కాకినాడ, జూన్ 10 (ప్రజా అమరావతి);
కోవిడ్ టీకా డోసుల లభ్యత ఆధారంగా జిల్లాలో అందిరికీ దశల వారీగా టీకాల పంపిణీ చేపట్టనున్నట్లు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి వెల్లడించారు
. గురువారం ఉదయం కలెక్టర్ మురళీధర్‌రెడ్డి.. కాకినాడ రమణయ్యపేటలోని ఉన్నతపాఠశాలలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. టీకాల పంపిణీ సజావుగా సాగేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్, వ్యాక్సినేషన్, నిరీక్షణ గదులను పరిశీలించి, అక్కడి లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడో వేవ్‌లో కోవిడ్ చిన్నారులపై అధిక ప్రభావం చూపుతుందనే సంకేతాల నేపథ్యంలో ప్రాధాన్యత ఆధారంగా ఆరు నెలల నుంచి అయిదేళ్ల లోపు పిల్లలు గల తల్లులకు గురువారం నుంచి టీకాలు వేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తూ లబ్ధిదారులను గుర్తించి, వ్యాక్సినేషన్ జరిగేలా చూస్తున్నట్లు తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో 45 ఏళ్లకు పైబడిన వారికి దాదాపు వ్యాక్సినేషన్ పూర్తయిందని కలెక్టర్ వెల్లడించారు. కలెక్టర్ వెంట కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అదనపు కమిషనర్ నాగనరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment