అన్ని జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులకు ఆర్‌డబ్ల్యుఎస్‌ ద్వారా నీటి వసతి

 

అమరావతి (ప్రజా అమరావతి);


*- తాడేపల్లిలోని సిపిఆర్ కార్యాలయంలో జల్‌జీవన్ మిషన్‌పై ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇంజనీరింగ్ అధికారులతో వర్క్‌షాప్*

*- వర్క్‌షాప్‌ను ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి*

*- ఆర్‌డబ్ల్యుఎస్‌ టెక్నికల్ హ్యాండ్‌బుక్‌ను ఆవిష్కరించిన మంత్రి*

*- అన్ని జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులకు ఆర్‌డబ్ల్యుఎస్‌ ద్వారా నీటి వసతి*

*- 2024 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్*

*- జల్‌జీవన్ మిషన్ ద్వారా ఈ ఏడాది రూ.7251 కోట్లతో పనులు*

*- వాటర్ గ్రిడ్‌తో మంచినీటి సమస్యకు పూర్తిస్థాయిలో చెక్*


*: మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి*


రాష్ట్రంలో 2024 నాటికి ప్రతి ఇంటికి మంచినీటి కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కమిషనర్ కార్యాలయంలో ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇంజనీరింగ్ అధికారులతో జల్‌జీవన్ మిషన్‌పై ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్‌డబ్ల్యుస్‌ టెక్నికల్ హ్యాండ్ బుక్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఏడాది నుంచి ప్రారంభించి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 47శాతం గృహాలకు ఇంటింటి కుళాయి కనెక్షన్ ఇవ్వగలిగామని, ఇదే స్పూర్తితో రానున్న రెండేళ్ళలో అనుకున్న లక్ష్యాల మేరకు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది జల్‌జీవన్ మిషన్ ద్వారా రూ.7251 కోట్ల రూపాయల నిధులతో పనులను చేపట్టాల్సి ఉందని, ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులపై ఉందని అన్నారు. కేంద్రం ద్వారా వస్తున్న నిధులు, రాష్ట్రప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా వాటర్ గ్రిడ్ ప్రణాళిక ప్రకారం పనులను ముమ్మరం చేయాలని అన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 83 శాతం ఇంటింటి కుళాయి కనెక్షన్‌లు ఇవ్వాలనేది లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ మేరకు అధికారులు సకాలంలో టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించాలని సూచించారు. ఈ ఏడాది విజయనగరం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు, 2023 మార్చి నాటికి విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణ, అనంతపురం, కర్నూలు, 2024 మార్చి నాటికి శ్రీకాకుళం, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్‌లు అందించాలనే ప్రణాళికతో ప్రభుత్వం ముందకు పోతోందని వెల్లడించారు. 


*జగనన్న కాలనీల్లో నీటి వసతికి అత్యంత ప్రాధాన్యం*

దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒకేసారి 30 లక్షలకు పైగా పేదలకు పట్టాలు ఇవ్వడం, తొలిదశలో ఏకంగా15 లక్షలకు పైగా పక్కాగృహాల నిర్మాణంకు సీఎం శ్రీ వైయస్ జగన్ శ్రీకారం చుట్టారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు పక్కాగృహాల నిర్మాణంకు అవసరమైన నీటి వనతిని కల్పించాల్సిన బాధ్యత ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులదేనని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8 వేల జగనన్న కాలనీల లేఅవుట్లు ఉన్నాయని, వాటిలో ఇప్పటి వరకు 3772 లేఅవుట్స్‌కు నీటి సదుపాయం కల్పించారని అన్నారు. మిగిలిన లేఅవుట్స్‌కు కూడా తక్షణం నీటి సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది నుంచి రాష్ట్రంలో గృహనిర్మాణ పనులు వేగవంతం అవుతున్న నేపథ్యంలో  పేదల కాలనీలకు నీటి సదుపాయం ఉండేనే నిర్మాణం సాధ్యమవుతుందని, దీనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. జగనన్న కాలనీల్లో నీటి సదుపాయం కోసం చేసే పనులకు బిల్లుల చెల్లింపుల్లో ఎటువంటి జాప్యం ఉండదని తెలిపారు. ఇంజనీరింగ్ అధికారులు పనులను ముమ్మరం చేయాలని కోరారు.


