రాష్ట్రంలో కోటి మందికిపైగా వ్యాక్సిన్

 రాష్ట్రంలో కోటి మందికిపైగా వ్యాక్సిన్


రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్

అందులో 25,35,189 మందికి రెండు డోసులు

50,12,270 మందికి మొదటి డోసు వేశాం...

సీనియర్ రెసిడెంట్ వైద్యుల స్టయిఫండ్ రూ.70 వేలకు పెంపు

విదేశాలకు వెళ్లే 45 ఏళ్లలోపు విద్యార్థులకు, ఉద్యోగులకు కూడా టీకా

ఆధార్ కు బదులు పాస్  పోర్టు నెంబర్ జతజేయాలి : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి

అమరావతి, జూన్ 2 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో నేటి వరకూ కోటీ మందికి పైగా కొవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు, ఉద్యోగులకు వయస్సుతో సంబంధం లేకుండా వ్యాక్సిన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వాళ్లు ఆధార్ నెంబర్ కు బదులు పాస్ పోర్టు నెంబర్ ను కొవిడ్ అప్లికేషన్లో నమోదు చేసి, వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. సీనియర్ రెసిడెంట్ వైద్యుల స్టయిఫండ్ ను రూ.45 వేల నుంచి రూ.75 వేలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో 98,048 శాంపిళ్లు పరీక్షించగా, 12,768 కరోనా కేసులు నమోదయ్యాయని, 98 మంది మృతి చెందారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,070 ఐసీయూ బెడ్లు ఉండగా, వాటిలో 4,488 బెడ్లలో రోగులు చికిత్సపొందుతుండగా,1,582 ఖాళీగా ఉన్నాయన్నారు. 7,270 ఆక్సిజన్ బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. 16,065 సాధారణ బెడ్లకుగానూ 4,357 బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో 14,472 మంది చికిత్స పొందుతున్నారన్నారు. గడిచిన 24 గంటల్లో 1,613 మంది డిశ్చార్జికాగా, 1,131 మంది చికిత్స కోసం కొవిడ్ కేర్ సెంటర్లలో చేరారన్నారు. రోజువారీగా పరిశీలిస్తే 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను ఏపీకి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తోందన్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో గడిచిన 24 గంటల్లో 443 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ డ్రా చేసినట్లు ఆయన తెలిపారు. 104 కాల్ సెంటర్ కు 3,838 ఫోన్ కాల్స్ రాగా, 1,744 వివిధ సమాచారాల కోసం ఫోన్లు వచ్చాయన్నారు. కరోనా టెస్టులకు  942 ఫోన్లు, ఫలితాలకు 420 ఫోన్లు, ఆసుపత్రుల్లో అడ్మిషన్లకు 575 కాల్స్ వచ్చాయన్నారు. హోం ఐసోలేషన్ లో 21,742 మంది చికిత్సపొందుతున్నారన్నారు. వారిలో 20,817 మందికి కాల్ సెంటర్ ద్వారా 4800 మంది వైద్యులు ఫోన్లు చేసి... ఆరోగ్య స్థితిగతులు తెలుసుకుని సలహాలు సూచనలు అందజేశారన్నారు. 

రాష్ట్రంలో కోటి మందికిపైగా కొవిడ్ టీకా...

మంగళవారం(1.6.2021) నాటికి రాష్ట్రంలో కోటి మందికి పైగా టీకాలు వేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళవారం సాయంత్రానికి కోటీ 82 వేల 648 డోసులు వేశామన్నారు. అందులో 25,35,189 మందికి రెండు డోసులు, 50,12,270 మందికి మొదటి డోసు వేశామన్నారు. మంగళవారం సాయంత్రానికి కొవిషీల్డ్ 90,470 డోసులు, కొవాగ్జిన్ 1,58,530 డోసులు ఉన్నాయన్నారు. బుధవారం(జూన్ 2 తేదీ) సాయంత్రానికి కొవిషీల్డ్ డోసులు పంపిణీ పూర్తయిపోతుందన్నారు. జూన్ 30 లోగా 3,33,270 మందికి కొవాగ్జిన్ సెకండ్ డోసు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇప్పటికే 17,036 మంది కి సెంకడ్ డోసు ఇచ్చామని, ఇంకా 3,16,234 మందికి సెకండ్ డోసు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 ఏళ్లు పైడి ఉన్నవారు కోటీ 33 లక్షల 7 వేల 889 మంది ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ నెల 15వ తేదీలోగా 8,76,870 డోసులు రానున్నాయన్నారు.   

విదేశాలకెళ్లే విద్యార్థులకు, ఉద్యోగులకు వ్యాక్సినేషన్

45 ఏళ్లలోపు ఉన్నా విదేశాలకు వెళ్లే విద్యార్థులకు, ఉద్యోగులకు వ్యాక్సిన్ వేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లను మార్గదర్శకాలు జారీచేశామన్నారు. విదేశాలకు వెళ్లేవారు ఆధార కార్డుకు బదులు పాస్ పోర్టు నెంబర్ ను కొవిన్ అప్లికేషన్ లో పొందుపరుచుకోవాలని సూచించారు. విదేశాల్లో పాస్ పోర్టుకు జతజేసిన వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను మాత్రమే అనుమతిస్తున్నారన్నారు. దీనివల్ల ఆధార్ నెంబర్ తో వ్యాక్సిన్ తీసుకున్న వారు అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయా జిల్లా కలెక్టర్లు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. ప్రస్తుతమున్న నిబంధనల దృష్ట్యా పాస్ పోర్టు నెంబర్ జతజేసి రివైజ్డ్ సర్టిఫికెట్ ఇవ్వడానికి అవకాశం లేదన్నారు. ఇదే విషయం కేంద్ర వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శితో చర్చించామని, కొవిన్ వ్యాక్సిన్ అప్లికేషన్ లో పాస్ పోర్టు నెంబర్  ను జతచేసేలా మార్పులు చేయాలని కోరామని తెలిపారు. కేంద్రం అందుకు అంగీకరించిన వెంటనే పాస్ పోర్టు జతచేసిన వ్యాక్సిన్ సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. 

సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల స్టయిఫండ్ పెంపు

సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకిచ్చే స్టయిఫండ్ ను రూ.45 వేల నుంచి రూ.70 వేలకు పెంచుతూ రాష్ట్ర్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందున్నారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, పీజీ ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ విద్యార్థులు తమకిచ్చే స్టయిఫండ్ ను పెంచాలని కోరారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించామని తెలిపారు 350 మంది సీనియర్ రెసిడెంట్ డాక్డర్లు గత ఏడాది సెప్టెంబర్ లో విధుల్లోకి చేరారన్నారు. 800 పీజీ విద్యార్థుల వినతులపై చర్చించి వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కొవిడ్ సమీక్షా సమావేశాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నిర్వహించనున్నారని తెలిపారు.