ఇకపై ఇసుక తవ్వకాలకు ఈ-పర్మిట్

 

అమరావతి (ప్రజా అమరావతి);


- ఇకపై ఇసుక తవ్వకాలకు ఈ-పర్మిట్


- మరింత పారదర్శకత కోసం చర్యలు

- రీచ్‌ల వారీగా జేపీ సంస్థ ఇసుక తవ్వకాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి

- డిఎంజి కార్యాలయం నుంచి ఈ పర్మిట్ జారీ

-  దీంతో జవాబుదారీతనం మరింత పెరుగుతుంది

- ఇందుకోసం సాఫ్ట్ వేర్‌ను సిద్దం చేసిన మైనింగ్ శాఖ


: డిఎంజి విజి వెంకటరెడ్డి


ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలకు ఈ పర్మిట్ తప్పనిసరి చేస్తూ, ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్‌ను సిద్దం చేసినట్లు భూగర్భ గనులశాఖ సంచాలకులు (డిఎంజి) విజి వెంకటరెడ్డి తెలిపారు. ప్రైవేటు వ్యక్తులకు ఇసుక తవ్వకాలను అప్పగించే క్రమంలో టెండర్లను దక్కించుకున్న జేపీ పవర్ వెంచర్స్‌తో జరిగిన అగ్రిమెంట్‌లోనే ఈ మేరకు అంగీకారం జరిగిందని వెల్లడించారు. ఇసుకకు ఈ పర్మిట్‌ కోసం మైనింగ్ డిపార్ట్‌మెంట్ ద్వారా సాఫ్ట్‌వేర్‌ను సిద్దం చేశామని, దానిని ఇప్పుడు అమలులోకి తీసుకువస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు ఇతర మినరల్స్‌కు అనుమతులు ఇచ్చేందుకు ఈ పర్మిట్ విధానంను అమలు చేస్తున్నామని, ఇకపై ఇసుక తవ్వకాలకు కూడా ఇదే విధానం వర్తింపచేస్తున్నామని తెలిపారు. 

 రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఉన్న జేపీ పవర్ వెంచర్స్‌ సంస్థ ఇకపై రీచ్‌ల వారీగా ఇసుక తవ్వకాలు జరిపేందుకు ఆన్‌లైన్‌లో ఈ పర్మిట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఆయా రీచ్‌ల పరిధిలోని మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి ఎటువంటి జాప్యం లేకుండా డిఎంజి కార్యాలయం నుంచి ఈ పర్మిట్‌ను జారీ చేస్తామని అన్నారు. ఈ పర్మిట్ వల్ల ఏ రీచ్‌లో ఎంత ఇసుక తవ్వకానికి సంబంధించి అనుమతులు ఇచ్చాం, ఏ మేరకు మైనింగ్ జరిగిదనేది ఖచ్చితంగా తెలుస్తుందని, ఆన్‌లైన్‌లో దీనికి సంబంధించిన వివరాలు నమోదవ్వడం వల్ల మరింత పారదర్శకత, జవాబుదారీతనం వస్తుందని అన్నారు.

Comments