరోనా విపత్తు కాలంలోనూ అభివృద్ధి చేసి చూపిందని మంత్రి మేకపాటి గౌతం రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల నుంచి కరోనా విపత్తు విధ్వంసం చేసినా ఆంధ్రప్రదేశ్ 1.58శాతం వృద్ధి సాధించిందని ఆయన స్పష్టం చేశారు. ఏపీఐఐసీ వేదికగా మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించి..ప్రజలకు ఈ రెండేళ్లలో జరిగిన అభివృద్ధి గురించి మంత్రి మేకపాటి ప్రజంటేషన్ ఇచ్చారు.  కోవిడ్‌-19 తో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల జీడీపీ తగ్గిందన్నారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటుగా పారిశ్రామికాభివృద్ధి కూడా అదే స్థాయిలో జరిగినట్లు మంత్రి గౌతంరెడ్డి పేర్కొన్నారు. ముందుచూపుతో ఆలోచించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో 2030 ఏడాది లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఏపీని పారిశ్రామిక రంగంలో అగ్రస్థానంలో నిలబెడతామని గౌతంరెడ్డి వెల్లడించారు. సీఎం జగన్‌ ముందుచూపు వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. పారిశ్రామిక కారిడర్లలో మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. అంతేకాకుండా కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సులభతర విధానాలను  అవలంభిస్తున్నామన్నారు. దేశ ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 10 శాతం వాటా ఉండేందుకు కృషి చేస్తున్నామని మంత్రి మేకపాటి గౌతం రెడ్డి పేర్కొన్నారు.


*5 ప్రాధాన్యతలతో అభివృద్ధివైపు పరుగులు : మంత్రి మేకపాటి*


ఎన్ని ఇబ్బందులున్నా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే మాట తప్పని ముఖ్యమంత్రి వల్ల  సంక్షేమాభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించామని మంత్రి మేకపాటి తెలిపారు. పక్కా ప్రణాళికతో వాస్తవికత, పారదర్శకతతో మొదటి నుంచి అడుగులేస్తూ ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధివైపు పయనిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 5 మేజర్ పోర్టుల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి తెలిపారు. 2023 నాటికి భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తి చేస్తామన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో అమరుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా పేరు పెట్టి ఇటీవలే కర్నూలు జిల్లా ఓర్వకల్ ఎయిర్ పోర్టును ప్రారంభించామన్నారు. ఐ.టీ కి సంబంధించి 3 కాన్సెప్ట్ సిటీల నిర్మాణానికి ప్రణాళికలు

 సిద్ధం చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఆగస్ట్‌లో మరోసారి టెక్స్‌టైల్‌, ఎంఎస్‌ఎంఈలకు బకాయిలు చెల్లిస్తామన్నారు. 65 లార్జ్ , మెగా ఇండస్ట్రీలను ఏర్పాటు చేసి.. 45 వేలమందికి ఉద్యోగాలు అందించగలిగాం. తద్వారా 30 వేల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చాం. ఏపీని పారిశ్రామిక రంగంలో అగ్రస్థానంలో నిలబెడతామన్నారు.  సీఎం జగన్ ముందుచూపు, స్పష్టమైన ఆలోచనల వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. త్వరలో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తిచేస్తామన్నారు.  ఇప్పటికే 2020-21 ఏడాదికిగాను జనవరి, ఫిబ్రవరి నెలల కాలానికి రూ.1032 కోట్ల పెట్టుబడులు

 వచ్చినట్లు మంత్రి వెల్లడించారు. రూ.18000 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రగతిలో ఉన్నాయని మీడియా ముందు వివరించారు. కరోనా సంక్షోభంలో ఎమ్ఎస్ఎమ్ఈలకు ప్రభుత్వం అండగా నిలిచిందని..అలా చేసిన రాష్ట్రం ఏపీ మాత్రమేనని మంత్రి పునరుద్ఘాటించారు.  గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను ఎమ్ఎస్ఎమ్ఈలకు కష్టకాలంలోనూ చెల్లించామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఎమ్ఎస్ఎమ్ఈ క్లస్టర్ల ఏర్పాటు దిశగా ముందుకువెళుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ ముందు వరసలో ఉందని మంత్రి ప్రకటించారు. ఏపీలో రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తక్కువని ఆ దిశగా మరింత సరికొత్త విధానాలను అవలంభిస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలు, దీర్ఘకాలిక ప్రణాళికలతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. ఆక్వా, ఫార్మా, ఖనిజ రంగాల్లో దేశంలోనే మనది అగ్రస్థానమని పేర్కొన్నారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణంపై దృష్టి సారించామని మంత్రి చెప్పారు. జులైలో నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మలివిడతలో మరిన్ని ఫిషింగ్ హార్బర్లు వస్తాయని వివరించారు.  కరోనా సంక్షోభం నెలకొన్నప్పటికీ రెండేళ్ల వ్యవధిలో 14 వేల ఎంఎస్ఎంఈలు స్థాపించామని, తద్వారా రూ.4,300 కోట్ల మేర పెట్టుబడులు సాధించామని తెలిపారు. ఎంఎస్ఎంఈల స్థాపనతో 88 వేల మందికి పైగా ఉపాధి పొందుతున్నారని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో బంగారు గనులకు అనుమతిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. గంగవరం పోర్టు శాశ్వతంగా అదానీ సంస్థకు వెళ్లి పోతుందన్నది జరుగుతున్న ప్రచారం అబద్ధమని మంత్రి మేకపాటి క్లారిటీ ఇచ్చారు. 

గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం అప్పటి నుంచి 50 ఏళ్ళ వరకు ప్రైవేటు భాగస్వామ్య సంస్థకు హక్కులు ఉంటాయని మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు బదులిచ్చారు. పోర్టు ఒప్పంద కాలం పూర్తి అయిన తర్వాత అంటే 36 ఏళ్ల తర్వాత గంగవరం పోర్టు రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో కేవలం  ప్రచార ఆర్భాటాల కోసం పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకున్నారని మంత్రి మేకపాటి అన్నారు. విశాఖ గంగవరం పోర్టులో ప్రమోటర్లు మాత్రమే మారుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడి వాటా ఏమాత్రం మారడంలేదని స్పష్టం చేశారు. పెట్టుబడుల లెక్కలనే చెబుతున్నాం...టీడీపీలా మభ్యపెట్టే ప్రయత్నం చేయటం లేదు. అందుకే ప్రజలకు జవాబుదారీగా ఈ ప్రెస్ మీట్ పెట్టామని మంత్రి తెలిపారు.


*30 స్కిల్ కాలేజీలకు త్వరలోనే శంకుస్థాపన: మంత్రి గౌతమ్ రెడ్డి*


రాష్ట్రంలోని యువతకు స్థానికంగా ఉండే పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. అందుకు అనుగుణంగా పరిశ్రమల్లో పనిచేయడానికి నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలో ఒక నైపుణ్య విశ్వవిద్యాలయంతోపాటు, పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక స్కిల్ కాలేజీ చొప్పున 25, 4 త్రిపుల్ ఐటీలు, పులివెందుల జేఎన్టీయూలో కలిపి మొత్తం 30 స్కిల్ కాలేజీలకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి మేకపాటి గౌతం రెడ్డి స్పష్టం చేశారు.  ఇందుకు సంబంధించిన ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ మొత్తం పూర్తయింది. పరిపాలన అనుమతులు కూడా వచ్చాయని. త్వరలోనే ఈ 30 స్కిల్ కాలేజీల నిర్మాణం ప్రారంభం కానున్నాయని గౌతం రెడ్డి అన్నారు. 


ఒక్కొక్క స్కిల్ కాలేజీలో ఎలాంటి కోర్సులు ఉండాలన్న దానిపై పరిశ్రమలశాఖ, నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్తంగా 'సమగ్ర పరిశ్రమ సర్వే' సగానికిపైగా పూర్తయిందన్నారు. రాబోయే రోజుల్లో అవసరాలను, యువత ఆశయాలను గుర్తించి  పరిశ్రమలకు కావలసిన నైపుణ్యం అందించేందుకు, తద్వారా ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో  అడుగు ముందుకు వేస్తుందని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. 

కరోనా సమయంలోనూ యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను ఆన్ లైన్ ద్వారా అందించడం జరిగిందని.. అందుకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్ఎస్డిసి)కి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు వచ్చిందని  ఈ సందర్భంగా మంత్రి గౌతమ్ రెడ్డి గుర్తు  చేశారు.


*రెండేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న మంత్రి మేకపాటికి సత్కారం*


పరిశ్రమలు, ఐ.టీ శాఖ మంత్రిగా గౌతమ్ రెడ్డి  ప్రమాణ స్వీకారం చేసి జూన్ 8 నాటికి  విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా సత్కరించారు. శాలువా కప్పి, పూల బొకే ఇచ్చి అభినందనలు తెలిపారు. పరిశ్రమల శాఖ మంత్రిగా గౌతమ్ రెడ్డి మెరుగైన పనితీరు కనబర్చారని రోజా కొనియాడారు. ఈ సందర్భంగా రోజాకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఏపీఐఐసీ ఛైర్మన్ ని రోజాను శాలువాతో సత్కరించి ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది అభినందనలు తెలిపారు.


ఈ సమావేశంలో ఐ.టీ శాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి, ఏపీఐఐసీ ఎండీ , పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్  చల్లా మధుసూదన్ రెడ్డి, ఎమ్ఎస్ఎమ్ఈ సీఈవో పవనమూర్తి, , యాప్కో ఛైర్మన్ మోహనరావు, పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్, సంబంధిత ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారుComments