- మంత్రి కొడాలి నానిపై నమ్మకంతో అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు దూరం
- మున్సిపల్ కమిషనర్‌కు రాతపూర్వకంగా తెలియజేశాం
- మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ గౌరవాధ్యక్షుడు అద్దేపల్లి
గుడివాడ, జూన్ 14 (ప్రజా అమరావతి): రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పై నమ్మకంతో గుడివాడ మున్సిపాలిటీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు సమ్మెకు దూరంగా ఉన్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సీఐటీయూ) పిలుపు మేరకు ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించాల్సిన ధర్నా కార్యక్రమాలను కార్మికులు విరమించుకున్నారు. ఒక దశలో మున్సిపల్ వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నట్టు మున్సిపల్ కమిషనర్ కు రాతపూర్వకంగా తెలియజేసినప్పటికీ చివరి నిమిషంలో విధులకు హాజరుకావడం జరిగింది. కరోనా విపత్తు నేపథ్యంలో ప్రాణ రక్షణకు అవసరమైన రక్షణ పరిరకాలు, మెరుగైన వైద్యం అందించాలని, హెల్త్ అలవెన్స్, జీతాల బకాయిలను వెంటనే చెల్లించాలని, ఈపీఎఫ్, ఈఎస్ఎ బకాయిలను కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని, ఇంజనీరింగ్ కార్మికులు, స్కూల్ స్వీపర్లకు జీతాలు పెంచాలని, ఆప్కాస్ వద్దు - పర్మినెంట్ కావాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త సమ్మెను చేపట్టారు. ఈ సందర్భంగా గుడివాడ మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు అద్దేపల్లి పురుషోత్తం మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి రెండు రోజుల సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. గుడివాడ మున్సిపాలిటీలో 199 మంది కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నారని తెలిపారు. తమ యూనియన్ పరిధిలోని కార్మికులు 175 మంది ఉన్నారని, వీరంతా సమ్మెలో పాల్గొనడం లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న రాష్ట్ర పౌరసరఫరాలు, వినియగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పై యూనియన్‌కు పూర్తి నమ్మకం ఉందన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహనరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. గుడివాడలో కూడా మంత్రి కొడాలి నాని దృష్టికి ఏ సమస్య తీసుకువెళ్ళినా వెంటనే స్పందించి పరిష్కారానికి కృషి చేస్తున్నారని చెప్పారు. సమ్మె చేయడం వల్ల కార్మికులందరికీ ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయో వాటన్నింటినీ గుడివాడ మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులకు వర్తింపజేసేలా మంత్రి కొడాలి నాని పూర్తి బాధ్యత తీసుకుంటారన్న విశ్వాసంతో ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోందని, ఈ సమయంలో సమ్మె చేయడం వల్ల అధికారులు, పట్టణ ప్రజలు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందన్నారు. ఈ ఉద్దేశ్యంతో గుడివాడ మున్సిపాలిటీలో సమ్మెను విరమించుకుంటున్నామని, ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ పీజే సంపత్ కుమార్‌కు రాతపూర్వకంగా తెలియజేశామన్నారు. అధికారులు కూడా కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు. అలాగే తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని అద్దేపల్లి కోరారు. ఈ కార్యక్రమంలో గుడివాడ మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు గుళ్ళపల్లి శ్రీను, ధనాల బుజ్జి, కగ్గా దుర్గారావు, ఆనంద్, ఆర్ కేశవ, ఎం రాజేష్, సీహెచ్ రాజేష్, జీ ఆంజనేయులు, జీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment