జగనన్న పథకాలే మహిళలకు శ్రీరామ రక్షః మంత్రి తానేటి వనిత.


కొవ్వూరు- పశ్చిమ గోదావరి జిల్లా (ప్రజా అమరావతి)!


జగనన్న పథకాలే మహిళలకు శ్రీరామ రక్షః మంత్రి తానేటి వనిత.


*స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి తానేటి వనిత ప్రెస్ మీట్ పాయింట్స్..*


*- డ్వాక్రా మహిళల్ని చంద్రబాబు ఎందుకు మోసం చేశారు అని నిలదీయాలి*


*- టీడీపీ ప్రభుత్వంలో మహిళల అభివృద్ధి కోసం ఏం చేశారు..?*


*- జగనన్న పరిపాలనలో ప్రతి పథకంలో మహిళలకు పెద్ద పీట*


*- జగనన్న ప్రభుత్వంలో అమ్మఒడి నుంచి ఆసరా, చేయూత వరకు ఒక్కో మహిళకు లక్షల్లో లబ్ధి జరుగుతుంది*


*- మహిళలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు*


*- టీడీపీ హయాంలో మహిళలపై లెక్కలేనన్ని ఘటనలు జరిగినా.. దిశ లాంటి చట్టాన్ని ఎందుకు తేలేకపోయారు..?*


*- టీడీపీ హయాంలో ఏ ఒక్కరికైనా ఇళ్ళ స్థలాలు ఇచ్చారా..?.. జగనన్న 31 లక్షల మంది మహిళలకు రూపాయికే ఇళ్ళు ఇస్తున్నారు*


*శ్రీమతి తానేటి వనిత మాట్లాడుతూ ఏమన్నారంటే..*


1. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళలకు మేలు జరిగే విధంగా రూపకల్పన చేసి, మహిళలు బాగుంటేనే వారి ఇల్లు బాగుంటుందని, తద్వారా సమాజం, రాష్ట్రం బాగుంటుందని నమ్మి జగన్ మోహన్ రెడ్డిగారు ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాల ద్వారా వేల కోట్ల రూపాయలను నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. మహిళా సాధికారత కోసం ఇంత చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారిని అభినందించకపోయినా ఫర్వాలేదు గానీ, తెలుగు మహిళల పేరుతో పనీపాట లేని పది మంది మహిళలు పోగై, ఒక జూమ్ మీటింగ్ పెట్టుకుని మహిళలకు చేసింది ఏమిటి.. అంటూ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు. మహిళలకు అన్నివిధాలా అండగా ఉన్న ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే మహిళలుగా మనల్ని మనం అవమానించుకోవడమే.


2. ఈరోజు దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో రూ. 51 వేల కోట్లతో 31 లక్షల మందికి ఒకేసారి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం జరిగింది. 15.60 లక్షల ఇళ్ళకు భూమి పూజ జరిగింది. మహిళ పేరుతోనే ఇళ్ళు రాబోతున్నాయి. ఒక్క రూపాయి కడితే పక్కా ఇళ్ళు మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వంలో మాదిరిగా ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు. ఎవరి సిఫార్సులు అవసరం లేదు. గతంలో టిడ్కో ఇళ్ళ నిర్మాణం పేరుతో లబ్ధి దారుల దగ్గర నుంచి స్థానిక టీడీపీ నేతలు ఏ విధంగా కమీషన్లు గుంజారో చూశాం. టిడ్కో ఇళ్ళను అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా టీడీపీ ప్రభుత్వం మార్చింది. ఈ ప్రభుత్వం హయాంలో లబ్ధిదారుడికి ఏదైనా సంక్షేమ పథకం అందించాలంటే.. మా వాలంటీరే నేరుగా అర్హుదారులను గుర్తించి పథకాలు అమలు చేస్తున్నారు. 


3. టీడీపీ ప్రభుత్వం హయాంలో జన్మభూమి కమిటీలు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. పచ్చ కండువా ఉంటేనే పథకాలు అమలు చేసేవారు. తమ వారికి, తమ పార్టీ వారికే పథకాలు అందేలా చూశారు. ఈరోజు కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీలు చూడకుండా అగ్రవర్ణాల్లోని పేదలకు సైతం సంక్షేమ పథకాలను అందిస్తూ నిజాయితీగా పరిపాలన అందిస్తుంటే విమర్శలు చేయడానికి సిగ్గు ఎక్కడ లేదు అని ప్రశ్నిస్తున్నాం. 


4. జగనన్న పరిపాలనలో అమ్మ ఒడి నుంచి ఆసరా, చేయూత వరకు పలు సంక్షేమ పథకాల ద్వారా ఒక్కో మహిళ లక్షల్లో లబ్ధి పొందుతున్నారు. లబ్ధి పొందిన మహిళలు మాటలు విన్నప్పుడు హృదయం ఉన్న ఎవరైనా కళ్ళు చెమర్చే పరిస్థితి. కరోనా కష్టకాలంలోనూ, మహిళలు బాధల్లో ఉన్నప్పుడు, సొంత కుటుంబ సభ్యులే అండగా లేనప్పుడు ముఖ్యమంత్రి జగన్ గారు అమలు చేస్తున్న పథకాలే వారికి భరోసాగా నిలుస్తున్నాయి. జగనన్న అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలే మహిళలకు శ్రీరామ రక్షగా నిలిచాయి. 


5. జగనన్న పరిపాలనలో ప్రతి పథకంలో మహిళలకు పెద్ద పీట వేశారు. అగ్రతాంబూలం మహిళలకే దక్కింది. ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) ద్వారా ఆయా సంక్షేమ పథకాల వల్ల దాదాపు రూ. 57 వేల కోట్లు మహిళల అకౌంట్లలో నేరుగా జమ అయ్యాయి. పరోక్షంగా మరో రూ. 31 వేల కోట్లు లబ్ధి జరిగింది. అంటే మొత్తం 88 వేల కోట్ల రూపాయలు కేవలం రెండేళ్ళలోనే మహిళలకు లబ్ధి జరిగింది. 


6. రాష్ట్ర చరిత్రలో చూసినా.. మహిళలకు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడూ రాలేదు.  మేనిఫెస్టోలో ఏవైతే చెప్పామో... వాటిని నూటికి నూరు శాతం అమలు చేస్తున్నాం. మాట ఇస్తే.. నిలబడే ప్రభుత్వం ఇది. మాట ఇచ్చి మోసం చేసే గుణం చంద్రబాబుది, గత టీడీపీ ప్రభుత్వానిది. 

- డ్వాక్రా మహిళల్ని ఎందుకు మోసం చేశారు.. మహిళల్ని ఎందుకు మోసం చేశారు.. అని మహిళలు చంద్రబాబు, టీడీపీ నేతల్ని నిలదీయాలి. 


7. గత టీడీపీ ప్రభుత్వంలో మహిళల అభివృద్ధి కోసం ఏం చేశారు..? భద్రత, భరోసా అని డైలాగులు చేసి, మహిళల్ని అన్నివిధాలా మోసం చేశారు. 2014 ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక, వడ్డీలు, చక్రవడ్డీలు వసూలు చేసి మహిళల్ని దారుణంంగా మోసం చేశారు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని మీ ఇంటికే తెచ్చి ఇస్తానని కల్లబొల్లి కబుర్లతో చంద్రబాబు వంచించారు.  ఈ విషయాలన్నీ టీడీపీ మహిళలు మరిచిపోయారేమోగానీ, డ్వాక్రా మహిళలు మరిచిపోలేదు. అందుకే 2019 ఎన్నికల్లో జగనన్నకు 151 సీట్లు ఇచ్చి, టీడీపీని 23 సీట్లకు పరిమితం చేసి మూలన కూర్చో బెట్టారు.


8. రాష్ట్రంలో జగనన్న పరిపాలనలో మహిళలకు లభిస్తున్న భద్రత, భరోసా మరే రాష్ట్రంలో లేదు. దేశంలో ఎక్కడా లేని అమ్మ ఒడి పథకాన్ని రూపకల్పన చేసి, బిడ్డల్ని బడికి పంపించే తల్లుల ఖాతాల్లోనే నేరుగా డబ్బులు వేస్తున్నారు. తద్వారా తమ బిడ్డల్ని మంచిగా చదివించే బాధ్యతను మహిళలకే కట్టబెట్టారు. డ్వాక్రా రుణాలపై జీరో వడ్డీని అమలు చేస్తున్నారు . ఆసరా పథకం ద్వారా డ్వాక్రా రుణ మాఫీ చేసే కార్యక్రమం అమలు చేస్తున్నారు. చేయూత పథకం ద్వారా మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా చేస్తున్నాం. 


9. పక్క రాష్ట్రంలో జరిగిన ఒక ఘటనను చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు దిశ చట్టాన్ని తెచ్చారు. కేంద్రం చట్టం చేయకపోయినా.. 13 జిల్లాల్లో దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి, దర్యాప్తులు త్వరితగతిన పూర్తి చేసి మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తున్నాం. 

- టీడీపీ హయాంలో మహిళలపై లెక్కలేనన్ని ఘటనలు జరిగినా.. ఎందుకు ఇటువంటి చట్టాన్ని తీసుకురాలేదు..?

- 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఏం చేశారు..? ఈ తెలుగు మహిళలంతా అప్పుడు ఎందుకు చంద్రబాబును నిలదీయలేకపోయారు...?

- రైతులు, మహిళలు, శ్రామికులు, రైతుల పక్షాన నిలబడ్డ ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. 


10. ఒక దళిత మహిళను హోం మంత్రిని, గిరిజన మహిళను డిప్యూటీ సీఎం చేసిన ఘనత జగన్ గారిదే. ఆయన అడుగుజాడల్లో నడవటానికి, ఆయన నాయకత్వంలో పనిచేయడానికి మహిళలుగా చాలా గర్వపడుతున్నాం. ఒక మాట చెబితే.. నెరవేర్చే వరకు జగన్ మోహన్ రెడ్డిగారు విశ్రమించరు. కోరనా కష్టకాలంలోనూ చెప్పిన ప్రతి హామీని,  చెప్పిన సమయానికే చేసే ఏకైక ముఖ్యమంత్రి జగన్ గారు.


11. వాస్తవానికి, 25 లక్షల ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్పి.. ఈరోజు 31 లక్షలు ఇచ్చాం. టీడీపీ హయాంలో ఏ ఒక్కరికైనా ఇళ్ళ స్థలాలు ఇచ్చారా.. ? పూర్తిగా ఉచితంగా, మహిళల పేరుతో ఇస్తున్నాం. మహిళామణులకు సమాజంలో, కుటుంబంలో గౌరవం దక్కేలా జగన్ గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు.

- ఇంత చక్కటి పాలన అందిస్తుంటే.. పాలుపోక, పనిపాటలేకుండా, జూమ్ మీటింగ్ లు ఏర్పాటు చేసుకుని ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమత్రిగారిని అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ గారిని విమర్శించే అర్హత వీళ్ళకు లేదు. 


12. జగన్ మోహన్ రెడ్డిగారి పరిపాలనలో మహిళలు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. దివంగత రాజశేఖరరెడ్డిగారు మహిళలంతా లక్షాధికారులను చేయాలని ఏ విధంగా కోరుకున్నారో.. ఈరోజు జగన్ మోహన్ రెడ్డిగారి పాలనలో అది నెరవేరుతుంది. మహిళల్ని లక్షాధికారుల్ని చేస్తున్నారు. 


13.  భారతదేశంలో మహిళలు ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్న రాష్ట్రాల్లో కూడా మహిళలకు ఇన్ని సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. మహిళలంతా ఈరోజు జగనన్నకు జేజేలు పలుకుతున్నారు. మళ్ళీ మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు.

Popular posts
స్నేహితులకి ఒకేసారి మోకాలు ఆపరేషన్ చేసిన డాక్టర్ జగదీష్
Image
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా సురేష్ గారిని కలిసిన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు
Image
గుంటూరు మెడికల్ కాలేజీ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల ఆవరణలో పైలాన్ను ఆవిష్కరణ.
Image
యువత తలచుకుంటే ఆకాశం హద్దు కాదు..సముద్రం లోతూ కాదు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image
.ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాతృమూర్తి సింహాద్రి భారతమ్మకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఘనంగా నివాళులర్పించారు
Image