కొవిడ్ తో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ

 ఏపీ కొవిడ్ కమాండ్ కంట్రోల్ (ప్రజా అమరావతి);
కొవిడ్ తో మరణించిన  ఉద్యోగుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా

# ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ


# డాక్టర్ కు రూ.25 లక్షలు,

స్టాఫ్ నర్సుకు రూ.20 లక్షలు, ఎఫ్‌ఎస్‌ఓ/ ఎమ్‌ఎస్‌ఓలకు రూ.15 లక్షలు, ఇతర వైద్య సిబ్బందికి రూ.10 లక్షలుకొవిడ్ తో మరణించిన  వైద్యులు, సిబ్బంది కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాను   ప్రకటించడం ద్వారా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఏపీ ప్రభుత్వం భరోసానిచ్చింది.

ఈమేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్‌ విధి నిర్వహణలో మృతి చెందిన వైద్యుని కుటుంబానికి రూ.25 లక్షలు,  స్టాఫ్‌ నర్సుకు రూ.20 లక్షలు, ఎఫ్‌ఎస్‌ఓ/ఎమ్‌ఎస్‌ఓలకు రూ.15 లక్షలు, ఇతర వైద్య సిబ్బంది మృతి చెందితే రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం చెల్లించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్  (పిఎంజికె) పథకానికి అదనంగా ఈ ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు ఉత్తర్వులలో సింఘాల్ పేర్కొన్నారు. తక్షణమే ఎక్స్‌గ్రేషియా అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. కొవిడ్ నిర్వహణలో భాగంగా కొవిడ్ ఆసుపత్రులు , కొవిడ్ కేర్ సెంటర్లలో పనిచేసే డాక్టర్లు, సిబ్బంది అలాగే కొవిడ్ పాజిటివ్ ఉన్న ఇళ్లను సందర్శించే సిబ్బంది మరణిస్తే వారివారి కుటుంబాలు ఎక్స్ గ్రేషియాను పొందడానికి అర్హులవుతారు. మరే ఇతర పథకాల ద్వారా గానీ , ఇన్సూరెన్స్ ద్వారా గానీ లబ్ది పొందే వారు కూడా ఎక్స్ గ్రేషియా పొందేందుకు అర్హులేనని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం వెయిట్ చేస్తున్న ఉద్యోగులు కూడా ఎక్స్ గ్రేషియా ను పొందేందుకు అర్హులు. కొవిడ్ పాజిటివ్ సర్టిఫికెట్ తో పాటు , కొవిడ్ తో మరణించినట్లు ధృవీకరణ పత్రం సమర్పించాలి. సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించాక ఎక్స్ గ్రేషియాను ఆయా జిల్లాల కలెక్టర్లు మంజూరు చేస్తారు.