*ఇకపై ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేసే పరిస్థితి ఉండకూడదు*

వాటర్ గ్రిడ్ ద్వారా జల్‌జీవన్ మిషన్ తో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తాగునీటి కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇప్పటికే వేసవిలో తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న ప్రాంతాలు, హ్యాబిటేషన్‌లపై ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శ్రీకాకుళం ఉద్దానం ప్రాంతంలో రూ.700 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ కింద తాగునీటి కల్పనకు చర్యలు చేపట్టామని అన్నారు. కడపజిల్లా పులివెందుల ప్రాంతంలో వాటర్ గ్రిడ్ కింద రూ.480 కోట్లతో, కర్నూలులోని డ్రోన్ ప్రాంతంలో రూ.297 కోట్లతో వాటర్ గ్రిడ్ కింద తాగునీటిని అందించనున్నామని అన్నారు. నాబార్డ్ నిధులతో తూర్పు గోదావరిజిల్లాలోని 15 నియోజకవర్గాలకు రూ.2400 కోట్లు, పశ్చిమ గోదావరిజిల్లాలోని 12 నియోజవకర్గాలకు రూ.1850 కోట్లు, కృష్ణాజిల్లాలో రెండు నియోజకవర్గాల్లో రూ.826 కోట్లు, గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలోని అయిదు నియోజకవర్గాలకు రూ.1600 కోట్లు, ప్రకాశం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో రూ.1640 కోట్లు, చిత్తూరు జిల్లాలోని అయిదు నియోజకవర్గాలకు రూ.2900 కోట్లతో తాగునీటి సదుపాయం కల్పించేందుకు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు గత ఏడాది నుంచి వర్షాలు అధికంగా పడుతుండటం వల్ల భూగర్భజలాలు పెరిగాయని, డార్క్‌ ప్రాంతాలను కూడా చాలా వరకు నిపుణులు తొలగించడం జరిగిందని అన్నారు. గత ఏడాది ట్యాంకర్ల ద్వారా నీటిని అందించిన ప్రాంతాల్లోఇప్పటికే తాగునీటి పథకాల పనులు జరుగతున్నామని, వాటిని ఈ ఏడాది వేసవి కంటేముందుగానే పూర్తి చేయాలని కోరారు. ఒకపై ఏ ఒక్క ప్రాంతానికి కూడా ట్యాంకర్ల ద్వారా నీటిని అందించే పరిస్థితి ఉండకూడదని, అందుకు జిల్లాస్థాయిలో ఎస్‌ఇ, ఇఇలు బాధ్యత తీసుకోవాలని అన్నారు. 


*జల్‌జీవన్ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు*

జల్‌జీవన్ మిషన్ ద్వారా ఈ ఏడాది చేపట్టాల్సిన పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, బాధ్యులైన ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తప్పవని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. నిధులు అందుబాటులో ఉన్నా పనులు ఎందుకు వేగంగా సాగడం లేదని అధికారులను నిలదీశారు. ఈ ఏడాది జల్‌జీవన్ మిషన్ ద్వారా 7251.72 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని, దానికి తగిన ప్రణాళికతో అధికారులు కార్యచరణను చూపించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు జిల్లాల్లో పనుల కోసం టెండర్లు పిలిచి, వాటిని ప్రారంభించడంలో జరుగుతున్న జాప్యం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. టెండర్లు ఖరారైన కాలానికి, పనులు జరిగే కాలానికి మధ్య పెరుగుతున్న డీజిల్, స్టీల్, సిమెంట్ ధరల వల్ల కాంట్రాక్టర్లు పనులను చేపట్టేందుకు ముందుకు రావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతోందని అసహనం వ్యక్తం చేశారు. పనుల విషయంలో తలెత్తే సమస్యలపై గ్రామస్థాయిలో సర్పంచ్‌లు, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల సహకారం తీసుకోని, వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి జల్‌జీవన్ మిషన్, వాటర్ గ్రిడ్, జగనన్న కాలనీలకు నీటి వసతి పనులపై సమగ్ర పరిశీలన జరుగుతుందని, ఉదాసీనంగా వ్యవహరించే అధికారులను బాధ్యులుగా చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

ఈ వర్క్‌షాప్‌లో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇఎన్‌సి కృష్ణారెడ్డి, 13 జిల్లాల ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Comments